Mawlynnong Travel Guide : మేఘాలయలోని తూర్పు ఖాసీ కొండల్లో దాగి ఉన్న మవ్లిన్నాంగ్(Mawlynnong).. ఆసియాలోనే అత్యంత పరిశుభ్రమైన గ్రామంగా ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకుంది. "Gods Own Garden"గా పిలిచే ఈ ప్రశాంతమైన ప్రదేశం.. స్వచ్ఛమైన, లోతైన, మరపురాని అనుభూతిని అందిస్తుంది. మీరు ప్రకృతి ప్రేమికులైతే.. సంస్కృతిని అన్వేషించేవారైతే.. రద్దీగా ఉండే పర్యాటక ప్రదేశాలకు దూరంగా ఉండాలని కోరుకుంటే.. మీరు కచ్చితంగా వెళ్లాల్సిన ప్రదేశాల్లో మవ్లిన్నాంగ్ ఒకటి.
మవ్లిన్నాంగ్ ప్రజలు ఎలా ఉంటారంటే..
మవ్లిన్నాంగ్‌ను ప్రత్యేకంగా నిలబెట్టేది దాని అందం మాత్రమే కాదు.. ఖాసీ సమాజం.. వారి క్రమశిక్షణ.. విలువలు కూడా అందరిని ఆకట్టుకుంటాయి. అక్కడ ప్రతి ఇంటి సభ్యులు గ్రామ పరిశుభ్రతను కాపాడటానికి సహకరిస్తారు. ప్రతి వీధిలో వెదురు చెత్త బుట్టలు ఉంటాయి. ఇక్కడ ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించారు. అక్కడ ప్రతి ఒక్కరు వ్యర్థాల నిర్వహణను సామూహిక బాధ్యతగా తీసుకుంటారు. పచ్చదనం చెక్కుచెదరకుండా చూసుకుంటారు. రాతితో కప్పబడిన రహదారుల వెంట పువ్వులు వికసిస్తూ కనిపిస్తాయి. సాంప్రదాయ వెదురు కుటీరాలు గ్రామానికి పోస్ట్ కార్డ్-పర్ఫెక్ట్ ఆకర్షణను ఇస్తాయి. టూరిస్టులు ఖాసీ సంస్కృతిని కూడా అనుభవిస్తారు. ఇక్కడ వంశపారంపర్యత మహిళల ద్వారా కొనసాగుతుంది. సామాజిక సామరస్యం ప్రధాన పాత్ర పోషిస్తుంది.
మవ్లిన్నాంగ్‌లో చూడదగ్గ ప్రదేశాలు ఇవే
గ్రామం నుంచి కొద్ది దూరం నడిస్తే మేఘాలయలోని ఒక అద్భుతమైన ప్రదేశం కనిపిస్తుంది. అదే రివైకి చెందిన లివింగ్ రూట్ బ్రిడ్జ్. పురాతన ఖాసీ సాంకేతికత ద్వారా రబ్బరు చెట్టు వేర్లను ప్రవాహాల మీదుగా నిర్మించి.. ఈ సహజ వంతెన ఏర్పాటు చేశారు. అయితే ఇలా చేయడానికి దశాబ్దాలు పడుతుంది. కానీ శతాబ్దాల పాటు ఉంటుంది. దాని గుండా నడవడం ప్రకృతి, మానవ ప్రతిభ కలిసి మంత్రించిన ప్రపంచంలోకి వెళ్లిన ఫీల్ రప్పిస్తుంది.
ఇక్కడ చూడదగ్గ మరో ముఖ్యమైన ప్రదేశం స్కైవాక్. గ్రామం చుట్టూ ఉన్న ప్రకృతి మార్గాలు దట్టమైన అడవులు, చిన్న ప్రవాహాలు, అస్పృశ్యంగా, ప్రశాంతంగా అనిపించే సుందరమైన వీక్షణ ప్రాంతాల ద్వారా మిమ్మల్ని తీసుకువెళతాయి. చిన్న సరిహద్దు పట్టణమైన డావ్కి గుండా ప్రవహించే ఉమ్ంగోట్ నది మేఘాలయలోని అత్యంత అద్భుతమైన సహజ అద్భుతాలలో ఒకటి. ఇది చాలా స్పష్టంగా ఉంటుంది. పడవలు గాలిలో తేలుతున్నట్లు కనిపిస్తాయి. దాని గాజు లాంటి పారదర్శకత కారణంగా గులకరాళ్లు, నదీ పరివాహక ప్రాంతాలను కూడా చూడవచ్చు.
పచ్చని చెట్లు.. తెల్లటి నీళ్లు
ఫోటోగ్రఫీతో పాటు, పడవ ప్రయాణాలు చేసేందుకు అనువైనది. ప్రశాంతమైన పర్యటనలకు ఇది బాగా హెల్ప్ చేస్తుంది. మవ్లిన్నాంగ్ నుంచి కొద్ది దూరం ప్రయాణిస్తే.. మీరు మవ్లిన్నాంగ్ జలపాతం చూడొచ్చు. దీనిని బోఫిల్ జలపాతం అని కూడా పిలుస్తారు. చుట్టూ పచ్చదనం.. పాలలాంటి నీటిని చూసి మంచి ఎక్స్పీరియన్స్ పొందవచ్చు. మవ్లిన్నాంగ్ కేవలం పరిశుభ్రమైన ప్రదేశం మాత్రమే కాదు.. ప్రకృతితో సామరస్యంగా జీవించగలిగే శైలిని హైలెట్ చేస్తుంది.