గారెలు అనగానే మినపప్పు, పెసరపప్పు, శెనగపప్పుతో చేసే గారెలు మాత్రమే గుర్తొస్తాయి. కానీ ఎర్ర కందిపప్పుతో కూడా టేస్టీ గారెలు చేసుకోవచ్చు. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలనిపించేలా ఉంటాయివి. ఓసారి ప్రయత్నించి చూడండి.


కావాల్సిన పదార్థాలు
ఎర్రకంది పప్పు - ఒక కప్పు
పచ్చిమిర్చి - రెండు
వెల్లుల్లి రెబ్బలు - నాలుగు
అల్లం ముక్క - చిన్నది
మిరియాల పొడి - అర స్పూను
ఉల్లిపాయ - ఒకటి
జీలకర్ర - ఒక స్పూను
కొత్తి మీర తరుగు - రెండు స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
నీళ్లు - సరిపడనన్ని
నూనె - వేయించడానికి సరిపడా


తయారీ ఇలా
1. ఎర్ర కందిపప్పు మూడు నాలుగు సార్లు కడిగాక నీటిలో నానబెట్టాలి. కనీసం గంట సేపు నానబెట్టాలి. 
2. నీళ్లు వంపేసి మిక్సీలో వేసుకోవాలి. అందులోనే వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి కాస్త నీళ్లు వేసి రుబ్బుకోవాలి. 
3. ఆ రుబ్బును తీసి ఓ గిన్నెలో వేసుకోవాలి. ఉల్లిపాయలను నిలువుగా సన్నగా తరిగి కలుపుకోవాలి. 
4. అలాగే ఉప్పు, మిరియాల పొడి, జీలకర్ర, కొత్తిమీర తరుగు వేసి కలుపుకోవాలి. 
5. పెనంపై నూనె వేసి రుబ్బును గుండ్రంగా గారెల్లా అద్దుకుని పెనంపై వేసి కాల్చుకోవాలి. రెండు వైపులా ఎర్రగా కాల్చుకున్నాక తీసి ప్లేటులో వేసుకోవాలి. 
6. పుదీనా చట్నీతో దీన్ని తింటే చాలా రుచిగా ఉంటుంది. 


ఎర్ర కందిపప్పు ఉపయోగాలు
1. కందిపప్పులో ఓ రకం ఎర్ర కందిపప్పు. దీనిలో ప్రొటీను అధికంగా ఉంటుంది. 
2. దీనితో సాంబార్ చేసుకుని తింటే ఎంత రుచిగా ఉంటుందో. టమాటలో కలుపుకుని తింటే మరిన్ని పోషకాలు లభిస్తాయి. 
3. పసుపు కందిపప్పుతో పోలిస్తే ఎర్ర కందిపప్పు త్వరగా అరిగిపోతుంది. దీని వల్ల గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు రావు. 
4. దీనిలో ఫోలిక్ ఆమ్లం పుష్కలంగా ఉంటుంది. గర్బిణీ స్త్రీలకు ఇవి చాలా మేలు చేస్తాయి. గర్భంలో బిడ్డ ఆరోగ్యంగా ఎదుగుతుంది. 
5. వారానికి రెండుసార్లు ఈ పప్పును తింటే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గిపోతుంది. 
6. నీరసం, అలసటతో బాధపడుతున్న వారు తరచూ ఈ పప్పును తింటే ఆ సమస్యల నుంచి త్వరగా బయటపడతారు. 
7. జుట్టు రాలే సమస్య కూడా తగ్గుతుంది. ఎముకలు కూడా బలంగా మారతాయి. 


ఈ పప్పు సూపర్ మార్కెట్లలో అధికంగా దొరుకుతుంది. దీనిలో కార్బోహైడ్రేట్లు, ఫైబర్ అధికంగా ఉంటాయి. అధిక బరువు తగ్గాలనుకునే వారికి ఈ పప్పు చాలా మేలు చేస్తుంది. ఎందుకంటే ఈ పప్పు తిన్నాక త్వరగా ఆకలి వేయదు. పొట్ట నిండుగా ఉన్న ఫీలింగ్ వస్తుంది. పిల్లలకి, పెద్దలకీ ఇద్దరికీ ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి దీనివల్ల. శరీరానికి అవసరమైన ఎన్న అమెనో ఆమ్లాలు దీనిలో ఉన్నాయి. 


Also read: బరువు పెరగాలనుకుంటున్నారా? ఈ సూపర్ ఫుడ్‌లు రోజూ తినండి



Also read: ఏటా పది లక్షల మరణాలకు కారణం అవుతోన్న దోమ, ఇది ఎన్ని రోగాలను వ్యాపింపజేస్తుందో తెలుసా?


Also read: మనం తినే ఆహారాల్లో ఉండే ఆరు విష సమ్మేళనాలు ఇవే, వీటిని ఎక్కువ తింటే అంతే సంగతులు