మలేరియా ప్రపంచవ్యాప్తంగా అత్యంత సాధారణ అంటు వ్యాధులలో ఒకటిగా ఉంది. చాలా అభివృద్ధి చెందుతున్న దేశాలలో కూడా మలేరియా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం 2021 లో 247 మిలియన్ల మలేరియా కేసులు నమోదయ్యాయి. ఇకద 2020 లో 245 మిలియన్ల కేసులు వచ్చాయి. కొన్ని సందర్భాల్లో తేలికపాటి లక్షణాలు కనిపించినప్పటికీ వాళ్ళు ప్రాణాలు కోల్పోతున్నారు. 2021 లో మలేరియా వల్ల 6,19,000 మంది ప్రాణాలు కోల్పోయారు. తీవ్రమైన పరిస్థితుల్లో మలేరియా వల్ల అవయవాలు పని చేయడం లేదు. ఈ వ్యాధి ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, మెదడులోని అవయవాలకి తీవ్ర అసౌకర్యం కలిగిస్తుంది. మలేరియాతో బాధపడుతున్న 40 శాతం మంది రోగుల్లో కనిపించే మరొక వ్యాధి అక్యూట్ కిడ్నీ ఇంజ్యూరీ(AKI).
మలేరియా కారణంగా మూత్రపిండాలను దెబ్బతీస్తుంది. రోగనిరోధక శక్తిని పోగొడుతుంది. ఈ వ్యాధి వచ్చినప్పుడు ప్రారంభంలో హిమోగ్లోబిన్ తక్కువగా ఉండటం, తెల్ల రక్త కణాల కౌంట్ ఎక్కువగా ఉండటం, తక్కువ ప్లేట్ లెట్స్, తక్కువ సీరం సోడియ. అధిక సీరం పొటాషియం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. రక్తహీనత, అతిసారం వంటి తీవ్రమైన లక్షణాలు ఉన్నాయి. మలేరియా వల్ల మూత్రపిండాలు దెబ్బతినకుండా చూసుకోవాలి. లేదంటే మూత్రపిండాల పని తీరు నెమ్మదిస్తుంది. శరీర వ్యర్థాలు లేదా ఎలక్ట్రోలైట్ బయటకి వెళ్ళడం కష్టమవుతుంది. అప్పుడు హిమోడయాలసిస్ అవసరం కావచ్చు. కిడ్నీ సమస్యలతో బాధపడే వ్యక్తులు, మలేరియా బారిన వ్యక్తుల ప్లీహము చీలిపోయే అవకాశం ఉంది. ఇది రక్తహీనతకు దారి తీస్తుంది.
మలేరియా సోకినప్పుడు సాధారణమైందేనని చాలా మంది తేలికగా తీసుకుంటారు. కానీ దాని వల్ల రోగం ముదిరి ప్రాణాంతకం కావచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ముందుగా రోగనిర్దారణ, సాధారణ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకుంటే మంచిది. ఈ పరీక్షలు దీర్ఘకాలిక అనారోగ్యాలకు దారి తీసే ఏవైనా సమస్యలను కూడా కనిపెట్టేస్తాయి. కిడ్నీ వ్యాధి సరైన సమయంలో తెలుసుకోలేక పోతే ప్రాణాలకు ప్రమాదంగా మారుతుంది. వయోజన జనాభాలో సుమారు 10 శాతం మంది కిడ్నీ వ్యాధిని కలిగి ఉన్నట్టు నివేదికలు చెబుతున్నాయి. ఏటా దాదాపు రెండు లక్షల మంది ప్రజలు తీవ్రమైన మూత్రపిండ వ్యాధి(చివరి దశ)తో పోరాడుతున్నారు. దురదృష్టవశాత్తూ వారిలో 90 శాతం మందికి పైగా డయాలసిస్ లేదా మార్పిడి రూపంలో చికిత్స చేయించుకోలేకపోవడంతో మరణిస్తున్నారు.
మలేరియా పరాన్న జీవుల వల్ల కలిగే ప్రాణాంతక వ్యాధి. ఆ పరాన్న జీవులు ఆడ ఎనాఫిలిస్ దోమలు. వీటి కాటు ద్వారానే ప్రజల్లో వ్యాపిస్తుంది. దీని బారిన పడి ఏటా లక్షల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటి వరకు దీనికి సరైన వ్యాక్సిన్ కనుగొనలేదు. కానీ గతేడాది మలేరియాకు చెక్ పెట్టే వ్యాక్సిన్ ను కనిపెట్టారు శాస్త్రవేత్తలు. పేరు మస్కిరెక్స్. ఇది మలేరియాకు కారణమయ్యే ప్లాస్మోడియం ఫాల్సిఫారమ్ ను సమర్థం అడ్డుకున్నట్టు ప్రయోగాల్లో తేలింది. ఈ వ్యాక్సిన్ నాలుగు సార్లు పిల్లలకు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ పిల్లల్లో 39 శాతం బాగా పనిచేసినట్టు బయటపడింది. త్వరలో మలేరియాతో అధికంగా బాధపడుతున్న దేశాలకు అందుబాటులోకి రావచ్చు ఈ టీకా.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: నిద్రపోయే ముందు పాలు తాగకూడదా? ఎందుకు?