వెనిల్లా, చాకొలెట్, బట్టర్ స్కాచ్... ఇలా రకరకాల ఐస్ క్రీములు బయట దొరుకుతాయి కదా, ఎప్పుడూ వాటినే తింటే బోరింగ్. ఇంట్లోనే తాజా పండ్లు ఐస్ క్రీములు తయారుచేసుకోండి. ఆరోగ్యకరం కూడా. మామిడి, కివీ, పుచ్చకాయలతో మూడు రకాల ఐస్ క్రీములు తయారు చేసుకోవచ్చు.
మ్యాంగో ఐస్ క్రీమ్
కావాల్సిన పదార్థాలు
కొబ్బరిపాలు - అరలీటరు
మామిడి పండు - ఒకటి
వెనిల్లా ఎసెన్స్ - ఒక స్పూను
మాఫుల్ సిరప్ - అరకప్పు
తయారీ ఇలా
మామిడి పండ్లు గుజ్జను మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి. దాన్ని తీసి ఒక గిన్నెలో వేయాలి. కొబ్బరిపాలు, వెనిల్లా ఎసెన్స్ వేసి బ్లెండర్లో బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మామిడి పండ్లు గుజ్జున గిన్నెలో వేసి బాగా గిలక్కొట్టాలి. మాపుల్ సిరప్‌ను కూడా మామిడి గుజ్జులో వేసి బాగా కలపాలి. ఐస్ క్రీమ్ మౌల్డ్ లో వీటిని వేయాలి. నాలుగ్గంటల పాటూ ఫ్రీజర్లో ఉంచితే మ్యాంగ్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది.
..............................................
వాటర్ మెలన్ ఐస్ క్రీము
కావాల్సిన పదార్థాలు
పుచ్చకాయ - అర ముక్క
నిమ్మరసం - రెండు స్పూన్లు
చక్కెర - రుచికి సరిపడా
తయారీ ఇలా
పుచ్చకాయ గింజలను తీసి ముక్కలుగా చేసుకోవాలి. బ్లెండర్లో వేసి గుజ్జులా చేసుకోవాలి. ఆ గుజ్జును ఒక గిన్నెలో వేయాలి. ఆ గిన్నెలో చక్కెర పొడి, నిమ్మరసం కూడా వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని ఐస్ క్రీమ్ మౌల్డ్‌లో వేసి ఫ్రీజర్లో పెట్టాలి. నాలుగ్గంటల తరువాత తీసి చూస్తే ఐస్ క్రీమ్ రెడీ.
..................
కివీ ఐస్ క్రీమ్
కావాల్సిన పదార్థాలు
కివీ పండ్లు -నాలుగు
చక్కెర - పావు కప్పు
క్రీమ్ - మూడు కప్పులు
వెనిల్లా ఎసెన్స్ - అర స్పూను
తయారీ ఇలా
కివీ పండ్ల బయటి పొరను తీసేసి చిన్న ముక్కలుగా కోసుకోవాలి. వాటిని మిక్సీలో వేసి మెత్తటి పేస్టులా చేసుకోవాలి. ఒక గిన్నెలో చక్కెర, క్రీమ్, వెనిల్లా ఎసెన్స్ వేసి బాగా కలపాలి. హ్యాండ్ బ్లెండర్ తో బాగా విస్క్ చేయాలి. ఇప్పుడు దానిలో ముందుగు చేసి పెట్టుకున్న పేస్టును కలపాలి. బాగా కలిపాక ఒక ట్రేలో వేయాలి. ఆ ట్రేను ఫ్రీజర్లో ఏడు నుంచి ఎనిమిది గంటల పాటూ ఉంచితే కివీ ఐస్ క్రీమ్ రెడీ అయినట్టే.
బయట దొరికే ఐస్ క్రీములతో పోలిస్తే ఇంట్లో చేసే ఈ ఐస్ క్రీములు చాలా మంచివి. ఆరోగ్యకరం కూడా. పిల్లలకు వీటి రుచి నచ్చుతుంది.
Also read: ఇంట్లోని బియ్యం మూటలో త్వరగా పురుగులు పట్టేస్తున్నాయా? ఈ చిట్కాలు పాటిస్తే పురుగులు చేరవు
Also read: బర్గర్‌ను ఒక పేపర్లో చుట్టి ఇస్తారు కదా, ఆ పేపర్ ఎంత ప్రమాదకరమైనదో తెలుసా
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.