ఇప్పుడు 100 కోట్ల క్లబ్ అనేది స్టార్ హీరోలకు బెంచ్ మార్క్ గా మారిపోయింది. టాలీవుడ్ లో ప్రతీ హీరో కూడా ఆ మార్క్ ని అందుకోడానికి తీవ్రంగా కష్టపడుతున్నారు. ఇప్పటికే టాప్ హీరోలందరూ ఒక్కరొక్కరుగా 100 కోట్ల క్లబ్ లో జాయిన్ అవుతూ వస్తున్నారు. 'బాహుబలి' సినిమాతో ప్రభాస్ 100 కోట్ల మార్క్ ని సెట్ చేయగా.. మహేష్ బాబు, చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ వంటి అగ్ర హీరోలు ఇప్పటికే ఈ జాబితాలో చేరిపోయారు. 'కార్తికేయ 2' చిత్రంతో యువ హీరో నిఖిల్ వంద కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకోగా.. 'ధమాకా'తో రవితేజ కూడా ఈ క్లబ్ లో జాయిన్ అయ్యాడు. అయితే ఇప్పుడు నేచురల్ స్టార్ నాని కూడా 100 కోట్ల క్లబ్ కు అతి చేరువలో ఉన్నారు.  


నాని, కీర్తి సురేశ్ హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం 'దసరా'. శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడు తెరకెక్కించిన ఈ రూరల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ శ్రీరామ నవమి సందర్భంగా భారీ ఎత్తున రిలీజ్ అయింది. తెలంగాణా సింగరేణి బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ సినిమాకు తొలి రోజే హిట్ టాక్ వచ్చింది. దీనికి తగ్గట్టుగానే కలెక్షన్స్ వచ్చాయి. మొదటి రోజు 38 కోట్ల షేర్ రాబట్టిన ఈ చిత్రం.. ఫస్ట్ వీకెండ్ లోనే 87 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. వీక్ డేస్ లోనూ ఆక్యుపెన్సీ బాగుంది కాబట్టి, ఈ వారంలోనే వంద కోట్ల మార్క్ టచ్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.


'దసరా' అనేది నాని కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా. 60 కోట్లకు పైగానే ఖర్చు చేశారనే టాక్ ఉంది. వడ్డీలు ఇతర లెక్కలు కలుపుకొని దాదాపు 80 వరకూ బడ్జెట్ అయిందని వార్తలు వచ్చాయి. నానిపై అంత బడ్జెట్ వర్కౌట్ అవుతుందా? అని కామెంట్స్ వచ్చాయి కానీ.. అందరి సందేహాలను దసరా పటాపంచలు చేసింది. బాక్సాఫీసు వద్ద ఊహించని వసూళ్లతో లాభాల బాటలో పరుగులు పెడుతోంది. నేచురల్ స్టార్ కెరీర్ లోనే తొలి వంద కోట్ల సినిమాగా నిలవనుంది.


నాని దసరా సినిమా కోసం తొలిసారిగా ఊర మాస్ అవతార్ లోకి మారిపోయాడు. రా అండ్ రస్టిక్ పాత్రలో అద్భుతమైన నటన కనబరిచాడు. ఈ చిత్రంతో నాని మార్కెట్ రెట్టింపు అయ్యిందనడంలో ఎలాంటి సందేహం లేదు. డెబ్యూ డైరక్టర్ ను నమ్మి రిస్క్ చేసినందుకు, నానికి తగిన ప్రతిఫలం దక్కింది. తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. మరోవైపు నటుడిగా మరో మెట్టు ఎక్కాడనే పేరు తెచ్చుకున్నాడు. కాకపొతే ఈ చిత్రంతో బాలీవుడ్ లో సత్తా చాటాలనే నాని కోరిక మాత్రం నెర వెరలేదని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి.


'దసరా' నానికి ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. తెలుగుతో పాటు హిందీ తమిళం మలయాళం కన్నడ భాషల్లో రిలీజ్ చేశారు. ఈ చిత్రంతో బాలీవుడ్ లో స్టార్ డమ్ తెచ్చుకోవాలని నాని ఆశ పడ్డాడు. అందుకు తగ్గట్టుగానే నార్త్ లో విపరీతంగా ప్రచారం చేశాడు. పలు ప్రధాన నగరాలు తిరిగి ప్రమోషన్స్ చేశాడు. ఓ రకంగా చెప్పాలంటే తెలుగులో కంటే, మిగిలిన భాషల్లోనే ఎక్కువగా ప్రమోషన్లు చేశారు. అయితే ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లు దక్కాయి కానీ, నార్త్ లో ఆశించిన కలెక్షన్స్ రాలేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.


హిందీలో 'దసరా' సినిమా ఫస్ట్ డే 52 లక్షలు కలెక్ట్ చేయగా.. మొదటి నాలుగు రోజుల్లో 2.46 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించినట్లుగా ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. రోజు రోజుకూ వసూళ్ళు బెటర్ గా ఉంటున్నప్పటికీ, ఆశించిన స్థాయిలో లేవని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో నార్త్ లో క్రేజ్ సంపాదించుకోవాలనుకున్న నానీకి నిరాశే ఎదురైనట్లుగా టాక్ నడుస్తోంది. 


Also Read : సమంతకు సలహా ఇవ్వలేనంటున్న ప్రియాంకా చోప్రా!






తెలుగులో మాస్ సినిమాలు చేసే హీరోలకు నార్త్ సర్క్యూట్స్ లో మంచి క్రేజ్ ఉంటుంది. బెల్లంకొండ శ్రీనివాస్, రామ్ పోతినేని లాంటి కుర్ర హీరోల సినిమాలను డబ్బింగ్ చేసి యూట్యూబ్ లో వదిలితే, మిలియన్ల కొలదీ వ్యూస్ వస్తుంటాయి. కానీ నాని నుంచి ఇప్పటి వరకూ వచ్చినవన్నీ క్లాస్ సినిమాలే. అందుకే హిందీలో పెద్దగా పాపులారిటీ రాలేదు. ఇప్పుడు దసరా సినిమాకు అక్కడ ఆదరణ తగ్గడానికి అది కూడా ఒక కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ చిత్రం థియేటర్లో ఆడకపోయినా హిందీ డబ్బింగ్ రూపంలో, శాటిలైట్ రైట్స్ రూపంలో మంచి ధర పలికింది. రాబోయే రోజుల్లో నానికి నార్త్ లో మంచి మార్కెట్ క్రియేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంచనాలు వేస్తున్నారు.


Also Read ప్రాణం, ప్రపంచం - పిల్లల పేర్లు ప్రకటించిన నయన్, విఘ్నేష్!