South Indian Recipe Munakkada Sambar : ఇడ్లీ - సాంబార్, రైస్ - సాంబార్ ఇలాంటి ట్రెడీషనల్​ వంటల్లో సాంబార్​ కచ్చితంగా ఉంటుంది. వెజ్ ఫంక్షన్ అయినా, నాన్​ వెజ్ ఫంక్షన్ అయినా.. సాంబార్ ఉండాల్సిందే మరి. ఈ సాంబార్​లో మునక్కాడ సాంబార్​ క్రేజ్​ వేరనే చెప్పాలి. దాని రుచి.. చిక్కదనం, స్మెల్​కి ఎవరైనా దాసోహం అవ్వాల్సింది. ముఖ్యంగా మద్రాస్ స్టైల్​లో చేసే మునక్కాడ సాంబార్ అమోఘం అనే చెప్పాలి. ఈ టేస్టీ రెసిపీని ఎలా తయారు చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏమిటి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.  


కావాల్సిన పదార్థాలు


మెంతిగింజలు - పావు స్పూన్


ధనియాలు - 1 టేబుల్ స్పూన్


పచ్చి శెనగపప్పు - అర టేబుల్ స్పూన్


మినపప్పు - 1 టీస్పూన్


మిరియాలు - పావు టీస్పూన్ 


ఎండుమిర్చి - 2


తాజా కొబ్బరి - పావు కప్పు


గసగసాలు - 1 టీస్పూన్ 


జీలకర్ర - అర టీస్పూన్ 


నూనె - రెండు టేబుల్ స్పూన్లు 


చింతపండు - నిమ్మకాయ అంత (రసం తీసుకోవాలి)


కందిపప్పు - అరకప్పు


వెల్లుల్లి రెబ్బలు - 8


పసుపు - పావు టీస్పూన్


నీరు - 2 కప్పులు 


సాంబార్​కు కావాల్సిన పదార్థాలు 


నూనె- 1 టేబుల్ స్పూన్ 


చిన్న ఉల్లిపాయలు -20 


మునగకాయ - 2


నీరు - 2 కప్పులు


కరివేపాకు - రెండు రెమ్మలు


పచ్చిమిర్చి - 2


టొమాటో - పావు కప్పు ముక్కలు


ఉప్పు - రుచికి తగినంత 


కారం - 1 టేబుల్ స్పూన్


పసుపు - పావు టీస్పూన్ 


బెల్లం - 1 టేబుల్ స్పూన్ 


కొత్తిమీర - 1 చిన్న కట్ట


తాళింపు కోసం.. 


నూనె - 1 టేబుల్ స్పూన్


ఆవాలు - 1 టీస్పూన్


వెల్లుల్లి - 10 రెబ్బలు


ఎండుమిర్చి - 2 


ఇంగువ - చిటికెడు 


జీలకర్ర - పావు టీస్పూన్ 


కరివేపాకు - 1 రెమ్మ 


కొత్తిమీర - చిన్న కట్ట 


తయారీ విధానం 


కందిపప్పను కడిగి 30 నిమిషాలు నానబెట్టాలి. అనంతరం కుక్కర్​లో వేసి దానిని ఉడకనివ్వాలి. పప్పును ఉడికిన తర్వాత పప్పు గుత్తితో మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి దానిపై పెద్ద కడాయి పెట్టండి. దానిలో నూనె వేసి.. అది వేడి అయ్యాక.. మెంతులు, మినపప్పు, పచ్చిశనగపప్పు, మిరియాలు, ఎండుమిర్చి వేసి వేయించాలి. పప్పు రంగు మారగానే దానిలో ఎండుమిర్చి వేయాలి. జీలకర్ర కూడా వేసి వేయించాలి. అవి ఫ్రై అయ్యాక.. దానిలో కొబ్బరిముక్కలు, గసగసాలు వేయించుకోవాలి. అవి వేడి అయిన తర్వాత కాస్త చల్లారక.. మిక్సీలో వేసి పేస్ట్ మాదిరిగా చేసుకోవాలి. 


ఇప్పుడు అదే కడాయిలో నూనెవేసి సాంబార్ ఉల్లిపాయలు, మునగకాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ రంగు మారిన తర్వాత దానిలో పచ్చిమిర్చి వేసి.. అనంతర నీరు వేయాలి. మునగకాయ ఉడికిన తర్వాత దానిలో టమోటాలు వేయాలి. అవి కాస్త మగ్గాక.. దానిలో చింతపండు ప్యూరీ వేసి ఓ ఐదు నిమిషాలు ఉడికించాలి. ఇప్పుడు మరుగుతున్న దానిలో ముందుగా తయారు చేసి పెట్టుకున్న కొబ్బరిపేస్ట్ వేసి బాగా కలపాలి. దానిలో ఉడికించి పప్పు మిశ్రమం, కారం, పసుపు, చిన్న బెల్లం ముక్క, కొత్తమీర తురుము వేసి బాగా కలపాలి. అనంతరం దానిలో నీటిని వేసి కలపి.. పావు గంట ఉడికించాలి. ఉడికే సమయంలో సాంబార్ అడుగుఅంట కుండా కలుపుతూ ఉండాలి. 



ఇప్పుడు మరో స్టౌవ్ వెలిగించి తాళింపు కడాయిని పెట్టాలి. దానిలో నూనె వేసి.. దానిలో ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు వేయాలి. ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు, చిటికెడు ఇంగువ వేసి వేయించుకోవాలి. ఈ తాళింపు మిశ్రమాన్ని.. మరుగుతున్న పప్పులో వేయాలి. తాళింపు వేశాక.. సాంబార్​ను మరో 5 నిమిషాలు మరగనివ్వాలి. దీనివల్ల తాళింపు ఫ్లేవర్​ అంతా సాంబార్​లోకి వెళ్తుంది. అంతే వేడి వేడి టేస్టీ మునక్కాడ సాంబార్ రెడీ. దీనిని మీరు ఇడ్లీ సాంబార్​కోసం.. బిసిబిల్లా బాత్​ కోసం.. వేడి వేడి అన్నంలో కలిపి హాయిగా లాగించేయవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ మద్రాస్ స్టైల్ సాంబార్​ను మీరు కూడా ట్రై చేసేయండి. 


Also Read : అంతర్జాతీయ నృత్య దినోత్సవం హిస్టరీ, ప్రాముఖ్యత ఇవే.. ఈ సంవత్సరం థీమ్​ స్పెషల్ ఇదే