ప్రేమ ఎప్పుడు, ఎవరి మీద పుడుతుందో చెప్పలేమంటుంటారు.. నిజమే కదా!..
"ప్రేమంటే ఏమిటంటే.. అది ప్రేమించినాక తెలిసే.." ఇది ఒక పాటలోని పల్లవి. ఇలా ప్రేమ గురించి ఎంతో మంది కవులు, రచయితలు, ప్రేమికులు వర్ణిస్తూనే ఉన్నారు. నాటి నుంటి నేటి వరకు ప్రేమ చిగురిస్తూనే ఉంది. వసంతమై విరబూస్తూనే ఉంది. అసలు ప్రేమకు నిర్వచనం ఏంటో తెలుసా? అని ఎవరైనా ప్రశ్నిస్తే.. నిర్వచనం లేనిదే ప్రేమ.. అని బదులిచ్చింది ఓ ప్రేమ జంట.
ప్రస్తుతం వైరల్‌గా మారిన ఆ ప్రేమ కథ ఏంటో తెలుసా? ప్రేమ అంటే అమ్మాయి, అబ్బాయి మధ్య ఉండేదేనా? కాదు రెండు మనసుల మధ్య మొదలయ్యేదని నిరూపించింది ఆ జంట.. మరి వారి ప్రేమ కథ ఏంటో మీరే చూడండి.
అలా మొదలైంది..
పరోమిత, సురభి.. నాగ్‌పుర్‌కి చెందిన ఈ ఇద్దరు వైద్యులే.. బాగా చదువుకున్నవారే. అందులోనూ సురభి సైకియాట్రిస్ట్. వీరిద్దరూ కోల్‌కతాలో మానసిక ఆరోగ్యంపై నిర్వహించిన సదస్సులో భాగంగా ఓసారి కలుసుకున్నారు. ఈ కాన్ఫరెన్స్‌లో సురభి వక్తగా హాజరైంది. అప్పుడు ఇద్దరికీ పరిచయమైంది.
ఆరోజు సమావేశం అయి తిరిగి వెళ్లేటప్పుడు ఇద్దరూ ఇన్‌స్టాగ్రామ్ ఐడీలు ఇచ్చిపుచ్చుకున్నారు. అప్పట్నుంచి రోజూ మాట్లాడుకోవడంతో మరింత దగ్గరయ్యారు.
గోవాలో..
ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టమున్నప్పటికీ చెప్తే మరొకరు ఏమనుకుంటారోనని ఆలోచించేవారట ఈ లెస్బియన్ కపుల్. కానీ ఒకసారి పరోమిత ధైర్యం చేసి తన ప్రేమను సురభికి చెప్పాలనుకుంది. ఇందుకు గోవానే సరైన ప్రదేశం అనుకుంది.
కానీ చెప్తే సురభి ఎలా రియాక్టవుతుందోనని మదనపడి.. ఫోన్‌లో ముందే ఈ విషయాన్ని చెప్పేసింది పరోమిత. "ఫ్రెండ్స్‌తో గోవా వెళ్లాలనుకుంటున్నాను.. నువ్వు కూడా వస్తావా" అని పరోమిత అడిగేసింది. అంతేకాకుండా ఈ ప్లాన్ గురించి, లవ్ ప్రపోజల్ గురించి ముందుగానే చెప్పిసిందట.
"ఒకవేళ నేను బీచ్‌లో అందరి ముందు నీకు లవ్ ప్రపోజ్ చేస్తే నువ్వు తిరస్కరిస్తావా?" అని పరోమిత అడిగేసింది.
"లేదు.. నేనెందుకు అలా చేస్తాను" అని సురభి చెప్పేసిరికి పరోమిత ఆనందానికి అవధుల్లేవు. కుటుంబ సభ్యులు ముందు కాదన్నప్పటికీ తర్వాత వీరిద్దరి ఇష్టాలకు గౌరవం ఇచ్చి ఒప్పుకున్నారు.
ఈ జంట ఇటీవలే నాగ్‌పూర్‌లోని ఓ రిసార్ట్‌లో నిశ్చితార్థం చేసుకుంది. పెళ్లి మాత్రం గోవాలోనేనట.