Cucumaber: కీరా దోస అన్ని సీజన్లలోనూ దొరుకుతుంది. కానీ ఎక్కువమంది వేసవికాలంలోనే వాటిని తింటూ ఉంటారు. నిజానికి వీటిని అన్ని కాలాల్లో తినొచ్చు. నీటితో నిండిన ఈ కీరా దోసలను తినడం వల్ల శరీరంలో తేమ పుష్కలంగా ఉంటుంది. దీనివల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఎన్నో రకాల రోగాలు కూడా రాకుండా ఉంటాయి. బరువు కూడా అదుపులో ఉంటుంది. చక్కటి జీర్ణక్రియకు ఇవి ఎంతో సహాయపడతాయి.
గుమ్మడికాయలు, పుచ్చకాయల జాతికి చెందిన కీరా దోసకాయ కూడా దీన్ని కొంతమంది తొక్కతోపాటు తింటే మరికొందరు తొక్క తీసేసి తింటారు. ఎలా తిన్నా ఆరోగ్యమే. తొక్కలో కూడా ఎన్నో పోషకాలు ఉంటాయి. విటమిన్ కే, విటమిన్ సి, క్యాల్షియం, పొటాషియం, పీచు అధికంగా ఉంటాయి. విటమిన్ కే కూడా లభిస్తుంది. కొంతమేరకు ప్రోటీన్ కూడా ఉంటుంది. కాబట్టి కీరాదోసను తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. దోసకాయలను పచ్చిగానే తింటాం. కాబట్టి అందులో ఉండే పోషకాలు ఏవి బయటకి పోకుండా శరీరంలోనే చేరుతాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కొన్ని రకాల జబ్బులు బారిన పడకుండా కాపాడుతాయి. ఒంట్లో నీటి శాతం తగ్గితే అనేక రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కీరాదోసలో 96 శాతం వరకు నీరే. కాబట్టి వీటిని రోజుకి ఒకటి తిన్నా చాలు. కిడ్నీలు, మెదడు ఆరోగ్యంగా పనిచేస్తాయి. శరీర ఉష్ణోగ్రత కూడా నియంత్రణలో ఉంటుంది. నీళ్ల బాటిల్ తీసుకెళ్లడానికి వీలు లేకపోతే రెండు మూడు దోసకాయలు తీసుకెళ్లండి చాలు. దాహం తీరిపోతుంది.
బరువును తగ్గించుకోవాలనుకునే వారికి కీరాదోస చాలా మంచి ఎంపిక. దీనిలో చక్కర చాలా తక్కువగా ఉంటుంది. క్యాలరీలు, పిండి పదార్థాలు కూడా అత్యల్పం. కాబట్టి రోజుకు రెండు మూడు దోసకాయలు తినేస్తూ ఉంటే కడుపు నిండిన భావన వస్తుంది. ఇతర ఆహారాలు తినరు కాబట్టి బరువు ఆరోగ్యంగా తగ్గుతారు. బరువు తగ్గడం వల్ల మధుమేహం వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది. డయాబెటిస్ ఉన్నవారికి కూడా దోసకాయ ఎంతో మేలు చేస్తుంది. దీని గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. అంటే ఇది తిన్నాక రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగడం చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి మధుమేహం ముదరకూడదు అనుకుంటే దోసకాయను తినడం అలవాటు చేసుకోండి.
దోసకాయల్లో ఉండే ఒక ప్రత్యేకమైన రసాయనం క్యాన్సర్ కణాలు అభివృద్ధి చెందకుండా అడ్డుకుంటుంది. కాబట్టి రోజుకి ఒక దోసకాయ తినే వారిలో కాలేయం, ఊపిరితిత్తులు, రొమ్ము, ప్రొస్టేట్ క్యాన్సర్లు వచ్చే అవకాశం చాలా తక్కువ అని ఒక అధ్యయనం చెబుతోంది. దోసకాయను వీలైనంత వరకు పొట్టుతో సహా తినడానికే ప్రయత్నించండి. ఎందుకంటే పొట్టు కూడా క్యాన్సర్ నిరోధించడంలో ముందుంటుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.