Deep Sea Mysterious Creatures : సముద్రంలోని అత్యంత అంతుచిక్కని జీవులలో జెల్లీ ఫిష్ ఒకటి. ఇవి చూసేందుకు అందంగా, ప్రమాదకరంగా, సరళంగా, సంక్లిష్టంగా ఉంటాయి. అయితే ఈ జెల్లీ ఫిష్‌లు 500 మిలియన్ సంవత్సరాలకు పైగా నీటిలో మనుగడసాగిస్తున్నాయి. ఇవి డైనోసార్ల కంటే ముందు నుంచే మనుగడలో ఉన్నాయని చెప్తారు. అయితే ఈ పారదర్శక జీవులు లోతైన సముద్రాలలో కనిపిస్తాయి. వీటికి మెదడు, గుండె, ఎముకలు ఉండనప్పటికీ.. అవి శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచే విధంగా మనుగడ విధానాలను అభివృద్ధి చేశాయి. అవేంటో.. వాటి గురించిన ఇంట్రెస్టింగ్ విషయాలు ఏంటో చూసేద్దాం.
జెల్లీ ఫిష్‌లు డైనోసార్ల కంటే పాతవి
డైనోసార్లు భూమిపై తిరగడానికి ముందు నుంచే జెల్లీ ఫిష్‌లు సముద్ర ప్రవాహాలలో ఉన్నాయి. శిలాజ రికార్డుల ప్రకారం ఇవి 500 మిలియన్ సంవత్సరాలకు పైగా ఉన్నాయట. భూమిపై పురాతన జీవ జాతులలో ఇది కూడా ఒకటిగా నిలిచింది. అంతరించిపోయిన ఇతర పురాతన జీవుల మాదిరిగా కాకుండా.. జెల్లీ ఫిష్‌లు పర్యావరణ మార్పుల ద్వారా వృద్ధి చెందాయి.
జెల్లీ ఫిష్కి "అమరత్వం"
ప్రకృతిలో అత్యంత ఆశ్చర్యకరమైనది టూరిటోప్సిస్ డోర్ని. దీనిని తరచుగా అమర జెల్లీ ఫిష్ అని పిలుస్తారు. గాయం, ఒత్తిడి లేదా వృద్ధాప్యం వచ్చినప్పుడు ఈ ప్రత్యేక జాతి తన లైఫ్‌ని మార్చేసుకుంటుంది. దాని వయోజన కణాలను తిరిగి వాటిని చిన్న, పాలిప్ దశకు చేరేలా మారుస్తుంది. దీని అర్థం ఏమిటంటే.. దానిని ఏదైనా జంతువు తినకపోయి.. నాశనం చేయకపోతే.. అది ఎప్పటికీ జీవించగలదు. ప్రధానంగా మధ్యధరా సముద్రంలో, జపాన్ సమీపంలో కనిపించే ఈ జెల్లీ ఫిష్ పునరుత్పత్తి జీవశాస్త్రం గురించి అంతర్దృష్టిని అందిస్తూ శాస్త్రీయ అద్భుతంగా మారింది.
మెదడు లేకపోయినా నావిగేట్ చేస్తాయట
మెదడు లేనప్పటికీ.. జెల్లీ ఫిష్‌లు కాంతి, ప్రకంపనలు, నీటిలోని రసాయనాలను గుర్తించే ఒక సంక్లిష్టమైన నాడీ వ్యవస్థ ఉంది. ఇది వాటిని వేటాడటానికి, ప్రమాదాన్ని నివారించడానికి సహాయపడుతుంది. కొన్ని జాతులకు 24 కళ్లు ఉంటాయట. ఇవి ఇతర సముద్ర జీవుల కంటే బాగా పరిసరాలను చూసేందుకు వీలు కల్పిస్తాయి. వాటి స్పందన, కదలిక కేవలం యాదృచ్ఛికం కాదు. ఇది శక్తిని ఆదా చేసే, సముద్ర ప్రవాహాల ద్వారా సునాయాసంగా తేలియాడేందుకు సహాయపడే సమన్వయ ప్రయత్నంగా చెప్తారు.
చీకటిలో మెరుస్తాయి
జెల్లీ ఫిష్ జాతులు బయోలుమినిసెంట్ అనే రసాయన ప్రతిచర్యల ద్వారా శరీరం నుంచి సొంత కాంతిని ఉత్పత్తి చేస్తాయి. ఈ మెరుపు ఆహారాన్ని ఆకర్షించడం నుంచి వేటాడేవారిని కన్ఫ్యూజ్ చేయడానికి, సహచరులను ఆకర్షించడానికి హెల్ప్ చేస్తుంది. శాస్త్రవేత్తలు కణాలలో జన్యుపరమైన కార్యాచరణను గుర్తించడానికి GFP - గ్రీన్ ఫ్లోరోసెంట్ ప్రోటీన్ అని పిలిచే జెల్లీ ఫిష్ మెరిసే ప్రోటీన్లను వైద్య పరిశోధనలో కూడా ఉపయోగించారు.
నిమిషాల్లోనే మనిషిని చంపగలవు
అన్ని జెల్లీ ఫిష్‌లు హానిచేయవు. కానీ ఆస్ట్రేలియా, ఇండో-పసిఫిక్ మహాసముద్రంలో కనిపించే బాక్స్ జెల్లీ ఫిష్ భూమిపై అత్యంత విషపూరిత సముద్ర జంతువుగా చెప్తారు. దాని తంతువులు నిమిషాల్లో గుండె వైఫల్యానికి కారణమయ్యేంత శక్తివంతమైన టాక్సిన్‌లను అందిస్తాయట. ఇవి సమర్థవంతంగా వేటాడి.. చిన్న చేపలు, క్రస్టేసియన్లను తక్షణమే పక్షవాతానికి గురి చేయడానికి విషాన్ని ఉపయోగిస్తాయట.
పర్యావరణ వ్యవస్థలో కీలక పాత్ర
జెల్లీ ఫిష్‌లు కేవలం తేలియాడేవి మాత్రమే కాదు. సముద్ర పర్యావరణ వ్యవస్థలో కూడా ఒక ముఖ్యమైన భాగం. ఇవి కొన్ని సముద్ర జంతువులను నియంత్రిస్తూ.. సముద్ర తాబేళ్లు, సన్‌ఫిష్, సముద్ర పక్షులకు ఆహారంగా పనిచేస్తాయి. ఈ జెల్లీ ఫిష్‌లు చనిపోయినప్పుడు కుళ్ళిపోయే దశలో కూడా సముద్ర జీవితానికి మద్దతు ఇచ్చే పోషకాలను విడుదల చేస్తాయట. కొన్ని ప్రాంతాల్లో జెల్లీ ఫిష్ కనిపించడాన్ని సముద్ర పర్యావరణంలో మార్పులకు సంకేతంగా చెప్తారు.
అంతరిక్షంలో కూడా జీవించగలవట
ఒక ఆసక్తికరమైన నాసా ప్రయోగంలో భాగంగా 1990లలో కొలంబియా షటిల్‌లో జెల్లీ ఫిష్ పాలిప్స్‌ను అంతరిక్షంలోకి పంపారు. ఆశ్చర్యకరంగా, అవి సున్నా గురుత్వాకర్షణలో కూడా పునరుత్పత్తి చెందాయి. వాటి సంతానం సాధారణంగా అభివృద్ధి చెందింది. ఈ ప్రయోగం జీవులు మైక్రోగ్రావిటీకి ఎలా అలవాటు పడతాయో తెలిపింది. జీవ ప్రక్రియలపై అంతరిక్ష ప్రయాణం ప్రభావాలను అర్థం చేసుకోవడానికి శాస్త్రవేత్తలకు సహాయపడింది.