ఆరోగ్య సమస్యల కారణంగా గర్భం ధరించలేని వారికి వరం లాంటిది ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్(ఐవీఎఫ్). ఈ చికిత్స తల్లి కాలేకపోతున్నామనే ఎంతో మంది స్త్రీలకు మళ్ళీ కొత్త ఆశలు చిగురించేలా చేస్తుంది. వైద్యుల సహాయంతో ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ద్వారా గర్భం ధరించి క్షేమంగా బిడ్డలని కంటున్నారు. కానీ ఐవీఎఫ్ చికిత్స వల్ల స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని ఒక భయంకరమైన అధ్యయనం వెలుగులోకి వచ్చింది. ఐవీఎఫ్ ద్వారా డెలివరీ అయిన మహిళలు 12 నెలలలోపు స్ట్రోక్ వల్ల హాస్పిటల్ పాలవుతున్నారని అధ్యయనం తెలిపింది. 2010 నుంచి 2018 మధ్య ప్రసవించిన 3 కోట్ల మంది గర్భిణీల మెడికల్ డేటాని రట్జర్స్ విశ్వవిద్యాలయ పరిశోధకులు విశ్లేషించారు.
స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఎక్కువే..
వంధ్యత్వానికి చికిత్స తీసుకున్న మొత్తం 66 శాతం మంది మహిళలు స్ట్రోక్ బారిన పడినట్టు వాళ్ళు కనుగొన్నట్టు పరిశోధకలు వెల్లడించారు. ప్రాణాంతకమైన స్ట్రోక్, హేమరేజిక్ స్ట్రోక్, ఇస్కీమిక్ స్ట్రోక్ తో బాధపడే అవకాశం 55 శాతం ఎక్కువగా ఉంది. మెదడులో ఒక ప్రాంతానికి రక్త సరఫరా నిలిచిపోవడం వల్ల ఇస్కీమిక్ స్ట్రోక్ సంభవిస్తుంది. రక్తనాళాలలో చీలిక ఏర్పడి మెదడులో రక్తస్రావం జరగడం వల్ల హేమరేజిక్ స్ట్రోక్ వస్తుంది. ముఖ్యంగా ప్రసవించిన తర్వాత మొదటి 30 రోజుల్లో ఈ స్ట్రోక్ ప్రమాదం పెరుగుదల స్పష్టంగా కనిపించినట్టు నిపుణులు తెలిపారు. అందుకే ఐవీఎఫ్ డెలివరీ తర్వాత వాళ్ళని నిరంతరం చెక్ చేస్తూ ఉండాల్సిన అవసరం ఉందని పరిశోధకులు భావిస్తున్నారు.
కారణమేంటి?
సాంకేతికతలో పురోగతి, వంధ్యత్వ చికిత్సకి మెరుగైన మందులు అందిస్తున్న తరుణంలో ఇటువంటి అధ్యయనం బయటకి రావడం ఆందోళన కలిగించే అంశమే. సంతానోత్పత్తికి చికిత్స తీసుకుంటున్న మహిళలు ఎక్కువగా దీని బారిన పడుతున్నారు. అయితే వాళ్ళకి ఎందుకు స్ట్రోక్ వస్తుందనే దానికి మాత్రం పూర్తి కారణాన్ని పరిశోధకులు ఇంకా కనుగొనలేకపోయారు. ఈ ప్రక్రియలు చేయించుకునే మహిళలు తప్పనిసరిగా తీసుకోవాల్సిన హార్మోన్ చికిత్సల వల్ల ఇలా జరుగుతూ ఉండవచ్చని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఐవీఎఫ్ ద్వారా గర్భం దాల్చిన మహిళలు ప్రసవించిన తర్వాత స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించేందుకు నిరంతరం వారిని ఫాలో అప్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
అది మాత్రమే కాదు..
కార్డియోవాస్కులర్ డీసీజ్(CVD) మహిళల్లో మరణానికి ప్రధాన కారణం. ప్రతి సంవత్సరం సీవీడీ కారణంగా ముగ్గురిలో ఒకరు మరణిస్తున్నారు. ఈ మధ్య కాలంలో స్ట్రోక్ పురుషులు, స్త్రీలలో మరణానికి మూడవ ప్రధాన కారణంగా మారింది. ఐదుగురిలో ఒకరు తమ జీవితకాలంలో స్ట్రోక్ అభివృద్ధి చేసే ప్రమాదాన్ని కలిగి ఉంటున్నారని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి. అయితే సీవీడీ, స్ట్రోక్ వచ్చేందుకు గల కారణాలు మాత్రం ఎందుకు వస్తున్నాయో తెలుసుకోవడానికి మరింత పరిశోధనలు అవసరం.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: ఈ హెల్తీ డ్రింక్స్ తో రోజు స్టార్ట్ చేశారంటే కాఫీ, టీ ధ్యాసే ఉండదు!