Kids Weight: కొంతమంది పిల్లలు చాలా సన్నగా ఉంటారు. ఎత్తుకు తగిన బరువు కలిగి ఉండరు. బక్కగా కనిపిస్తారు. తల్లిదండ్రులు ఎంతగా వారి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నా... వారు త్వరగా బరువు పెరిగే అవకాశం ఉండదు. అలాంటి వారికి రాత్రంతా నానబెట్టిన వేరుశనగలను ఉదయాన్నే తినిపించడం అలవాటు చేయాలి. ఇలా కొన్ని రోజులు పాటు తినడం వల్ల వారు ఆరోగ్యంగా బరువు పెరిగే అవకాశం ఉంది. జంక్ ఫుడ్ వంటివి తినడం వల్ల బరువు త్వరగా పెరగవచ్చు. కానీ అవి ఎంతో అనారోగ్య కరమైనది. శరీరంలో కొవ్వు పేరుకుపోయేలా చేస్తుంది. అందుకే బరువు పెరగాలన్నా, తగ్గాలన్నా ఆరోగ్యకరమైన పద్ధతిలోనే జరగాలి.
ఎక్కువమంది పిల్లల్లో బరువు తక్కువగా ఉండే సమస్య ఉంటుంది. అలాంటి వారికి మలబద్ధకం, ఆకలి లేకపోవడం వంటి సమస్యలు కూడా ఉండవచ్చు. కాబట్టి ముందుగా మలబద్ధకం సమస్య లేకుండా పీచు నిండిన ఆహారాలను వారికి తినిపించాలి. ఆ తరువాత రాత్రిపూట గుప్పెడు పల్లీలను తీసి నీళ్లలో నానబెట్టాలి. మరుసటి రోజు ఈ నానబెట్టిన పల్లీలతో పాటు, పచ్చి కొబ్బరి తురుమును, మొలకెత్తిన గింజలను, ఖర్జూర పండ్లను కలిపి సలాడ్‌లా చేసి వారి చేత తినిపించాలి. అల్పాహారంగా ఈ సలాడ్‌ను తినిపించడంతోపాటు ఒక అరటిపండును కూడా పెట్టాలి. ఇలా ప్రతిరోజు తినిపిస్తే వారికి తగినంత ప్రోటీన్ అందుతుంది. దీనివల్ల వారు ఆరోగ్యంగా బరువు పెరిగే అవకాశం ఉంది. కేవలం ఈ సలాడ్ ఒక్కటే పిల్లలకు అల్పాహారంగా సరిపోకపోవచ్చు. కాబట్టి వీటితో పాటు రెండు ఇడ్లీలను కూడా తినిపిస్తే మంచిది. ఉడకబెట్టిన గుడ్డును కూడా తినిపించడం చాలా అవసరం.
ఇక మధ్యాహ్నానికి బ్రౌన్ రైస్ వండి వారికి తినిపించండి. అలాగే జొన్నలు, కొర్రలతో వండిన రెసిపీలను తినిపిస్తే ఇంకా మంచిది. ఇవన్నీ కూడా ఆరోగ్యంగా బరువు పెరిగేలా చేస్తాయి. సోయాతో చేసిన ఉత్పత్తులను అధికంగా వారికి పెట్టండి. సోయాతో చేసిన మీల్ మేకర్ మార్కెట్లో విరివిగా దొరుకుతుంది. అలాంటి వాటితో స్నాక్స్‌ని తయారు చేసి వారికి తినిపించండి. అలాగే పప్పులు, ఆకుకూరలు కచ్చితంగా తినేలా చూడండి.
సాయంత్రం పూట స్నాక్స్‌గా సన్ ఫ్లవర్ సీడ్స్, గుమ్మడి గింజలు, పిస్తా, జీడిపప్పు, బాదంపప్పు వంటి వాటిని నానబెట్టి వారికి ఇవ్వండి. ఈ పప్పులను తినడం వల్ల వారికి ఆరోగ్యకరమైన కొవ్వు చేరుతుంది. అలాగే కాస్త బరువు కూడా పెరుగుతారు. ఎండు ఖర్జూరాలను తినిపించడం వల్ల వారికి మేలు జరుగుతుంది. రాత్రిపూట టిఫిన్లు పెట్టడం వంటివి మానేయండి. మధ్యాహ్నం బ్రౌన్ రైస్ తింటే, రాత్రిపూట వారికి తెల్ల అన్నం తినిపించండి. బంగాళదుంప, కోడిగుడ్లు, చికెన్ వంటి కూరలను తినిపించండి. ఎప్పుడైనా కూర ఎక్కువగా పెట్టి అన్నాన్ని తగ్గించండి. మన శరీరానికి కావలసిన శక్తిని, ఆరోగ్యాన్ని అందించేవి కూరలే. ఇలా రెండు నెలల పాటు మెనూ కొనసాగిస్తే పిల్లలు ఆరోగ్యంగా బరువు పెరిగే అవకాశం చాలా ఎక్కువ. కేవలం వారం రోజుల్లో ఎలాంటి ప్రభావము కనబడదు. నెలరోజుల తర్వాత మీకు మార్పు కనిపిస్తుంది. రెండు నెలలకు వారు ఆరోగ్యంగా కనిపిస్తారు. కాబట్టి పిల్లలకు ఇలాంటి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించేందుకు తల్లిదండ్రులు ప్రయత్నించాలి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.