పాలు, పాల పదార్థాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. కానీ వాటిని తీసుకునేందుకు కొంతమంది అసలు ఆసక్తి చూపించరు. కానీ పాలు శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. కాల్షియం, ఫాస్పరస్, విటమిన్లు బి, డి, పొటాషియం వంటి పోషకాలతో నిండి ఉన్నాయి. ఇవి ఎముకలని ఆరోగ్యంగా ఉంచుతాయి. ప్రోటీన్లు లభించే అధ్బుతమైన ఆహారం ఇది. పాలు, పెరుగు వాసన గిట్టదు అని కొందరు వాటిని దూరం పెట్టేస్తారు. అసలు తినకుండా కంప్లీట్ గా వదిలేస్తారు. అలా వదిలెయ్యడం మంచిదేనా? అని అంటే.. కాదని అంటున్నారు పోషకాహార నిపుణులు.


రోజువారీ ఆహారంలో పాలు, పాల ఉత్పత్తుల ప్రాముఖ్యత గురించి పోషకాహార నిపుణులు రుజుతా దివేకర్ ఓ మీడియా సంస్థకు ఇలా వివరించారు. పాలుకు సంబంధించి అలర్జీ ఉంటే తప్ప వాటిని పూర్తిగా వదిలివేయకూడదని తెలిపారు. భారతీయులు పెరుగుతో తినకుండా తమ భోజనం ముగించరు. కడుపుని శుభ్రపరిచేందుకు పెరుగు కీలకంగా వ్యవహరిస్తుంది. ఇక మజ్జిగ అయితే పెద్ద పేగుని శుభ్రపరిచేందుకు సహాయపడుతుంది. శరీరంలోని వేడి ఆవిర్లు తగ్గించేందుకు మజ్జిగ ఎంతగానో ఉపయోగపడుతుంది. వీటిలోని పోషకాలు, అమైనో ఆమ్లాలు శరీరానికి మేలు చేస్తాయి.


పీసీఓడి సమస్య ఉన్నవాళ్ళు తినొచ్చా?


నిజానికి రుతుస్రావం, గర్భవతిగా ఉన్నవాళ్ళు, పీసీఓడి, థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్ళు డైరీ ఉత్పత్తులకి దూరంగా ఉండాలని అంటారు కానీ అది కేవలం అపోహ మాత్రమే. పీసీఓడి లేదా థైరాయిడ్ ఉన్నవాళ్ళు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ సమయానికి నిద్రపోవాలి. అప్పుడే వారి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. డైరీ ఉత్పత్తులు పక్కన పెట్టినంత మాత్రాన వారి సమస్యల్లో ఎటువంటి మార్పులు చోటుచేసుకోవు. అందుకే ఇటువంటి సమస్యలు ఉన్నప్పటికీ నిరభ్యంతరంగా పాల ఉత్పత్తులు తీసుకోవచ్చని నిపుణులు వెల్లడించారు. వీగన్లు(శాఖాహారులు) పాల ఉత్పత్తులు అసలు తీసుకోరు. వాటికి బదులుగా బాదం పాలు తీసుకుంటారు.


రాత్రి వేళ గోరు వెచ్చని పాలు తాగి పడుకుంటే హాయిగా నిద్రపడుతుంది. అందుకే చాలా మంది తప్పనిసరిగా పాలు తాగి పడుకుంటారు. పాల వల్ల బోలెడు ప్రయోజనాలు ఉన్నాయి. కానీ వీటిని తాగడం వల్ల కొలెస్ట్రాల్ పెరిగిపోతుందని అపోహతో వాటికి దూరంగా ఉంటారు. కానీ అవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. పాలు, పాల ఉత్పత్తులు చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తాయి. రోజూ పాలు తాగడం వల్ల గుండె జబ్బుల్లో ఒకటైన కరోనరీ హర్ట్ డీసీజ్ వచ్చే అవకాశం 14 శాతం తగ్గుతుందని కొన్ని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అంటే పాలు మితంగా తీసుకుంటే కొలెస్ట్రాల్ పెరగదు. అందుకే రోజుకో గ్లాసు పాలు తాగడం ఆరోగ్యానికి మంచిది.


పావు లీటరు పాలల్లో 8 గ్రాముల కొవ్వు ఉంటుంది. శరీరానికి రోజువారీ అవసరాలకి కావలసిన ఇతర పోషకాలు కూడా పాలలో పుష్కలంగా ఉన్నాయి. పాలు తరచూ తాగడం వల్ల బోలు ఎముకల వ్యాధి వచ్చే అవకాశం తగ్గుతుంది. పాలు తాగడం అలవాటు లేని వాళ్ళు వాటికి బదులుగా ప్రత్యామ్నాయం వెతుక్కోవడం కరెక్ట్ కాదు. బాదం/సోయా పాలు వంటి ప్రత్యామ్నాయాలకి మారకుండా ఉండటమే మంచిది.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also read: ఈ అలవాట్లు వెంటనే విడిచిపెట్టండి, లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్‌ ముప్పు తప్పదు