ప్రపంచంలోనే డయాబెటిక్ క్యాపిటల్ గా పిలువబడే దేశం ఏదో తెలుసా? మరేదో కాదు భారతదేశమే. దాదాపు 77 మిలియన్లకు పైగా ప్రజలు మధుమేహంతో బాధపడుతున్నారు. డయాబెటిస్ అనేది శరీరాన్ని పూర్తిగా లేదంటే పాక్షికంగా గ్లూకోజ్ ని ఉపయోగించడకుండా నిరోధించే ఒక జీవక్రియ రుగ్మత. ఆహారంలో మార్పులు, అధిక కేలరీల ఆహారం, తక్కువ ఫైబర్ ఫుడ్ తీసుకోవడం, అధిక బరువు మొదలైనవి భారతీయులు మధుమేహం బారిన పడేలా చేస్తున్న అనేక కారణాలు. డబ్ల్యూహెచ్ఓ ప్రకారం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, శారీరకంగా చురుకుగా ఉండటం, పొగాకు, మద్యపానానికి దూరంగా ఉండటం ద్వారా మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవచ్చు.
షుగర్ లెవల్స్ అదుపులో ఉంచే ఆహార చిట్కాలు
☀ సాధారణం కంటే తక్కువగా తినడం, భోజనం తీసుకోవడం ఆలస్యం చేయడం వంటి వాటి వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గిపోతాయి. అందుకే రెగ్యులర్ గా భోజనం తినాలి.
☀ ప్రతి భోజనంలో పిండి పదార్థాలని తీసుకోవాలి. రక్తంలో చక్కెర స్థాయిలు కార్బోహైడ్రేట్లు తీసుకోవడంపై ఆధారపడి ఉంటుంది. అందుకే రోజువారీ అవసరాలకు అనుగుణంగా పిండి పదార్థాలు తీసుకోవాలి. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలతో పాటు తృణధాన్యాలు, పప్పులు ఉన్న భోజనం చేయడం మంచిది.
☀ గ్లైసెమిక్ ఇండెక్స్(GI) తక్కువ ఉండే ఆహారం తీసుకోవాలి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలని పెరగకుండా చేస్తుంది. 55 అంతకంటే తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలు మధుమేహ వ్యాధిగ్రస్థూలకు సురక్షితంగా పరిగణిస్తారు. 70 కంటే ఎక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను వేగంగా పెంచుతాయి.
మధుమేహులు పాలు తీసుకోవచ్చా?
పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇందులో కాల్షియం, ఫాస్పరస్, రిబోఫ్లేవిన్, విటమిన్ బి 12 వంటి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా లభిస్తాయి. ఎముకల ఆరోగ్యం విషయంలో కీలక పాత్ర పోషిస్తుంది. పాలను క్రమం తప్పకుండా తీసుకునే వారిలో బోలు ఎముకల వ్యాధి ప్రమాదం చాలా తక్కువగా ఉంటుంది. ఈ వ్యాధి సాధారణంగా డయాబెటిక్ రోగుల్లో కనిపిస్తుంది. దీని వల్ల రక్తపోటు, కార్డియో వాస్కులర్ వ్యాధులు, పేగు క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఉంది.
టైప్ 2 డయాబెటిస్ రొగులు పాలు తీసుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవని పలు పరిశోధనలు చెబుతున్నాయి. పాలల్లో ప్రోటీన్ ఎక్కువ. ఇది పోస్ట్‌ప్రాండియల్ ఇన్సులిన్ ప్రతిస్పందనను పెంచుతుంది. డయాబెటిస్ రోగులలో బ్లడ్ గ్లూకోజ్ లెవల్స్ తగ్గేలా చేస్తుంది. అయితే పాలలో లాక్టోజ్ ఉంటుంది. ఈ కార్బోహైడ్రేట్ ను రోజు మొత్తం మీద తీసుకునే పిండి పదార్థాలతో పోల్చి చూసుకోవాలి. పాల రకాన్ని బట్టి GI 31-37 మధ్య ఉంటుంది. ఇటువంటి తక్కువ GI ఆహారాలు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచవు. సువాసన లేదా తియ్యటి పాలు మాత్రం మధుమేహులు తప్పకుండా నివారించాలి. ఎన్ఐఎన్ మార్గదర్శకాల ప్రకారం పెద్దలు ప్రతిరోజూ 300ఎంఎల్ పాలు తీసుకోవచ్చు. మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా ఇదే వర్తిస్తుంది. కొవ్వు తక్కువ ఉండే పాలు ఎంచుకోవడం ఉత్తమం.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.