ఆహారం తిన్నాక ఎక్కువమంది ‘బ్రేవ్’ మంటూ త్రేనుస్తారు. వీటిని త్రేన్పులు అంటారు. కొంతమంది ‘తేపు’ అని కూడా అంటారు. పొట్టలో చేరిన వాయువులను బయటికి పంపించడమే ఈ త్రేన్పుల పని. ఇది ఒక రకమైన వాసనను కలిగి ఉంటాయి. అధికంగా త్రేన్పులు వస్తే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఆహారం అధికంగా తీసుకున్నప్పుడు భుక్తాయాసం వల్ల కూడా పొట్టలో నుంచి గాలి త్రేన్పుల రూపంలో బయటికి వస్తుంది. అయితే త్రేన్పులు రావడానికి కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు కూడా కారణం కావచ్చు.


మనం ఆహారం తినేటప్పుడు లేదా నీళ్లు తాగేటప్పుడు కొంత గాలిని మింగేస్తాము. ఆ గాలి ప్రధానంగా నత్రజని, ఆక్సిజన్ మిళితంగా ఉంటుంది. అలాగే శీతల పానీయాలు, ఎనర్జీ డ్రింక్స్, కార్బోనేటెడ్ పానీయాలు, బీర్ వంటివి తాగినప్పుడు కూడా అధికంగా త్రేన్పులు వచ్చే అవకాశం ఉంది. పొట్టలో ఈ వాయువులన్నీ పేరుకుపోయి లోపల ఇమడలేకపోతాయి. వాటిని శరీరం  బయటికి పంపించేస్తుంది. అలా బయటికి పంపే ప్రయత్నంలోనే త్రేన్పులు అధికంగా వస్తూ ఉంటాయి. ఈ గ్యాస్ బయటకు రాకపోతే పొట్టనొప్పి, ఉబ్బరం వంటివి కలుగుతాయి. కాబట్టి త్రేన్పులను ఆపుకోకూడదు.


ఇది అధికంగా వస్తే పొట్ట ఆరోగ్యంగా లేనట్టు అర్థం. కాబట్టి కొన్ని జాగ్రత్తలను తీసుకోవాలి. కొవ్వు నిండిన పదార్థాలు తినడం వల్ల పొట్ట ఉబ్బరం రావచ్చు. ఎందుకంటే జీర్ణాశయం నుంచి ఆహారం పేగుల్లోకి వెళ్ళకుండా ఈ కొవ్వు అడ్డుకుంటుంది. అప్పుడు పొట్ట ఎక్కువ కాలం పాటు నిండుగా ఉంటుంది. ఆ సమయంలో లోపల ఉన్న గ్యాస్ బయటకి వచ్చే ప్రయత్నం చేసి త్రేన్పులుగా మారుతాయి.


ఆహారాన్ని వేగంగా తినడం, తింటున్నప్పుడు అధికంగా మాట్లాడడం వంటివి జీర్ణాశయంలోకి గాలి చేరుకోవడాన్ని ప్రోత్సహిస్తుంది. దీనివల్ల తేన్పులు అధికంగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆహారాన్ని నెమ్మదిగా తినాలి. కూల్ డ్రింకులు తాగాలనుకుంటే నేరుగా తాగాలి, కానీ స్ట్రా తో తాగకూడదు. పిండి పదార్థాలు అధికంగా ఉండే ఆహారాలైన క్యాబేజీ, కాలీఫ్లవర్ వంటివి కూడా శరీరంలో గ్యాస్ నిండేలా చేస్తాయి. కాబట్టి వీటిని తినేటప్పుడు కొద్ది మొత్తంలోనే తినాలి.


ధూమపానం అలవాటు ఉండేవారికి కూడా త్రేన్పులు అధికంగా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ పొగతో పాటు గాలి కూడా లోపలికి వెళ్ళిపోతుంది. పొట్టలో గాలికి స్థానం లేదు. అవి గ్యాస్ రూపంలో బయటికి వస్తాయి. పాల పదార్థాలు, కొన్ని రకాల పండ్ల వల్ల కూడా గ్యాస్ పొట్టలో పేరుకుపోతుంది. వీటిని తినేటప్పుడు నెమ్మదిగా తినాలి. ఒకే మొత్తంలో ఎక్కువగా తీసుకోకూడదు. ఇవన్నీ త్రేన్పుల సమస్య అధికంగా ఉన్న వారికి మాత్రమే ఈ జాగ్రత్తలు.  సాధారణంగా త్రేన్పులు వాటి మటుకు అవే పోతాయి. వాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ త్రేన్పులతో పాటూ వికారంగా అనిపించడం, వాంతులు రావడం, పొట్ట నొప్పి రావడం, గుండెలో మంట రావడం, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే మాత్రం వెంటనే వైద్యులను సంప్రదించాలి. 



Also read: నా భార్య కన్నా ఆమె నాకు ఎక్కువ నచ్చుతోంది, ఏం చేయాలి?






































































































































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.