IRCTC Bharat Gaurav Express Special Package : ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(IRCTC) భారతీయ రైల్వే ప్రత్యేక యాత్ర పథకాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. భారత్ గౌరవ్ ఎక్స్‌ప్రెస్ (Bharat Gaurav Express Train) ద్వారా.. ఈ ప్యాకేజ్లో భాగంగా దేశంలోని నాలుగు ప్రధాన జ్యోతిర్లింగ దేవాలయాలను సందర్శించవచ్చు. వీటితో పాటు గుజరాత్‌లోని 'స్టాట్యూ ఆఫ్ యూనిటీ'(Statue of Unity)ని కూడా చూసే అవకాశం కల్పిస్తున్నారు. 9 రోజులు సాగే ఈ యాత్ర అక్టోబర్ 25, 2025న ప్రారంభమవుతుంది. ఆధ్యాత్మికమైన, సాంస్కృతిక యాత్రలను ఇష్టపడేవారికి ఇది గొప్ప అవకాశం కానుంది. మరి ఈ ప్యాకేజీ గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

Continues below advertisement

డెస్టినేషన్స్ ఇవే

ప్యాకేజ్​లో భాగంగా రైలు ప్రయాణం అమృత్‌సర్ నుంచి ప్రారంభం కానుంది. అయితే ఈ రైలు ఏ స్టేషన్​లలో ఆగుతుందో.. అక్కడ ఎక్కి జ్యోతిర్లింగాలు చూసేందుకు వెళ్లొచ్చు. అలాగే మీకు దగ్గర్లోని స్టేషన్​కి వెళ్లడం లేదా.. ప్రయాణం ప్రారంభమయ్యే ప్రదేశానికి వెళ్లేందుకు ప్లాన్ చేసుకోవచ్చు. 

  • జలంధర్ 
  • లుధియానా 
  • చండీగఢ్ 
  • అంబాలా 
  • కురుక్షేత్ర 
  • పాణిపట్ 
  • సోనిపట్ 
  • ఢిల్లీ కెంట్ 
  • రేవాడి

ఈ స్టేషన్​లలో రైలు ఆగనుంది. కాబట్టి దానికి తగ్గట్లు మీరు మీ ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు. మరి ఈ ప్యాకేజ్​ ద్వారా దర్శించుకోగలిగే జ్యోతిర్లింగాలు ఏంటో.. ప్యాకేజ్ బెనిఫిట్స్ ఏంటో.. ఎంత ఖర్చు అవుతుందో ఇప్పుడు చూసేద్దాం. 

Continues below advertisement

జ్యోతిర్లింగాలు ఇవే

ఈ యాత్రలో భాగంగా దర్శించుకోగలిగే నాలుగు ప్రధాన జ్యోతిర్లింగ దేవాలయాలు మహాకాళేశ్వర్, ఓంకారేశ్వర్, నాగేశ్వర్. సోమనాథ్. 

  • మహాకాళేశ్వర్ (ఉజ్జయిని, మధ్యప్రదేశ్) : ఇది శివుని ప్రసిద్ధ జ్యోతిర్లింగ దేవాలయం.  ప్రతి ఏడాది ఇక్కడికి లక్షలాది మంది భక్తులు వస్తారు. 
  • ఓంకారేశ్వర్ (మధ్యప్రదేశ్) : నర్మదా నది ఒడ్డున ఉన్న ఈ ఆలయం శాంతి, అందానికి ప్రసిద్ధి చెందింది. 
  • నాగేశ్వర్ (ద్వారక, గుజరాత్) : ఈ జ్యోతిర్లింగం శివుని భక్తులకు చాలా ప్రత్యేకమైనదిగా చెప్తారు. 
  • సోమనాథ్ (గిర్-సోమనాథ్, గుజరాత్) : పురాతన, చారిత్రక ప్రాముఖ్యత కలిగిన ఈ ఆలయం సముద్ర తీరంలో ఉంది.

ఈ జ్యోతిర్లింగాలతో పాటు.. పర్యాటకులు గుజరాత్‌లోని ద్వారకలో ఉన్న ద్వారకాధీష్ ఆలయాన్ని కూడా సందర్శించే సౌలభ్యం ఉంది. అలాగే గుజరాత్‌లోని కెవాడియాలో ఉన్న ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం 'స్టాట్యూ ఆఫ్ యూనిటీ'ని కూడా చూడవచ్చు. 

ప్యాకేజీలో ఏమేమి లభిస్తాయంటే..

ఈ ప్రత్యేక రైలులో మొత్తం 762 మంది ప్రయాణికులు ఒకేసారి జర్నీ చేయవచ్చు. ప్రయాణికుల సౌకర్యం కోసం మూడు కేటగిరీలు ఉన్నాయి. ఎకానమీ అత్యంత చవకైన ఎంపికల్లో ఒకటి. స్టాండర్డ్ మధ్యస్థ స్థాయి సౌకర్యాలతో ఉంటుంది. కంఫర్ట్​ బుక్ చేసుకుంటే మరింత సౌకర్యవంతమైన ప్రయాణం ఉంటుంది. 

ఎంత ఖర్చు అవుతుందంటే..

ఈ యాత్ర చేయాలనుకుంటే ఒక్కొక్కరికి 19,555 నుంచి మొదలై 39,410 వరకు ఖర్చు అవుతుంది. మీరు ఎంచుకున్న కేటగిరీపై ఆధారపడి ఈ ధర ఉంటుంది. ఈ ప్యాకేజీలో మీకు శాఖాహార భోజనం, వసతి (హోటల్ లేదా గెస్ట్ హౌస్), పర్యాటక ప్రదేశాలకు రవాణా, ప్రయాణ బీమా, భద్రతా ఏర్పాట్లు వంటి సౌకర్యాలు లభిస్తాయి.

ప్యాకేజీలో లేనివి ఇవే

భారత్ గౌరవ్ ఎక్స్‌ప్రెస్ ప్రత్యేక ప్యాకేజీలో స్మారక చిహ్నాల ప్రవేశ రుసుమును లేదు. కాబట్టి మీరే వాటిని చెల్లించాలి. వ్యక్తిగత ఖర్చులు, షాపింగ్ వంటివి సొంత ఖర్చుతోనే చేసుకోవాలి. దీనితో పాటు వెయిటర్ లేదా గైడ్‌కు ఇచ్చే టిప్ కూడా ప్యాకేజీలో లేదు.

ఎలా బుక్ చేసుకోవాలంటే

మీరు ఈ యాత్రకు వెళ్లాలనుకుంటే IRCTC అధికారిక వెబ్‌సైట్ (www.irctctourism.com)లో బుక్ చేసుకోవచ్చు. దీనితో పాటు చండీగఢ్, ఢిల్లీలోని IRCTC ప్రాంతీయ కార్యాలయాలలో కూడా బుకింగ్ సౌకర్యం అందుబాటులో ఉంది. ఈ యాత్రలో పాల్గొనే పర్యాటకులు తమతో పాటు గుర్తింపు కార్డులు తీసుకెళ్లాలి. ఆధార్ కార్డ్, ఓటర్ ID లేదా పాస్‌పోర్ట్‌ను తీసుకెళ్లవచ్చు. మీకు ఏదైనా అనారోగ్యం ఉంటే.. ప్రయాణించే ముందు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. అదే సమయంలో ప్రయాణించేటప్పుడు పరిశుభ్రత, క్రమశిక్షణను పాటించాలి.