Womens Day Gift Ideas: అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే స్త్రీత్వాన్ని గౌరవించుకునే రోజు. ప్రపంచ వ్యాప్తంగా మహిళలు అన్నిరంగాల్లో తమదైన ముద్ర వేస్తున్నారు. ప్రతి సంస్థలోనూ మహిళల ప్రాతినిధ్యం ఉంటోంది. సంస్థ అభివృద్ధిలో వారి పాత్రను గుర్తించి.. వారిని తగిన రీతిలో సత్కరించుకునేందుకు ఇదొక మంచి అవకాశం. చాలా సంస్థలు ఈ సందర్భంగా మహిళా ఉద్యోగుల కృషిని గుర్తించి సత్కరిస్తుంటాయి. ఇలాంటి సత్కారం కొంత మందికి మాత్రమే లభిస్తుంది. కానీ అందరు మహిళలు బహుమతులకు అర్హులే కనుక తప్పకుండా అందరికీ బహుమతులు అందివ్వడం ఒక మంచి ఆలోచన. సంస్థలో పనిచేస్తున్న మహిళలను గౌరవించి ప్రొత్సహించేందుకు బహుమతులు ఇచ్చే పద్ధతి కొన్ని సంస్థలు తప్పక పాటిస్తాయి. ఎలాంటి బహుమతులు నిజంగా మహిళా ఉద్యోగులను సంతోషపెట్టగలవో ఇక్కడ చూద్దాం.


గిఫ్ట్ కార్డ్స్


ఇప్పుడంతా డిజిటలైజ్డ్ కాలం. కాబట్టి డిజిటల్ కార్డుల రూపంలో గిఫ్ట్ ఇవ్వడం ఒక పద్ధతి. ఆ కార్డ్ ద్వారా వారు వారికి నచ్చిన వస్తువులు కొనుక్కోగలుగుతారు. అమెజాన్,  ఫ్లిప్ కార్ట్, స్విగ్గీ, జోమాటో వంటి ఇ. కామర్స్ ప్లాట్ ఫాంలకు చెందిన కార్డులను ఇవ్వవచ్చు.


పర్సనలైజ్డ్ గిఫ్ట్స్


పర్సనలైజ్డ్ గిఫ్ట్స్ వారిని పేరు పేరున మీరు గుర్తుంచుకున్నారని తెలియజేసే ఒక మార్గం. అయితే దీనికి సమయం ఎక్కువ వెచ్చించాల్సి ఉంటుంది. మీ ఆఫీస్‌లో పనిచేసే ఒక యువతి సంగీత ప్రియురాలైతే ఆమెకు ఒక బ్లూటూత్ స్పీకర్ ఇవ్వవచ్చు. మొక్కలను ఇష్టపడే అమ్మాయికి ఆమె డెస్క్ మీద అలంకరించుకునేందుకు ఒక మొక్కను బహుకరించవచ్చు. ఇలాంటివి చిన్న బహుమతులే.. కానీ వారికి చాలా సంతోషాన్నిస్తాయి.


గిఫ్ట్ హాంపర్


ఈ మధ్య కాలంలో చాల ఆన్లైన్ గిఫ్ట్ వెబ్ సైట్లు మహిళా దినోత్సవం సందర్భంగా రెడీమేడ్ గిఫ్ట్ హ్యాంపర్లు అందుబాటులోకి తెచ్చాయి. వీటిని ఇవ్వవచ్చు. వీటిని మీకు నచ్చినట్టుగా చేయించుకోవచ్చు కూడా.


క్యారీకేచర్


క్యారీకేచర్ గిఫ్ట్ చెయ్యడం కూడా ట్రెండింగ్ లో ఉంది. చాలా గిఫ్ట్ వెబ్ సైట్లు తమ ప్లాట్ పామ్ లలో క్యారీకేచర్లను తయారు చేసి బహుమతులుగా అందిస్తున్నాయి. మీ మహిళా ఉద్యోగులతో మాట్లాడి ఇలాంటి వాటిని కూడా బహుకరించవచ్చు.


స్లింగ్ బ్యాగ్


వర్కింగ్ విమెన్ ఎవరికైనా బ్యాగుల మీద ఉండే ప్రేమ కాదనలేనిది. ఎన్ని రకాల బ్యాగ్ ఆప్షన్లు ఉన్నా సరే స్లింగ్ బ్యాగ్ అంటే దాదాపు అందరు మహిళలకు ఇష్టం ఉంటుంది. మహిళా ఉద్యోగులకు ఈ బ్యాగులు బహుకరిస్తే చాలా సంతోషిస్తారు.


హెల్దీ స్నాక్ హాంపర్


డ్రైఫ్రూట్స్, ప్రొటీన్ బార్లు, గింజలు, విత్తనాలు కలిగి ఆరోగ్యకరమైన స్నాక్ బాక్స్ కూడా బహుకరించవచ్చు. ఇది పరోక్షంగా మీరు వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ కలిగి ఉన్నారనేందుకు సంకేతం కూడా.


ఇలా రకరకాల బహుమతులను మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఉద్యోగులకు అందించవచ్చు. ఇది వారి పనికి గుర్తింపుగా, వారికి ప్రోత్సాహకంగా ఉంటుంది. వారిలో ఉత్సాహాన్ని నింపుతుంది. బహుమతులు చేసే పనిపట్ల వారి బాధ్యతను మరింత పెంచుతాయి కూడా. ఫలితంగా పనితీరు మెరుగుపడుతుంది. సంస్థ మరింత పురోగతిలో సాగుతుంది. 


Also Read : VASTU TIPS: ఈ వాస్తు చిట్కాలు పాటిస్తే డబ్బే డబ్బు - ఆ దోషాలన్నీ తొలగిపోతాయ్!