సహజ విధానంలో దంపతులకు పిల్లలు కలగకపోతే దానినే ఇన్ ఫెర్టిలిటి అని అంటారు. సాధారణంగా ఒక ఏడాది పాటు ఎలాంటి ప్రొటెక్షన్ లేకుండా శృంగారంలో పాల్గొన్నప్పటికీ గర్భం దాల్చకపోతే ఫెర్టిలిటి సమస్యలు ఉన్నట్టుగా భావిస్తారు. టెక్నాలజీ ఎంతో అభివృద్థి చెందుతున్నప్పటికీ ఫెర్టిలిటీ సమస్యలు పెరుగుతూనే ఉన్నాయి. నిజానికి యువ దంపతుల్లో ఫెర్టిలిటి గురించి ఇప్పటికీ ఎన్నో అనుమానాలు ఉన్నాయి.  గర్భధారణ గురించి చాలా మందిలో రకరకాల అపోహలు ఉన్నాయి. అందువల్ల చిన్న సమస్యలైనా చికిత్స తీసుకోవడంలో ఆలస్యం జరిగి చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అలాంటి కొన్ని అపోహలను గురించి ఇక్కడ ఒకసారి చర్చించుదాం.


 ఇన్ ఫెర్టిలిటి సమస్యలను లక్షణాలను బట్టి ఎంత త్వరగా గుర్తిస్తే అంత త్వరగా చికిత్స అందించి సమస్యను పరిష్కరించవచ్చని డాక్టర్ సుదీప్ బసు అనే గైనకాలజిస్ట్ ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ అన్నారు. సాధారణంగా దంపతులలో ఉండే ఫెర్టిలిటికి సంబంధించిన అపోహల గురించి ఆ సందర్భంగా చర్చించారు.


స్త్రీలే కారణం


చాలా వరకు ఇన్ఫెర్టిలిటి సమస్యల్లో స్త్రీల మీదే బాధ్యత తోసేస్తుంటారు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని సమాజాల్లో పిల్లలు కలుగకపోవడానికి స్త్రీలలో ఉండే లోపమే కారణం అనే నమ్మకం ఉంది. కానీ నిజానికి పిల్లలు కలగడానికి దంపతులిద్దరూ సమానమే. పురుషుల్లో కూడా లోపం ఉండవచ్చు. ప్రతి సారీ స్త్రీల ఆరోగ్యమే కారణం కాకపోవచ్చు.


పిల్లలు కలిగే వయసు కేవలం స్త్రీలకు మాత్రమే పురుషులకు కాదు అని చాలా మంది నమ్ముతుంటారు. ఎంత వయసులోనైనా పురుషులకు పిల్లలు కలుగవచ్చని అనుకుంటూ ఉంటారు. నిజానికి అటువంటిదేమీ లేదు, స్త్రీల మాదిరిగానే పురుషుల్లో సైతం 40 సంవత్సరాల వయసు తర్వాత వీర్య పరిమాణం, కణాల చురుకుదనం తగ్గిపోతాయి.


కనీసం ఏడాది పాటు ప్రయత్నం చేసిన తర్వాత మాత్రమే ఫెర్టిలిటి సమస్యలు ఉన్నదీ లేనిదీ తెలుస్తుందనేది కూడా ఒక అపోహ మాత్రమే. దంపతుల వయసు 35 కంటే తక్కువగా ఉన్నపుడు, ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేనపుడు మాత్రమే ఇది వర్తిస్తుంది. పిసీఓసి, ఎండోమెట్రియాసిస్, నెలసరి చక్రం సరిగ్గా లేనపుడు, ఇవన్నీ సరిగా ఉన్నసరే దంపతుల వయసు 35 కంటే ఎక్కువగా ఉన్నపుడు ఆరునెలల్లోపే డాక్టర్ సహాయం తీసుకోవడం మంచిదని నిపుణఉలు అంటున్నారు.


చాలా మంది గర్భనిరోధక మాత్రలు వాడడం వల్ల ఫెర్టిలిటి సమస్యలు వస్తాయని నమ్ముతారు. కానీ అది నిజం కాదు. ఈ మాత్రలు కేవలం కాంట్రాసెప్షన్ కోసం మాత్రమే కాదు రకరకాల సమస్యల్లో సూచిస్తారు. ఓవేరియన్ సిస్ట్స్ చికిత్సగా, నెలసరి క్రమం తప్పిన వారికి చికిత్సగా ఈ మాత్రలను సూచిస్తారు. నిజానికి ఇవి నెలసరి క్రమబద్దం చెయ్యడంలో ప్రత్యేక పాత్రక పోషిస్తాయి. ఒకసారి క్రమబద్దం అయిన తర్వాత వాడడం మానేసిన వెంటనే గర్భం ధరించేందుకు అవకాశం ఏర్పడుతుంది.


ఫెర్టిలిటి వేరు అనారోగ్యం వేరు అనుకుంటూ ఉంటారు చాలా మంది. కానీ ఏవైనా అనారోగ్య సమస్యలు ఉన్నపుడు తప్పకుండా అది ఫెర్టిలిటీ సామర్థ్యం మీద ప్రభావం చూపిస్తుంది. బీఎంఐ, సెడంటరీ లైఫ్ స్టైల్ వంటివి తప్పకుండా ఫెర్టిలిటి మీద ప్రభావం చూపుతాయి.