Indian Navy Day 2025 : ఇండియాలో ప్రతి సంవత్సరం డిసెంబర్ 4వ తేదీన భారత నావికా దినోత్సవం జరుపుకుంటారు. ఈ ఏడాది ఈ స్పెషల్ డే గురువారం వచ్చింది. నిజానికి ఈ రోజు భారత నావికాదళం దేశానికి చేసిన అద్భుతమైన సహకారాన్ని గుర్తుచేసుకోవడానికి సెలబ్రేట్ చేసుకుంటారు. 1971 యుద్ధంలో.. భారత నావికాదళం తూర్పు పాకిస్తాన్ (ఇప్పుడు బంగ్లాదేశ్)తో చేసిన యుద్ధానికి గుర్తుగా నేవీ డే నిర్వహిస్తున్నారు. బంగ్లాదేశ్ స్వాతంత్య్రం పొందడంలో ఇది చాలా ముఖ్యమైన పాత్ర పోషించింది.
ఇదే రోజున(డిసెంబర్ 4) 1971లో భారత నావికాదళం పాకిస్తాన్ నౌకాదళ నౌకలను నాశనం చేసింది. అలాగే కరాచీ నౌకాశ్రయంపై దాడి చేసి దానిని కూడా నాశనం చేసింది. 1971 యుద్ధంలో భారత నావికాదళం పాకిస్తాన్ కరాచీ నౌకాశ్రయాన్ని ఎలా ధ్వంసం చేసిందో.. బంగ్లాదేశ్‌కు స్వాతంత్య్రం ఎలా తెచ్చిందో వంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం.
పాకిస్తాన్ ప్రణాళికను నాశనం చేసిన భారత నౌకాదళం
పశ్చిమ పాకిస్తాన్ తూర్పు పాకిస్తాన్‌పై 1971లో అణచివేతకు పాల్పడింది. ఆ సమయంలో చాలామంది బాధితులు తూర్పు పాకిస్తాన్ నుంచి భారతదేశంలోకి ప్రవేశించడం ప్రారంభించారు. అటువంటి పరిస్థితిలో.. భారతదేశంలో వారి సంఖ్య నిరంతరం పెరిగింది. దీనిని దృష్టిలో పెట్టుకుని అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీ ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అదే సమయంలో 1971 డిసెంబర్ 3వ తేదీన పాకిస్తాన్ వైమానిక దళం.. భారత వైమానిక దళానికి చెందిన 9 స్థావరాలపై దాడి చేసింది. దీని తరువాత ఇందిరా గాంధీ ఈ దాడులపై నేరుగా యుద్ధంగా ప్రకటించారు.
కిల్లర్ స్క్వాడ్రన్
ఇందిరా గాంధీ ప్రకటనతో భారత వైమానిక దళం పాకిస్తాన్‌పై ఎదురుదాడి చేసింది. కానీ అసలు పనిని భారత నావికాదళం పూర్తి చేసింది. పాకిస్తాన్ వైమానిక దాడుల తరువాత.. భారత నావికాదళం వెస్ట్రన్ నేవీ కమాండ్ ఆపరేషన్ ట్రైడెంట్‌ను ప్రారంభించింది. అప్పటి వైస్ అడ్మిరల్ ఎస్.ఎన్. కోహ్లీ దీనికి నాయకత్వం వహించారు. ఆపరేషన్ ట్రైడెంట్‌లో భారత నావికాదళం 'కిల్లర్ స్క్వాడ్రన్'ను ఏర్పాటు చేసింది. ఇందులో మూడు క్షిపణి పడవలు INS నిర్ఘాత్, INS నిపత్, INS వీర్ ఉన్నాయి. ఇందులో ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే క్షిపణులు ఉన్నాయి. ఇవి పాకిస్తాన్ PNS ఖైబర్‌ను నాశనం చేశాయి. భారత నావికాదళం పాకిస్తాన్ ఆర్మీ కోసం ఆయుధాలను తీసుకెళ్తున్న ఒక నౌకను కూడా ముంచివేసింది.
కరాచీ నౌకాశ్రయం సైతం
భారత నావికాదళానికి చెందిన INS నిపత్ పాకిస్తాన్ నౌకాదళ నౌకను పేల్చివేసింది. ఆ తరువాత మిగిలిన క్షిపణులతో కరాచీ నౌకాశ్రయంపై దాడి చేసింది. ఈ దాడిలో కొన్ని క్షిపణులు కెమారి చమురు శుద్ధి కర్మాగారంపై కూడా ప్రయోగించారు. దాడి ఎంత భయంకరంగా జరిగిందంటే.. కరాచీ నౌకాశ్రయం సమీపంలోని కెమారి చమురు శుద్ధి కర్మాగారంలో చాలా రోజుల పాటు మంటలు చెలరేగాయి. ఆ తరువాత ఆపరేషన్ పైథాన్ నిర్వహించారు. ఇందులో INS వినాష్, తల్వార్, త్రిశూల్ PNS ఢాకాను కూల్చివేశాయి.
ఈ యుద్ధాన్ని హైలెట్ చేస్తూ.. ఇండియాకు నేవీ అందిస్తోన్న సేవలు గుర్తిస్తూ.. ప్రతీ ఏడాది డిసెంబర్ 4వ తేదీన ఇండియన్ నేవీ డేగా సెలబ్రేట్ చేస్తున్నారు. ఈ నౌకాదళం భారత సముద్ర సరిహద్దులను కాపాడడం నుంచి.. ఆర్థిక ప్రయోజనాలు అందివ్వడం వరకు కీలకపాత్ర పోషిస్తుంది. విపత్తు సమయాల్లో సహాయం అందించడం నుంచి రక్షణ కార్యకలాపాలలో పాల్గొంటూ అంతర్జాతీయ శాంతి, భద్రతను నేవీ ప్రోత్సాహిస్తుంది.