ప్రతి ఇంటి కిచెన్ లో కనిపించేది నాన్ స్టిక్ పాన్స్. కూరలు అడుగు అంటకుండా, మాడిపోకుండా చక్కగా ఉడుకుతాయి. వీటిలో నూనె కూడ తక్కువ పడుతుందని ఎక్కువ మంది గృహిణులు వీటిని వినియోగిస్తారు. కానీ వాటి క్లీనింగ్ విషయానికి వస్తే మాత్రం పెద్దగా పట్టించుకోరు. గరుకుగా ఉండే స్క్రబ్ తో తోమడం, స్టీల్ గరిటెలు పెట్టి గీరడం వల్ల వాటి మీద గీతలు పడటం, పెయింట్ పోవడం జరుగుతుంది. అయితే ఏమైందిలే బాగానే పని చేస్తుంది కదా అని తీసేయకుండా వాడేస్తూ ఉంటారు. కానీ ఇది క్యాన్సర్ కు ప్రమాదకారిగా మారుతుందని భారతీయ అమెరికన్ డాక్టర్ పూనమ్ దేశాయ్ హెచ్చరిస్తున్నారు. గీతలు పడిన నాన్ స్టిక్ లేదా సిరామిక్ పాన్ ఎందుకు పడేయాలో వివరిస్తూ ఆమె ఇటీవల సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశారు. ఈ వీడియో వైరల్ గా మారింది.


గీతలు పడిన పాన్ మీద మిలియన్ల కొద్దీ మైక్రోప్లాస్టిక్ ఉంటాయని అవి ఆహారంలోకి సులభంగా చేరిపోతాయి. మైక్రోప్లాస్టిక్ అంటే చిన్న చిన్న ప్లాస్టిక్ కణాలు. ఇవి ఐదు మిల్లీ మీటర్ల కంటే చిన్నగా ఉంటాయి. కంటికి కనిపించవు. దుస్తులు, గృహోపకరణాల ద్వారా ఇవి ఎక్కువగా శరీరంలోకి చేరతాయి. తెలిసో తెలియకో అవి శరీరంలో చేరి ఆరోగ్యానికి హాని కలిగిస్తున్నాయి. అందుకే వంట కోసం తను కాస్ట్ ఐరన్ లేదా స్టెయిన్ లెస్ స్టీల్ పాత్రలు ఉపయోగిస్తున్నట్టు ఆమె చెప్పారు.


పాడైన నాన్ స్టిక్ పాన్ వల్ల అనార్థాలు


మైక్రోప్లాస్టిక్ లు ఎండోక్రైన్ డిస్ రఫ్ట్, హార్మోన్ అసమతుల్యత, సంతానోత్పత్తి సమస్యల్ని కలిగిస్తాయి. క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా పెంచుతాయి. సిరామిక్ పాన్ అడుగున అల్యూమినియం పొర ఉంటుంది. ఇది ఆహారంలోకి వచ్చేస్తుంది. అందుకే సిరామిక్ పాన్ లో వంట చేయడం మానుకోవాలి. పాన్ మీద గీతలు, పెయింట్ పోయినట్టు అనిపిస్తే వెంటనే వాటిని ఉపయోగించకూడదని డాక్టర్ పూనమ్ సూచిస్తున్నారు. వంట కోసం ఎప్పుడు స్టెయిన్ లెస్ స్టీల్ లేదా కాస్ట్ ఐరన్ పాన్ లు ఉపయోగించడం ఉత్తమం. ఇవి ఆహారంలోని పోషకాలని నిలుపుతాయి.


వంట చేసేటప్పుడు ఆహారం సరిగా ఉడికడానికి పాన్ కు టెఫ్లాన్ తో పూట పూస్తారు. నాన్ స్టిక్ లేయర్ కోసం హీట్ ఫ్రూఫ్ కణాలు పర్ అండ్ పాలీఫ్లోరినేటెడ్ పదార్థాలు ఉపయోగిస్తారు. ఇవి ఆహారం ద్వారా శరీరంలోకి చేరిపోతాయి. దీని వల్ల ఎండోక్రైన్ వ్యవస్థ దెబ్బతింటుంది. ఎండోక్రైన్ అనేది శరీరం అంతటా గ్రంథులు సరిగా పని చేసేలా చేస్తుంది. హార్మోన్ల విడుదల ద్వారా శరీరాక విధుల్ని సరిగా చేస్తుంది. కానీ ఈ మైక్రోప్లాస్టిక్స్ చేరడం వల్ల ఈ వ్యవస్థ దెబ్బతింటుంది. ఫలితంగా హార్మోన్లలో అసమతుల్యత ఏర్పడుతుంది. ఈ పాన్ లు ఉపయోగించడం వల్ల కాలేయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని పరిశోధకులు గతంలోనే హెచ్చరించారు.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also Read: కొరియన్ అమ్మాయిల అందం వెనుక సీక్రెట్ తెలిసిపోయిందోచ్!