Independence Day Special Simple School Decoration Tips : ఆగస్టు 15న 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకోవడానికి భారతదేశం సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో వీధులు, ఆఫీసులు, స్కూల్స్ త్రివర్ణ రంగులతో నిండిపోనున్నాయి. దేశంలోని ప్రతి మూల కూడా దేశభక్తితో మార్మోగనుంది. జెండా ఎగురవేయడం నుంచి సాంస్కృతిక కార్యక్రమాల వరకు.. ఎన్నో జరగనున్నాయి. ఈ సమయంలో ముఖ్యంగా పాఠశాలలో ఈ సందడి కాస్త ఎక్కువగా ఉంటుంది. పిల్లలే తమ స్కూల్ రెడీ చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తారు. దీనిలో భాగంగా తరగతి గదులు, కారిడార్లు, అసెంబ్లీ హాళ్లను అలంకరిస్తారు. సృజనాత్మకంగా స్కూల్‌ని అలంకరించడానికి ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో.. ఏ విధంగా డిజైన్ చేస్తే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రవేశ ద్వారం, బులిటెన్ బోర్డులు
పాఠశాల గేటు వద్ద అలంకరణ ప్రారంభించాలి. ద్వారం దగ్గర.. ఆరెంజ్, తెలుపు, ఆకుపచ్చ బెలూన్లు, జెండాలు, బంతిపూల దండలను కట్టవచ్చు. బులిటెన్ బోర్డులను స్వాతంత్య్ర సమరయోధుల కోట్స్, స్వాతంత్య్రానికి సంబంధించిన ఫోటోలతో నింపవచ్చు. విద్యార్థులు తయారు చేసిన కాగితపు పావురాలు లేదా అశోక చక్రం వంటి 3D అంశాలను బోర్డులపై ఉంచితే.. లుక్ బాగుంటుంది.
DIY ఇండియన్ ఫ్లాగ్ వాల్
(Image Source: ABP LIVE AI)
చార్ట్ పేపర్లు, హ్యాండ్ ప్రింట్స్ లేదా కాగితపు పువ్వులను ఉపయోగించి భారీ భారతీయ జెండాను తయారు చేయవచ్చు. జెండాలో కొంత భాగాన్ని ప్రతి తరగతి గదిలో అతికించవచ్చు. వివిధ రకాల ఫ్లవర్స్‌ని కూడా వీటిలో భాగం చేయవచ్చు. ఐక్యతకు చిహ్నంగా ఇది నిలుస్తుంది. ఇది కేవలం అలంకరణ మాత్రమే కాదు.. స్వాతంత్య్ర స్ఫూర్తికి ప్రతిబింబం.
బెలూన్లు, రిబ్బన్లు
బెలూన్లు, రిబ్బన్లను సరిగ్గా అమరిస్తే చూసేందుకు ప్రభావవంతంగా ఉంటాయి. త్రివర్ణ రంగులు ఉన్న బెలూన్లను గుత్తులుగా కట్టి తరగతి గదుల తలుపులు, కారిడార్లు, అసెంబ్లీ స్టేజ్ వద్ద కట్టవచ్చు. లేదంటే పైకప్పుల నుంచి వేలాడదీయవచ్చు. కుర్చీలు, రెయిలింగ్‌లపై విల్లులుగా రిబ్బన్‌లతో కట్టవచ్చు. పర్యావరణకు అనుకూలమైన బెలూన్లను ఎంచుకుంటే మంచిది.
DIY పేపర్ క్రాఫ్ట్స్
(Image Source: ABP LIVE AI)
పిన్‌వీల్స్, పేపర్ ఫ్యాన్స్, జెండాలు వంటి DIY పేపర్ క్రాఫ్ట్‌లు మనోహరమైన అలంకరణ కోసం మాత్రమే కాకుండా.. సరదాగా, విద్యాపరమైన కార్యాచరణను కూడా అందిస్తాయి. గాలి వీస్తున్నప్పుడు రంగురంగుల వైబ్‌ను ఎంజాయ్ చేయాలంటే.. విండోల దగ్గర, బాల్కనీలలో కూడా వీటిని వేలాడదీయండి.
పువ్వులతో అలంకరణ
(Image Source: ABP LIVE AI)
పువ్వులు ఉంటే చాలు అది ఏ అలంకరణ అయినా నిండుగా ఉంటుంది. ఈ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మీరు కూడా త్రివర్ణంలోని పూలను ఎంచుకోవచ్చు. కాషాయం కోసం బంతిపూలు, తెలుపు కోసం లిల్లీలు, ఆకుపచ్చ ఆకులతో జత చేసి చిన్న పుష్పగుచ్ఛాలను తయారు చేయవచ్చు. గాజు గ్లాసులలో లేదా ఫ్లవర్‌వాజ్‌లో వీటిని ప్లేస్ చేయడం వల్ల లుక్ బాగుంటుంది. వీటిని టేబుల్స్‌పై పెట్టవచ్చు. ప్రవేశ ద్వారం దగ్గర ఉంటే.. తాజా, సువాసనతో రూమ్‌ని ఆకట్టుకుంటుంది.
రంగోలి
సాంప్రదాయకంగా పండుగల సమయంలో రంగోలి ఉండాల్సిందే. స్వాతంత్య్ర దినోత్సవానికి కూడా మీరు ఈ రంగోలిని ఎంచుకోవచ్చు. దీనిని రంగులతో లేదా పూలతో డిజైన్ చేయవచ్చు. ఇండియా మ్యాప్, అశోఖ చక్రం వంటివి వేస్తే చూసేందుకు మరింత అందంగా ఉంటుంది.