ఒత్తిడి, కాలుష్యం కారణంగా చర్మం మెరుపును కోల్పోతుంది. అనేక చర్మ సమస్యలు కూడా వస్తున్నాయి. ఆరోగ్యపరంగాను ఎన్నో రకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వీటన్నిటికీ చెక్ పెట్టాలంటే రోజుకి ఒక గ్లాసు ఈ జ్యూస్ తాగితే చాలు. ఆ జ్యూస్ ఏంటో తెలుసా? క్యారెట్, యాపిల్, ఆరెంజ్ కలిపి చేసిన జ్యూస్. దీన్ని మీరు ఇంట్లోనే రోజు తాజాగా తయారు చేసుకుని తాగాలి. దీని తాగడం వల్ల కేవలం రెండు వారాల్లోనే మీకు ఫలితం కనిపిస్తుంది. ఆరోగ్యంగా ఉండటమే కాదు, ఉదయం నుంచి రాత్రి వరకు చురుగ్గా ఉంటారు. నీరసం మీరు దరి చేరదు. ఉత్సాహంగా పనులు చేస్తారు. ఇక చర్మం విషయానికి వస్తే మెరిసిపోవడం ఖాయం. మీ చర్మం లోని మార్పును మీరే గమనిస్తారు.
కేవలం అందం కోసమే జ్యూస్ తాగమని చెప్పడం లేదు. దీనిలో పాలిఫెనాల్స్, పొటాషియం అధికంగా ఉంటాయి. ఇవి అల్జీమర్స్ వచ్చే అవకాశాన్ని తగ్గిస్తాయి. అంటే మతిమరుపు వచ్చే ప్రమాదాన్ని చాలా మేరకు అడ్డుకుంటాయి. వయసు పెరిగిన వారికి అల్జీమర్స్ రావడం సహజం. కానీ ఈ జ్యూస్ తాగితే వయసు పెరిగినా కూడా మతిమరుపు వచ్చే అవకాశం దాదాపు తగ్గిపోతుంది. అలాగే గుండె ఆరోగ్యాన్ని కూడా ఈ జ్యూస్ కాపాడుతుంది. కంటి ఆరోగ్యానికి క్యారెట్ చాలా అవసరం. దీనిలో ఆపిల్, క్యారెట్, నారింజ మూడు రకాల పండ్లు ఉంటాయి, ఈ మూడింట్లోనూ విటమిన్ A పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి చూపును కాపాడుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. ఈ రెండు గుణాలు మన శరీరానికి అత్యవసరమైనవి. ఎన్నో రోగాలు మన శరీరం పై దాడి చేయకుండా ఇవి అడ్డుకుంటాయి. కాబట్టి వీటి కోసం అయినా రోజూ ఈ జ్యూస్ తాగాలి.
చాలామందిని కిడ్నీ వ్యాధులు కూడా ఇబ్బంది పెడతాయి. అలాంటివారు ఈ జ్యూస్ తాగడం వల్ల ఫలితం ఉంటుంది. ఆపిల్, నారింజలో ఉండే విటమిన్ సి శరీరానికి అందుతుంది. ఎముకలు, దంతాలు కూడా దృఢంగా అవుతాయి. ఆపిల్ పండులో విటమిన్లు ఫైబర్ అధికంగా ఉంటాయి. కొలెస్ట్రాల్‌ను తగ్గించేందుకు ఆపిల్ ఎంతో సాయపడుతుంది. మధుమేహం, క్యాన్సర్ వంటి రోగాలు రాకుండా ఇది అడ్డుకుంటుంది. కాబట్టి ఈ జ్యూస్ తాగడం వల్ల అన్ని రకాలుగా ఆరోగ్యకరం. అయితే చక్కెర మాత్రం కలుపుకోకండి.
ఇలా తయారు చేయండి
క్యారెట్ ముక్కలు - ఒక కప్పు
ఆపిల్ ముక్కలు - ఒక కప్పు
నారింజ తొనలు - ఒక కప్పు
నీళ్లు - అరగ్లాసు
అల్లం తరుగు - ఒక స్పూను
పైన చెప్పిన అన్ని పండ్లను బ్లెండర్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.నీళ్లు కూడా పోసుకోవాలి. వడకట్టుకుని ఆ జ్యూస్ తాగేయాలి.
Also read: కాలేయం ఆరోగ్యంగా ఉందా? లేక కొవ్వు పేరుకుపోయిందా? తెలుసుకోవడం ఎలా
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.