ఐస్ క్రీమ్ అనగానే అందరూ రెడీమేడ్‌గా కొని తినడానికే ఇష్టపడతారు. ఐస్ క్రీమ్‌ను నిజానికి ఇంట్లో చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు. చాలా తక్కువ సమయంలోనే ఐస్ క్రీమ్ రెడీ అవుతుంది. కాకపోతే అది ఫ్రీజ్ అవ్వడానికి 5 నుంచి 6 గంటల టైం పడుతుంది. తయారీ మాత్రం చాలా సులువు. ఇంట్లో అన్నం మిగిలిపోతే ఐస్ క్రీమ్‌గా మార్చేయొచ్చు. ఓ ప్రముఖ షెఫ్ తన ఇన్ స్టాగ్రామ్ హ్యాండిల్‌లో అన్నంతో ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చెప్పారు. దీనికి రైస్ క్రీమ్ అని పేరు పెట్టారు. అన్నం తాజాది అయినా మిగిలిపోయిన అన్నం అయినా ఈ ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది.
కావలసిన పదార్థాలు
అన్నం - 100 గ్రాములు
చక్కెర - 50 గ్రా ములు
పాలు - 150 గ్రాములు
విప్డ్ క్రీం - 200 గ్రాములు
కండెన్స్డ్ మిల్క్ - 30 గ్రాములు
బాదం - 6
తయారీ ఇలా...
1. ఒక గిన్నెలోకి ఉడికించిన అన్నాన్ని తీసుకోవాలి. అందులో చక్కెర, పాలు కలపాలి.
2. ఆ మూడింటిని మెత్తగా మిక్సీలో వేసి పేస్టులా చేయాలి.
3. ఇప్పుడు మరో గిన్నె తీసుకుని అందులో ఇప్పుడు విప్డ్ క్రీం వేయాలి. ఆ క్రీమ్‌ని బాగా గిలక్కొట్టాలి.
4. అందులో కండెన్స్‌డ్ మిల్క్‌ని కూడా వేసి బాగా గిలక్కొట్టాలి.
5. ఈ మిశ్రమానికి ముందుగా చేసి పెట్టుకున్న బియ్యం పేస్టును కలపాలి.
6. రెండింటినీ బాగా గిలక్కొట్టి ఐస్ క్రీమ్ మౌల్డ్‌లో వేసి రాత్రంతా ఫ్రిజర్లో ఉంచాలి.
7. ఉదయానికి రైస్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. దీని టేస్ట్ చాలా బాగుంటుంది.
వేసవి వచ్చిందంటే అందరికీ ఐస్ క్రీమ్ క్రేవింగ్స్ మొదలైపోతాయి. వేడి వాతావరణంలో చల్లచల్లని ఐస్ క్రీము తింటే శరీరానికి కలిగే ఆ హాయి వేరు. అన్నంతో చేసిన ఈ ఐస్ క్రీములో కొన్ని పోషకాలు కూడా ఉన్నాయి. ఈ ఐస్ క్రీములో విటమిన్ ఎ, కె, బి12 వంటి పోషకాలు ఉంటాయి. వేసవికాలంలో ఐస్ క్రీము తింటే శరీరం చల్లబడుతుంది. వడదెబ్బ కొట్టే అవకాశం తగ్గుతుంది. అయితే మరీ తీపిగా ఉన్న ఐస్ క్రీము తినకపోవడమే మంచిది. ఇంట్లో చేసుకుంటే చక్కెర తక్కువగా వేసుకుని చేసుకోవాలి. డయాబెటిస్ ఉన్న వారు చక్కెరకు ప్రత్యామ్నాయంగా ఏవైనా ఆర్టిఫిషియల్ చక్కెర గుళికలు వాడవచ్చు. వారానికి మూడు నుంచి నాలుగు ఐస్ క్రీములు తింటే మేలే జరుగుతుంది. కానీ వానా కాలం, శీతాకాలంలో మాత్రం ఐస్ క్రీములు అధికంగా తింటే రోగనిరోధక శక్తి తగ్గిపోయే అవకాశం ఉంది. పిల్లలే కాదు, పెద్దలు కూడా ఐస్ క్రీము తింటే మంచిదే. వేసవి కాలంలో తింటే మేలు జరుగుతుంది.
Also read: RO నీటిని ఇంట్లో వినియోగిస్తున్నారా? అయితే మీరు ఈ ముఖ్యమైన విటమిన్ లోపం బారిన పడవచ్చు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.