పిల్లలు పుట్టకపోతే సమస్య భార్యదే కాదు, భర్తది కూడా కావచ్చు. టెస్టులు చేయించుకుంటే సమస్య ఎవరిదో తెలుస్తుంది. కానీ చాలా మంది భర్తలు లోపం భార్యపైనే నెట్టేస్తారు. వారికి తెలియని విషయం ఏంటంటే వారికున్న కొన్ని అలవాట్లు సంతానోత్పత్తి సామర్థ్యాన్ని తగ్గించి,పిల్లలు కలగకుండా అడ్డుకుంటాయి. పునరుత్పత్తి వ్యవస్థ ఆడా, మగా ఇద్దరిలోనూ ఉంటుంది. ఆ వ్యవస్థ చక్కగా పనిచేస్తేనే ఎవరికైనా పిల్లలు కలిగేది. మగవారిలో ఏ అలవాట్లు వారి పునరుత్పత్తి సామర్థ్యాన్ని తగ్గిస్తున్నాయో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. 


1. ధూమపానం, మద్యపానం
సిగరెట్ కాల్చే అలవాటున్నవారిలో సంతానోత్పత్తిపై వినాశకరమైన ప్రభావాలు కనిపిస్తాయి. ‘మేము రోజూ సిగరెట్ కాలుస్తున్నాం... మాకు పిల్లలు పుట్టలేదా ’అని వాదించే మగరాయుళ్లూ ఉన్నారు. కానీ ప్రపంచంలో పొగతాగేవాళ్లలో ఎంత శాతం మందికి పిల్లలు పుడుతున్నారో, ఎంత మందికి చికిత్స తీసుకున్నాక పుడుతున్నారో తెలిస్తే మీరు అలా మాట్లాడలేరు. ధూమపానం వల్ల స్పెర్మ్ కౌంట్ భారీగా పడిపోతుంది. అంతేకాదు వీర్య కణాల్లో నాణ్యత కూడా తగ్గిపోతుంది. అంగస్థంభనలోపం కూడా కలుగుతుంది. ఆల్కహాల్ వినియోగం కూడా పురుషుల్లో టెస్టోస్టెరాన్ స్థాయిలను దెబ్బతీస్తుంది. మగవారిలో ఆరోగ్యకరమైన పునరుత్పత్తి వ్యవస్థ కావాలంటే వారు ధూమపానానికి, మద్యపానానికి దూరంగా ఉండాలి. 


2. ఒత్తిడి తగ్గించుకోవాలి
అధిక ఒత్తిడి ఎవరికీ మంచిది కాదు. ఒత్తిడి వల్ల హార్మోన్లలో అసమతుల్యత ఏర్పడుతుంది. మగవారిలో ముఖ్యంగా టెస్టోస్టెరాన్ అసమతుల్యతకు దారి తీస్తుంది. ఇది పురుషుల సంతానోత్పత్తిపై ప్రభావం చూపిస్తుంది. కాబట్టి మగవారు ఒత్తిడి తగ్గించుకోవాలి. అందుకోసం ధ్యానం, యోగా, వ్యాయామం వంటివి రోజూ పాటించాలి. 


3. బరువు పెరగద్దు
అధిక బరువుతో బాధపడేవారిలో సంతానోత్పత్తి సామర్థ్యం తక్కువగా ఉంటుంది. ఊబకాయం శరీరంపై చాలా రకాలుగా చెడు ప్రభావం చూపిస్తుంది. అందులో పిల్లలు కలగకుండా అడ్డుకోవడం ఒకటి. అధిక బరువు వల్ల స్పెర్మ్ లోని డీఎన్ఏలో అనారోగ్యకరమైన మార్పులకు కారణం అవుతుంది. వీర్యం నాణ్యతను తగ్గిస్తుంది. 


4. శారీరక శ్రమ
మీరు ఎంతగా విశ్రాంతికి అలవాటు పడితే అంతగా మీ శరీర సామర్థ్యం తగ్గిపోతుంది. కూర్చునే ఉద్యోగాలు చేసేవారు, అధికంగా నిద్రపోయేవారిలో సంతానోత్పత్తి వ్యవస్థ పనితీరు చురుగ్గా ఉండదు. శారీరక శ్రమ చాలా అవసరం. రోజూ కనీసం గంట సేపు వ్యాయామం చేస్తే మంచిది.లేదా ఓ అరగంట సేపు నడిచినా చాలు. శారీరక శ్రమ తగ్గిన వారిలో వీర్యకణాల నాణ్యత, పరిమాణం, సామర్థ్యం తక్కువగా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని కూడా ప్రభావితం చేస్తుంది. సంతానోత్పత్తిపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. 


5. మందులు వాడడం
కొంతమంది ప్రతి చిన్న ఆరోగ్య సమస్యకు మాత్రలు మింగుతూనే ఉంటారు. అధికంగా మందులు మింగడం కూడా శరీరంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. కొన్ని మందులు స్పెర్మ్ ఉత్పత్తిని తగ్గిస్తాయి. పునరుత్పత్తి అవయవాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి. కాబట్టి అవసరం అయితేనే మందులు వాడండి. చిన్నచిన్న నొప్పులకు కూడా మాత్రలు  మింగకండి. 


Also read: రోజూ రెడ్ వైన్‌ తాగితే డయాబెటిస్ ముప్పును తగ్గించుకోవచ్చు, అందంగానూ మారొచ్చు


Also read: ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేస్తే కంపెనీలకు ఖర్చు తగ్గదా? టీసీఎస్ ఛైర్మన్ తగ్గదని ఎలా తెగేసి చెప్పారు?