Eggless Omelette Recipe : ఆమ్లెట్ పేరు వినగానే.. మొదటగా గుడ్డు గుర్తుకు వస్తుంది. కానీ కొందరు గుడ్డు తినరు. మరి ఎగ్ లేకుండా ఆమ్లెట్ చేసుకోవచ్చా? అంటే కచ్చితంగా చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ వెజ్ ఆమ్లెట్ రుచిలో ఏమాత్రం తీసిపోదు. గుడ్లు తినని వారి నుంచి.. గుడ్లు తినేవారు కూడా ఈ టేస్టీ ఆమ్లెట్ తయారు చేసుకోవచ్చు. పైగా ఇది హెల్తీ కూడా. ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకునేందుకు మంచి ఆప్షన్ కూడా అవుతుంది. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఈ వెజ్ ఆమ్లెట్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం.
వెజ్ ఆమ్లెట్ చూసేందుకు, రుచిలో కూడా గుడ్డు ఆమ్లెట్లాగే ఉంటుంది. కానీ అందులో గుడ్డు ఉండదు. పైగా దీనిలో వెజిటెబుల్స్ కూడా ఉంటాయి. దీని ప్రత్యేకత ఏమిటంటే.. ఇందులో ఉపయోగించే పదార్థాలు అన్నీ.. వంటగదిలో సులభంగా దొరికేవే. ఇది ప్రోటీన్ అధికంగా ఉండే ఆరోగ్యకరమైన ఆహారం. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చే ఎంపిక కూడా అవుతుంది. మరి ఈ వెజ్ ఆమ్లెట్‌ని ఎలా చేసుకోవాలి? కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం.
వెజ్ ఆమ్లెట్ రెసిపీ
- ఒక కప్పు శనగపిండి
- చిన్న ముక్కలుగా తరిగిన టమోటా
- చిన్న ముక్కలుగా తరిగిన ఉల్లిపాయ
- పచ్చిమిరపకాయ
- రెండు టేబుల్ స్పూన్ల కొత్తిమీర
- 1/4 టీస్పూన్ పసుపు
- రుచికి సరిపడా ఉప్పు
- నీరు అవసరమైనంత
- వేయించడానికి నూనె
వెజ్ ఆమ్లెట్ రెసిపీ
వెజ్ ఆమ్లెట్ తయారు చేయడానికి.. ముందుగా ఉల్లిపాయ, టమోటా, పచ్చిమిరపకాయ, కొత్తిమీరను చిన్న ముక్కలుగా కోసి.. మీకు నచ్చిన కూరగాయలను కూడా ఇందులో తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక గిన్నెలో శనగపిండి వేసి.. అందులో పసుపు, ఉప్పు, చిన్న ముక్కలుగా తరిగిన కూరగాయలను వేసి బాగా కలపాలి. కూరగాయలను కలిపిన తర్వాత.. శనగపిండిలో నీరు పోసి మెత్తటి మిశ్రమంలా తయారు చేసుకోండి.
మిశ్రమం మరీ చిక్కగా లేదా పలుచగా ఉండకుండా చూసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద పెనం వేడి చేసి.. కొద్దిగా నూనె వేయండి. నూనె వేడెక్కిన తర్వాత ఒక చెంచా మిశ్రమాన్ని పెనం మీద వేసి ఆమ్లెట్‌లాగా వేసుకోవాలి. ఇప్పుడు తక్కువ మంట మీద రెండు వైపులా బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోండి. ఇది పూర్తిగా ఉడికిన తర్వాత చట్నీ లేదా సాస్‌తో వేడిగా తినవచ్చు.
వెజ్ ఆమ్లెట్ బెనిఫిట్స్
గుడ్లు తినని వారికి కూరగాయల ఆమ్లెట్.. ప్రోటీన్‌కి మంచి ఎంపిక అవుతుంది. ఇది లైట్ ఫీలింగ్ ఇవ్వడమే కాకుండా.. తినడానికి రుచికరంగా ఉంటుంది. ఫైబర్ అధికంగా ఉండి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దీనిని పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడతారు.