Becoming an Astronaut : అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుని దాదాపు తొమ్మిది నెలల తర్వాత భూమికి చేరుకున్నారు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్. ఈ నేపథ్యంలో సునీత విలియమ్స్ గురించి.. నాసా గురించి ఎక్కువమంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అసలు ఈ నాసాలో ఎవరైనా చేరాలని అనుకుంటున్నారా? అయితే మీరు కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోవాల్సింది. నాసాలో చేరడానికి కావాల్సిన అర్హతలు ఏంటో.. సునీత విలియమ్స్ ఏమి చదువుకున్నారో వంటి విషయాలు ఇప్పుడు చూసేద్దాం. 

నాసా ప్రకారం అర్హతలివే.. 

సునీతా విలియమ్స్​లాగా అంతరిక్షంలోకి వెళ్లాలని మీరు కలలు కంటూ శాస్త్రవేత్త కోరుకునేవారు.. తమ కెరీర్​ను ఎలా ముందుకు తీసుకువెళ్తే మంచిదో.. ఎలా ట్రైన్ అవ్వాలో ఇప్పుడు చూసేద్దాం. నాసా ప్రాకారం.. వ్యోమగామి అవ్వాలనుకుంటే.. మీకు మూడు సంవత్సరాల వృత్తిపరమైన అనుభవం ఉండాలి. లేదా కనీసం 1000 గంటలు పైలెట్ ఇన్​ కమాండ్ రికార్డు ఉండాలి. అంతేకాకుండా అధిక పనితీరు గల జెట్ విమానాలలో కనీసం 850 గంటల సమయం ఉండాలి. అలాగే వివిధ విమానాలపై అనుభవం కూడా ఉండాలి. 

విద్య ఇలా ఉండాలి..

మీరు వ్యోమగామి కావాలనుకుంటే పదో తరగతి నుంచే దీనికి సంబంధించిన ప్రిపరేషన్ ప్రారంభించాలి. 11వ తరగతిలో సైన్స్ స్ట్రీమ్ ఫిజిక్స్​తో చేయాలి. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ లేదా మ్యాథ్స్​లో మిమ్మల్ని సిద్ధం చేసుకోవాలి. వ్యోమగామి కావడానికి సాధారణంగా ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఫిజిక్స్, బయాలజీ లేదా కంప్యూటర్ సైన్స్ వంటి సబ్జెక్టులలో బ్యాచిలర్ డిగ్రీ లేదా మాస్టర్ డిగ్రీ చేయాలి. అలాగే అంతరిక్ష శాస్త్రంపై వీలైనంత అవగాహన ఉండాలి. 

ఇండియాలో స్పేస్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అధ్యయనం చేయాలనుకుంటే.. ఇక్కడ అందుబాటులో ఉన్న ఏకైక సంస్థ ఐఐఎస్టీ. ఈ ఇండియన్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ క్యాంపస్ కేరళలోని తిరువనంతపురం సమీపంలో ఉంది. ఏరోస్పేస్ ఇంజనీరింగ్, బీటెక్ ఏవియానిక్స్ అంటే ఎలాక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కోర్సు చేయాల్సి ఉంటుంది. నాసాలో చేరాలని నిర్ణయించుకుంటే ఎన్నో కష్టమైన దశలను దాటిన తర్వాత ఎంపిక జరుగుతుంది. శారీరకంగా, మానసికంగా కూడా మీరు ఫిట్​గా ఉంటేనే దీనిలో ప్రవేశం పొందుతారు. 

సునీతా విలియమ్స్ ఏమి చదువుకున్నారంటే.. 

అంతరిక్షంలో 9 నెలలు పైగా ఉండి.. ఎందరికో ఇన్​స్ప్రేషన్​గా నిలిచిన సునీతా విలియమ్స్ వ్యోమగామిగా ఎలా మారారో తెలుసా? సునీతా విలియమ్స్ తన ప్రాథమిక విద్యను అమెరికాలోని ఒహియోలోని నీధమ్ హై స్కూల్​లో చేశారు. 1987లో యూఎస్ నావల్ అకాడమీ నుంచి భౌతిక శాస్త్రంలో డిగ్రీ చేశారు. గ్రాడ్యూయేషన్ తర్వాత యూఎస్​ నేవీలో హెలికాప్టర్ పైలట్ కావడానికి శిక్షణ తీసుకున్నారు. 

ఫ్లోరిడా ఇన్​స్టిట్యూట్​ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంజినీరింగ్ మేనేజ్​మెంట్​ మాస్టర్స్ డిగ్రీని 1995లో పూర్తి చేశారు. నేవీలో ఉన్నప్పుడు విమానయానం, అంతరిక్ష రంగానికి సంబంధించిన ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నారు. ఈ అనుభవం కారణంగా 1998లో నాసా వ్యోమాగామి ఈవెంట్​కి ఆమె ఎంపికయ్యారు. నాసాలో చేరిన తర్వాత వివిధ అంతరిక్ష కార్యకలాపాలకు సాంకేతిక, శాస్త్రీయ శిక్షణ తీసుకున్నారు. ఆమె చదువు, తీసుకున్న శిక్షణ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఎక్కువ కాలం గడిపేందుకు అవకాశాన్ని కల్పించాయి.