బ్రిటన్‌లో వేగంగా వ్యాప్తి చెందుతున్న సూపర్ ఫ్లూ పలు దేశాల్లో ఆందోళన కలిగిస్తోంది. ఇప్పుడు H3N2 సూపర్ ఫ్లూ పాకిస్తాన్ కు పాకింది. దాంతో ఆ తరువాత భారతదేశంలో కూడా ఈ ఫ్లూ వైరస్ వ్యాప్తి చెందుతుందా అని ఆందోళన మొదలైంది. దీనిపై ఆరోగ్య నిపుణులు ఈ ప్రమాదాన్ని పూర్తిగా తోసిపుచ్చలేమని, అయితే అప్రమత్తంగా ఉండటం అవసరమని చెబుతున్నారు. కనుక బ్రిటన్ (UK) నుండచి పాకిస్తాన్ కు వ్యాప్తి చెందిన H3N2 సూపర్ ఫ్లూ వల్ల భారతదేశానికి ఎంత ప్రమాదం ఉందో ఇక్కడ  తెలుసుకుందాం. H3N2 సూపర్ ఫ్లూ అంటే ఏమిటి? ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organisation) ప్రకారం, ఈ వైరస్ ఇన్‌ఫ్లూయెంజా A రూపాంతరం. దీనిని సబ్‌క్లేడ్ అని పిలుస్తారు. దీనిలో కొన్ని జన్యుపరమైన మార్పులు కనిపించడంతో దీనిని సూపర్ ఫ్లూ అని పిలుస్తున్నారు. ఇది కొత్త వైరస్ కాదని,ఇప్పటివరకు ఉన్న లెక్కలు గమనిస్తే మునుపటి కంటే తీవ్రమైన వ్యాధిని కలిగిస్తుందని గుర్తించలేదని WHO తెలిపింది. ఇది సాధారణ ఫ్లూ సీజన్‌కు ముందే వేగంగా వ్యాప్తి చెందుతోంది. బ్రిటన్, పాకిస్తాన్‌లో ఆందోళన ఎందుకు పెరుగుతోంది? బ్రిటన్‌లో ఈ ఫ్లూ కేసులు అకస్మాత్తుగా పెరిగాయి. అక్కడ ఆసుపత్రిలో చేరే పేషెంట్ల సంఖ్య గత సంవత్సరం కంటే చాలా ఎక్కువగా ఉంది. గణాంకాల ప్రకారం, ఫ్లూ కారణంగా ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య 50 శాతం కంటే ఎక్కువ పెరిగింది. అత్యధికంగా 5 నుండి 14 సంవత్సరాల పిల్లలు, 15 నుండి 24 సంవత్సరాల యువతలో ఇన్ఫెక్షన్లు ఎక్కువగా గుర్తించారు. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, బ్రిటన్ నేషనల్ హెల్త్ సర్వీస్ వృద్ధులు, పిల్లలు, ఎక్కువ ప్రమాదం ఉన్న వ్యక్తులు వీలైనంత త్వరగా ఫ్లూ వ్యాక్సిన్‌ తీసుకోవాలని కోరింది. యూరప్‌లో H3N2 సూపర్ ఫ్లూ స్ట్రెయిన్ పాకిస్తాన్‌లో కూడా నిర్ధారించారు. దీనిపై అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పాకిస్తాన్‌లో ఈ వైరస్ బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారికి, పిల్లలకు, వృద్ధులకు మరింత ప్రమాదకరంగా మారుతోంది. ఫ్లూ తరువాత న్యుమోనియాగా మారితే పేషెంట్లకు వెంటిలేటర్లు కూడా అవసరమవుతాయని నిపుణులు హెచ్చరించారు. భారతదేశానికి పొంచి ఉన్న ప్రమాదం భారతదేశం, పాకిస్తాన్ మధ్య వాతావరణం, గాలి దిశ, ప్రజల కదలిక చాలా వరకు ఒకే విధంగా ఉంటాయి. దీనితో పాటు, శీతాకాలంలో పొగమంచు, కాలుష్యం, పాఠశాలల్లో పిల్లల గ్రూప్ సిట్టింగ్, ప్రయాణం వైరస్ వ్యాప్తికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. పాక్‌లో వైరస్ వ్యాప్తి చెందుతుంటే, భారతదేశంలో కూడా త్వరలోనే కేసులు నమోదయ్యే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. భారతదేశంలో గతంలో H3N2 ఫ్లూ కేసులు నమోదయ్యాయి. 
 
దేశంలో ఫ్లూ వ్యాప్తిపై వైద్య నిపుణులు నిఘా ఉంచారు. ఆసుపత్రులలో పరీక్షలకు సౌకర్యాలు ఉన్నాయి. అయితే, భారతదేశంలో ఫ్లూ వ్యాక్సిన్ వేయించుకునే వారి సంఖ్య చాలా తక్కువగా ఉండటం ఆందోళన పెంచుతోంది. ముఖ్యంగా  అధిక ప్రమాదం ఉన్న వారిలో వృద్ధులు, మధుమేహం, గుండె, ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్న వారు, బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.