Homemade Ginger Garlic Paste : అల్లం వెల్లుల్లి పేస్ట్‌ ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. కానీ చాలామంది టైమ్ ఉండట్లేదని బయట కొంటూ ఉంటారు. కానీ వాటిని కూడా కల్తీ చేసి అమ్మేస్తున్నారు. ఈ మధ్యకాలంలో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్​ కేసులు కూడా పెరుగుతున్నాయి. రసాయనాలు, ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా వేసిన ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్​ తింటే.. ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెప్తున్నారు. అందుకే ఇంట్లోనే ఫ్రెష్‌గా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలని సూచిస్తున్నారు.

Continues below advertisement

మరి అల్లం వెల్లుల్లి పేస్ట్​ను ఇంట్లో ఫ్రెష్​గా ఎలా చేసుకోవాలో.. ఎక్కువకాలం నిల్వ ఉంచుకునేందుకు దీనిని ఎలా తయారు చేసుకోవాలో, కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

కావాల్సిన పదార్థాలు

అల్లం – 250 గ్రాములు

Continues below advertisement

వెల్లుల్లి – 250 గ్రాములు

ఉప్పు – తగినంత

నూనె – 3 నుంచి 4 టేబుల్ స్పూన్లు

పసుపు – కొద్దిగా

నిమ్మరసం లేదా వెనిగర్ – 2 స్పూన్లు (ఆప్షన్ మాత్రమే)

తయారీ విధానం

ముందుగా అల్లంపై పొట్టు తీసి.. వెల్లుల్లి రెబ్బలపై తొక్కను కూడా తీసేసి.. శుభ్రంగా కడిగి పూర్తిగా తుడిచి ఆరబెట్టుకోవాలి. నీరు అస్సలు లేకుండా చూసుకోవాలి. ఇది చాలా ముఖ్యమైన స్టెప్. రెండూ పూర్తిగా ఆరిన తర్వాత.. అల్లం, వెల్లుల్లిని ముక్కలుగా కోసి.. మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు, పసుపు, నిమ్మరసం లేదా వెనిగర్ వేసి మళ్లీ ఒకసారి బ్లెండ్ చేయాలి. కొందరు నిమ్మరసం, వెనిగర్ వేసుకోరు. ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత చివరగా నూనె వేసి బాగా కలపాలి. అంతే ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పచ్చడి రెడీ.

ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే..

అల్లం, వెల్లుల్లి పేస్ట్​లో నీరు అస్సలు పడకూడదు. నూనె కొంచెం ఎక్కువగా వేస్తే ఎక్కువ రోజులు నిల్వ ఎక్కువ ఉంటుంది. నిమ్మరసం లేదా వెనిగర్ సహజమైన ప్రిజర్వేటివ్‌లా పనిచేస్తుంది. ఎప్పుడూ డ్రై స్పూన్‌తో మాత్రమే దీనిని తీసుకోవాలి. ఫ్రిజ్‌లో స్టోర్ చేస్తే 2–3 వారాలు సేఫ్‌గా ఉంటుంది. 

స్టోరేజ్ టిప్స్

అల్లం వెల్లుల్లి పేస్ట్​ని గాజు సీసాలో నిల్వ చేస్తే మంచిది. గాలి వెళ్తే పేస్ట్ త్వరగా పాడైపోతుంది కాబట్టి.. ఎయిర్‌టైట్ కంటైనర్ ఉపయోగించాలి. సూర్యరశ్మి పడకుండా చూసుకోవాలి. వాసన మారినా లేదా రంగు మారినా దానిని ఉపయోగించకూడదు. ఈ చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంచుకోవచ్చు.