Brain Infections In Children: వర్షాకాలంలో మెదడు సంబంధ వ్యాధుల విజృంభణ విషయంలో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అధికత తేమ, దోమల పెంపకం కారణంగా మెదడు సమస్యలు తలెత్తే అవకాశం ఉందంటున్నారు. అధిక తేమ, దోమల పెరుగుదల కారణంగా వైరల్ ఎన్‌సెఫాలిటిస్ తో పాటు ఇతర మెదడు ఇన్‌ఫెక్షన్లు పెరిగే అవకాశం ఉందన్నారు. పిల్లలు, వృద్ధులలో ఈ సమస్యలు ఎక్కువగా వస్తాయంటున్నారు.
పలు రాష్ట్రాల్లో పెరుగుతున్న బ్రెయిన్ ఇన్ఫెక్షన్లు
బాక్టీరియా, వైరస్ లు, శిలీంద్రాలు, పరాన్న జీవుల కారణంగా ఎన్సెఫాలిటిస్ తో పాటు పలు మెదడు సంబంధ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. ఎన్సెఫాలిటిస్ కారణంగా తీవ్రమైన తల మంటతో మెదడు కణజాలానికి ముప్పు వాటిల్లే అవకాశం ఉంటుంది. నరాల సంబంధ సమస్యలు కూడా తలెత్తుతాయి. డెంగ్యూ, జపనీస్ ఎన్సెఫాలిటిస్ లాంటి వైరస్ ఇన్ఫెక్షన్లకు వాహకాలుగా దోమలు ఉంటాయి. వర్షాకాలంలో దోమల వృద్ధి చెందడం వల్ల మెదడు ఇన్ఫెక్షన్లు పెరుగుతాయి. గత కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కర్ణాటక, ఒరిస్సా లాంటి తీర ప్రాంతాలతో పాటు అస్సాం, త్రిపుర లాంటి ఈశాన్య రాష్ట్రాలు, బిహార్, ఉత్తర ప్రదేశ్ లాంటి ఉత్తరాది రాష్ట్రాల్లో వైరల్ ఎన్సెఫాలిటిస్ విజృంభించింది. చాలా మంది హాస్పిటల్ పాలయ్యారు. బ్రెయిన్ ఇన్ఫెక్షన్లు.. వైరల్, బ్యాక్టీరియా, ట్యూబర్‌క్యులర్, ఫంగల్, ప్రోటోజోల్ సహా పలు రకాలుగా ఉంటాయి.
బ్రెయిన్ ఇన్ఫెక్షన్ల లక్షణాలు
మెదడు ఇన్ఫెక్షన్లు సోకిన వారిలో అత్యంత సాధారణంగా జ్వరం, తలనొప్పి, వాంతులు, మూర్ఛ లాంటి లక్షణాలు కనిపిస్తాయి. పిల్లలు, వృద్ధులలో బలహీనమైన ఇమ్యూనిటీ సిస్టమ్ కారణంగా మెదడు సంబంధ వ్యాధుల బారిన ఈజీగా పడుతారు. వర్షాకాలంలో పిల్లల్లో దద్దుర్లు, స్పృహ కోల్పోవడం లాంటి లక్షణాల పట్ల పేరెంట్స్ అప్రమత్తంగా ఉండాలి. వీలైనంత త్వరగా వైద్యులకు చూపించాలి. దోమల వృద్ధిని అడ్డుకోవడంతో పాటు దోమలు కరువకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అని డాక్టర్లు చెబుతున్నారు.
పిల్లలు విషయంలో జాగ్రత్తలు అవసరం అంటున్న వైద్యులు
మెదడు సంబంధ వ్యాధుల చికిత్సలు.. ఆయా వ్యాధులు సోకే రకం, కారణం మీద ఆధారపడి ఉంటుంది. బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు సాధారణంగా యాంటీబయాటిక్స్ తో తగ్గిపోయే అవకాశం ఉంటుంది. జపనీస్ ఎన్సెఫాలిటిస్, డెంగ్యూ లాంటి వైరల్ ఇన్ఫెక్షన్లు కూడా యాంటీవైరల్ మెడిసిన్స్ తో తగ్గుతాయి. ట్యూబర్‌కులర్ బ్రెయిన్ ఇన్‌ఫెక్షన్లకు చాలా కాలం పాటు యాంటీ ట్యూబర్‌క్యులోసిస్ డ్రగ్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఫంగల్ ఇన్ఫెక్షన్లు యాంటీ ఫంగల్ మెడిసిన్స్ తో చికిత్స తీసుకోవచ్చు. ఆయా వ్యాధుల తీవ్రత పెరిగితే ఐసీయూ ట్రీట్మెంట్ తో పాటు ఆపరేషన్ కూడా అవసరం కావచ్చని వైద్యులు తెలిపారు. వ్యాధులు సోకిన తర్వాత చికిత్స తీసుకోవడం కంటే, రోగాలు రాకుండానే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ప్రధానంగా దోమలను అరికట్టడంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలంటున్నారు. చిన్న పిల్లలను వీలైనంత వరకు పొడి, వెచ్చని ప్రదేశాల్లో ఉండేలా చూడాలంటున్నారు.
Read Also: 5 రోజులు, 6 మరణాలు - చండీపురాను వణికిస్తున్న వైరస్, చికిత్స లేని ఈ వ్యాధి లక్షణాలేంటో తెలుసా?