Food Combinations: కొన్ని రకాల కూరగాయలను కలిపి వండడం మన ఆరోగ్యానికి మంచిది కాదు అని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. సాధారణంగా ఒకే కూరను వండడం కన్నా రెండు రకాల కూరగాయలను కలిపి వండడం ఎంతో మందికి అలవాటు. దీనివల్ల పోషకాలు ఎక్కువగా అందడంతో పాటు రుచి కూడా బాగుంటుంది. అయితే కొన్ని రకాల ఫుడ్ కాంబినేషన్లు అనేవి మంచి రుచిని ఇస్తాయి కానీ ఆరోగ్యపరంగా కొంత కీడును చేస్తాయి. కాబట్టి ఫుడ్ కాంబినేషన్ల విషయంలో జాగ్రత్త పడాలి. పోషకాహార నిపుణులు చెబుతున్న ప్రకారం కొన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలను, దుంపలను కలిపి వండకూడదు. అలా వండడం వల్ల శరీరంలో కొన్ని రకాల మార్పులు జరుగుతాయి. దీనివల్ల కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది.
టమాటాలు, చిలకడదుంపలను ఎప్పుడూ కలిపి వండడానికి కానీ తినడానికి కానీ ప్రయత్నించవద్దు. టమోటాల్లో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. పిండి పదార్థాలు, కార్బోహైడ్రేట్స్ దుంపల్లో అధికంగా ఉంటాయి. ఈ రెండింటినీ కలిపి వండడం లేదా తక్కువ కాలవ్యవధిలో విడివిడిగా అయినా తినడం వల్ల కార్బోహైడ్రేట్స్ తో సిట్రిక్ యాసిడ్ కలుస్తుంది. దీనివల్ల ఆహారం అరగకపోవడం వంటి అజీర్తి సమస్యలు తలెత్తుతాయి. ఆహారం తిన్నాక అలసటగా కూడా అనిపిస్తుంది. భోజనం చేసాక చాలా అలసటగా కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. అంటే మీరు రాంగ్ ఫుడ్ కాంబినేషన్ తిన్నారని అర్థం. టమాటాలు, చిలగడ దుంపలను ఎప్పుడూ కలిపి ఉండకూడదు. సలాడ్లో కూడా కలపకూడదు. టమాటాతో భోజనం చేశాక వెంటనే చిలగడ దుంపని తినేందుకు ప్రయత్నించకూడదు.
అలాగే భోజనం చేసిన వెంటనే పండ్లను తినడం వంటివి చేయకూడదు. భోజనంలో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవి జీర్ణం కావడానికి సమయం పడతాయి. భోజనంతో పాటు పండ్లు తినడం లేదా భోజనం తిన్న వెంటనే పండ్లు తినడం వల్ల అవి కూడా జీర్ణం కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి. ఈలోపే పండ్లు పొట్టలో పులసిపోయి పేగులోని లోపలి పొరని దెబ్బతీస్తాయి. కాబట్టి భోజనం తిన్నాక పండ్లు తినే అలవాటును మార్చుకోండి. భోజనం తిన్నాక రెండు గంటల గ్యాప్ ఇచ్చాకే పండ్లను తినాలి.
మాంసం ఉత్పత్తులు, బంగాళాదుంపలు వంటి వాటిని కలిపి తినకూడదు. అలాగే మాంసం తిన్నాక కొంత గ్యాప్ ఇచ్చాకే బంగాళదుంపలతో వండిన ఆహారాలను తినాలి. మాంసం ఉత్పత్తుల్లో మాంసకృత్తులు పుష్కలంగా ఉంటాయి. ఇక బంగాళదుంపల వంటి వాటిలో పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రెండూ కలిపి తినడం వల్ల సూక్ష్మ పోషకాలు శరీరం పై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి. అంతేకాదు ఈ రెండు పదార్థాలు అరుగుదల కోసం ఎక్కువగా జీర్ణ రసాలు ఉత్పత్తి కావాల్సి వస్తుంది. దీనివల్ల కడుపులో గ్యాస్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలు ఎక్కువగా వస్తాయి. కాబట్టి మాంసాహారం, పిండి పదార్థాలు కలిగిన బంగాళదుంపను కలిపి తీసుకోరాదు.
అలాగే పాల ఉత్పత్తులను, పండ్లను కూడా కలిపి తీసుకోరాదు. చాలామంది పెరుగులో పండ్లు కలుపుకొని తినే అవకాశం ఎక్కువ. కానీ నిజానికి పెరుగును పండ్లను కలిపి తినకూడదు. ఇలా తినడం వల్ల ఆరోగ్యపరంగా కొంత నష్టమే జరుగుతుంది. పాల ఉత్పత్తులైన పెరుగు, వెన్న, నెయ్యి వంటివన్నీ కూడా సైనస్‌లను మూసేస్తాయి. దీనివల్ల జలుబు, అలర్జీలు పెరిగిపోతాయి. కాబట్టి పాలు లేదా పెరుగు తిన్నాక రెండు గంటలు గ్యాప్ ఇచ్చాకే పండ్లను తినాలి. అలాగే పండ్లు తిన్నాక కొంత గ్యాప్ ఇచ్చాకే పాలు, పెరుగు వంటివి తాగాలి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.