భారతీయ సంగీత ప్రపంచంలో ఎప్పటికీ పూరించలేని శూన్యం అలుముకుంది. ‘నేను పాడడం ఎప్పటికీ ఆపను, చనిపోయాక నాతోనే నా సంగీతం కూడా పరలోకానికి ప్రయాణిస్తుంది’ అని అంటుండే వారు లతా మంగేష్కర్. ఆమెకు సంగీతమంటే చాలా ప్రేమ.  అలాగే ఆహారమన్నా చాలా ఇష్టం. ముఖ్యంగా చెల్లి ఆశాభోంస్లే చేతి వంటంటే ఇంకా ఇష్టం. ఒక ఇంటర్య్వూలో ఆశా ఈ విషయాన్ని చెప్పారు. ‘అక్క నా వంటకి అభిమాని. నాలా ఎవరూ వండరని చెబుతుండేవారు. నా చేత షమ్మీ కబాబ్‌లు వండించుకునేవారు. అలాగే కొత్తిమీర వేసి చేసే మటన్ కూడా అక్కకి ఇష్టం’ అని వివరించారు. దీన్ని బట్టి చూస్తే లతా మంగేష్కర్ భోజనప్రియురాలని తెలుస్తోంది. 


కుంపటి వంటలు...
కుంపటి పొయ్యిపై వండే వండలంటే లతాజీకి ఇష్టమని ఆమె కొన్ని ఇంటర్య్వూలలో తెలిపారు. అలాగే తన రోజువారీ దినచర్యను కూడా ఓసారి పంచుకున్నారు. ఉదయం ఆరుగంటల్లోపే ఆమె నిద్ర లేస్తారు. ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లు తాగుతారు. కాఫీ లేదా టీతో బిస్కెట్లు తినడమంటే చాలా ఇష్టమని తెలియజేశారు. అల్పాహారంగా ఆరోగ్యకరమైన ఆహారాన్నే ఎంచుకునేవారు. 


కారంగా ఉంటే ఇష్టం
ఆమె ఓసారి మీడియాతో మాట్లాడుతూ తనకు స్పైసీగా ఉండే వంటలంటే చాలా ఇష్టమని తెలిపారు. నూనె వేసిన వంటలు, పచ్చళ్లు కూడా తింటానని, అయితే ఏది తిన్నా అధికంగా కాకుండా మితంగా తింటానని చెప్పారు. చల్లటి నీళ్లు మాత్రం తాగనని, పెరుగుకు దూరంగా ఉంటానని తెలిపారు. 


సముద్రపు ఆహారం...
లతా మంగేష్కర్ తండ్రి గోవాకు చెందిన వ్యక్తి కావడంతో ఆమెకు సముద్రపు ఆహారం పట్ల మక్కువ పెరిగిందట. మాంసాహారాన్ని తాను బాగా ఇష్టపడతానని బహింరంగంగగానే చెప్పారామే. అలాగే చపాతీతో రకరకాల శాకాహార కూరలను రోజూ తింటారు. ఆమెకు ఏ ఆహారం విషయంలో కూడా అలెర్జీ లేదు. అన్ని రకాల ఆహారాలు పడతాయి. 


ఇష్టమైన స్వీట్
తీపి పదార్థాలలో క్యారట్‌తో చేసే గాజర్ హల్వాను బాగా ఇష్టంగా తింటారు. అందులో అధికంగా కేసరి, బాదం, పాలు కలిపి చేస్తే మరీ ఇష్టం. 


కచేరీలు, పాటల రికార్డింగ్ ఉన్నప్పుడు చాలా తక్కువగా తిని వెళ్లేవారు లతాజీ. పాడడం పూర్తయ్యాక మాత్రం పొట్ట నిండా లాగించేవారట. మామిడి పండ్లంటే ఇష్టపడేవారు. తనతో పాటూ ఎల్లప్పుడు వేడి నీళ్లు, తేనే తీసుకెళ్లే వారు.  


Also Read: పాటంటే లతాజీ, లతాజీ అంటే పాట-తెలుగు రాష్ట్రాల సీఎంలు, గవర్నర్ల సంతాపం


Also read: ప్రయాణంలో వాంతులు, వికారం వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి