ఆరడుగులుంటేనే అందగాళ్లనే లెక్క మనది. కానీ అధ్యయనం చెబుతున్న విషయాలు చూస్తుంటే భవిష్యత్తులో ఆరడుగుల అందగాళ్లు మన దేశంలో కనిపించడం కాస్త కష్టమే కావచ్చు. ఎందుకంటే 1998 నుంచి 2015 వరకు పౌరులు పెరిగిన ఎత్తులను అంచనా వేశారు ఓ సర్వేలో. అందులో భయంకరమైన నిజం బయటపడింది. భారతీయులలో పెద్దల సగటు ఎత్తు తగ్గుతున్నట్టు తేలింది. గతంలో అనేక అధ్యయనాలు ప్రపంచవ్యాప్తంగా పెద్దల సగటు ఎత్తు పెరుగుతున్నట్టు చూపించాయి. కానీ ఆ ధోరణికి వ్యతిరేకంగా మనదేశంలో ఎత్తు తగ్గుతున్నట్టు తేలడం కాస్త కలవరపెట్టేదే. 1998 నుంచి 2015 వరకు పౌరులు పెరిగిన ఎత్తును అంచనా వేసి ఈ ఫలితాన్ని వెల్లడించారు అధ్యయనకర్తలు. ఈ అధ్యయనానికి ‘ట్రెండ్స్ ఆఫ్ అడల్ట్ హైట్ ఇన్ ఇండియా ఫ్రమ్ 1998-2015: నేషనల్ ఫ్యామిలీ అండ్ హెల్త్ సర్వే’ పేరుతో నిర్వహించారు.
అధ్యయనకర్తలు మాట్లాడుతూ ‘ప్రపంచవ్యాప్తంగా సగటు ఎత్తులో పెరుగుదల కనిపిస్తుంటే, భారతదేశంలో మాత్రం క్షీణత కనిపించడం ఆందోళనకరంగా ఉంది. ఇలా ఎందుకు జరుగుతోందో తెలుసుకోవాలి. విభిన్న జన్యు సమూహాలు ఉన్న మనదేశంలో ఈ అంశం పై లోతైన పరిశోధన అవసరం’ అని చెప్పారు.
ఎంత తగ్గింది?
ఈ అధ్యయనంలో భాగంగా 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయస్కులను ఎంపిక చేసుకున్నారు. 1998 నుంచి 2015 వరకు ఆ వయస్సులో ఉన్నవారి ఎత్తును నమోదు చేసుకుంటూ వచ్చారు. ఆ పరిశోధనలో మహిళల సగటు ఎత్తు సాధారణం కన్నా 0.42 సెంమీ, పురుషుల ఎత్తు 1.10 సెంమీ తగ్గినట్టు తేలింది.
కారణం ఏంటి?
భారతీయ పెద్దల సగటు ఎత్తులో తగ్గుదల కనిపించడానికి కేవలం జన్యుపరమైన కారణమే కాకుండా ఇంకా ఇతర కారణాలు ఉండొచ్చని అధ్యయనం తెలిపింది. చెడు జీవనశైలి, పోషకాహారలోపం, సామాజిక, ఆర్ధిక నిర్ణయాధికారాలు, వివక్ష... ఇలాంటివి ఎన్నో ఉండొచ్చు అని పేర్కొంది. అయితే ఎత్తులో 60 నుంచి 80శాతం బాధ్యత జన్యుపరమైనదేనని. మిగతాదే సామాజిక పరిస్థితులు, జీవనశైలిపై ఆధారపడి ఉంటుందని చెప్పారు. తల్లి గర్భంలో పిండం రూపంలో ఉన్నప్పుడు పోషకాహారలోపం తలెత్తితే ఇలా తక్కువ ఎత్తు వచ్చే అవాకాశాలు ఉన్నాయని తెలిపారు. అలాగే టీనేజీలో కుంగుబాటు లాంటి వచ్చినా ఎదుగుదలపై ప్రభావం తీవ్రంగా పడుతుందని చెప్పారు.
ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.
Also read: పిల్లలు తక్కువేం కాదు, వైరస్‌ను వాళ్లూ వ్యాప్తి చేయగలరు
Also read: మీ నడకే మీకు చెప్పేస్తుంది... ఈ మహమ్మారి గురించి
Also read: ఇరవై, ముఫ్పైలలోనే బట్టతల? కారణాలు ఇవే కావచ్చు...
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి