High Sugar Foods : ఆరోగ్యానికి మంచివని చాలామంది హెల్తీ స్నాక్స్​గా కొన్ని పదార్థాలు తీసుకుంటారు. అవి ఆరోగ్యానికి మంచివని చాలామంది కూడా ప్రమోట్ చేస్తూ ఉంటారు. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటి అంటే.. వాటిలో కూడా షాకింగ్ మోతాదులో చక్కెర ఉంటుందట. ఫుడ్ మార్కెటింగ్ సంస్థలు లో ఫ్యాట్, ఎక్కువ ప్రోటీన్ లేదా సహజమైన లేబుల్స్ కలిగి ఉన్నాయంటూ వాటిని ప్రమోట్ చేస్తాయి. కానీ అవన్నీ వాస్తవం కాదట. వాటిలోని షుగర్స్.. శరీరంలోని చక్కెర స్థాయిలు పెంచుతాయని చెప్తున్నారు నిపుణులు. అయితే వీటిని తీసుకోవడం వల్ల ఎనర్జీ తగ్గడం, బరువు పెరగడం, కొన్ని వ్యాధులు ప్రమాదం పెరుగుతుందని అంటున్నారు. ఇంతకీ ఆ హెల్తీ ఫుడ్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

ఫ్లేవర్డ్ యోగర్ట్

 

(Image Source: Pinterest/servingrecipe2)

ఫ్లేవర్డ్ యోగర్ట్ లేదా పెరుగు నోటికి రుచిగా ఉంటుంది. దీనిని హెల్తీ స్నాక్​గా చాలామంది తీసుకుంటారు. అయితే యోగర్ట్ మంచిదే. కానీ దానిని ఫ్లేవర్డ్ రూపంలో తీసుకుంటే మంచిది కాదట. ఎందుకంటే దానిలో కూల్ డ్రింక్​ కంటే ఎక్కువ షుగర్స్ ఉంటాయట. ఒక ఫ్రూట్ ఫ్లేవర్డ్ యోగర్ట్​లో 15-20 గ్రాముల చక్కెర ఉంటుంది. అయితే ఇది రోజూవారి షుగర్స్​లో వైద్యులు సిఫార్సు చేసేదానిలో సగం. వీటిలో పండ్ల రుచి కోసం నిజమైన పండ్ల కంటే షుగర్ సిరప్స్, ఫ్రూట్ ఫ్లేవర్స్​తో మిక్స్ చేస్తారు. కాబట్టి ఇలా తినాలనుకుంటే.. సాధారణ పెరుగును తీసుకుని దానిలో తాజా పండ్లు వేసుకుని తినడం ఆరోగ్యానికి మంచి ఎంపిక అవుతుంది.

ప్రోటీన్ బార్స్

(Image Source: Pinterest/JarOfLemons)

ప్రోటీన్ బార్లను ఫిట్‌నెస్​లో భాగంగా చాలామంది తింటారు. ఈ బార్‌లు కూడా తప్పుదారి పట్టిస్తాయట. ఈ ప్రోటీన్ బార్‌లు కండరాల రికవరీ, ఎనర్జీని అందిస్తాయని ఎక్కువగా ప్రమోట్ చేస్తారు. అయితే చాలా బ్రాండ్‌లు మొక్కజొన్న సిరప్, గ్లూకోజ్, చాక్లెట్ లేయర్స్​తో నిండి ఉంటాయి. ఇవి స్వీట్స్​ లాగానే ఉంటాయి. "ఆరోగ్యకరమైనవి"గా ప్రమోట్ చేసే కొన్ని ప్రోటీన్ బార్‌లలో 25 గ్రాముల వరకు చక్కెర ఉంటుంది. ఇది ఒక డోనట్ కంటే ఎక్కువ. కాబట్టి మీరు ప్రోటీన్ బార్‌లను కొనేప్పుడు లేబుల్‌లను చెక్ చేసుకోవాలి. దానిలో షుగర్ మొదటి మూడు పదార్థాలలో ఉంటే అది ఆరోగ్యకరమైనది కాదని అర్థం. 

మ్యూస్లీ

(Image Source: Pinterest/sldrietz)

మ్యూస్లీని చాలామంది అల్పాహారంగా తీసుకుంటారు. ఈ రోజుల్లో చాలామంది టిఫెన్ చేసుకునే సమయం లేకపోవడంతో దీనినే ఎక్కువగా తింటున్నారు. పైగా దీనిని హెల్తీ ఫుడ్​గా ప్రమోట్ చేస్తారు. అయితే దీనిలో తేనె, బ్రౌన్ షుగర్, అదనపు చాక్లెట్ ఫ్లేవర్స్ కూడా ఉంటాయి. పాలల్లో ఓ చిన్న గిన్నె మ్యూస్లీ వేసుకుని తీసుకుంటే.. దానిలో 20-30 గ్రాముల చక్కెరను అందిస్తుంది. “లో ఫ్యాట్” అని చెప్పే వాటిలో కూడా రుచి కోసం ఎక్కువ చక్కెరను వేస్తారు. మీరు ఇలాంటి ఫుడ్ తినాలనుకుంటే.. సొంతంగా వోట్స్, గింజలు, సీడ్స్​తో ఇంట్లో తయారు చేసుకోవచ్చు. స్వీటెనర్ కూడా లిమిటెడ్​గా తీసుకోండి. 

పండ్ల రసాలు

(Image Source: Pinterest/stephanietrelog)

ఫ్రూట్ జ్యూస్ హెల్తీ డ్రింక్ అనుకుంటారు కానీ.. ప్యాక్ చేసినవి ఆరోగ్యానికి మంచిది కాదు. పండ్లను ప్రాసెస్ చేసిన తర్వాత.. వాటిలోని ఫైబర్ పూర్తిగా పోతుంది. దీనివల్ల జ్యూస్​లో ఫ్రక్టోస్ ఎక్కువగా ఉంటుంది. ప్యాక్ చేసిన జ్యూస్​లలో రుచి కోసం అదనపు చక్కెర లేదా అధిక ఫ్రక్టోస్ కార్న్ సిరప్ ఉపయోగిస్తారు. ఒక గ్లాసు జ్యూస్​లో ఆరు టీస్పూన్ల చక్కెర ఉంటుంది. ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాల కోసం ఫ్రూట్స్ నేరుగా తినొచ్చు. ఇలా తీసుకోవడం వల్ల షుగర్ తక్కువ మోతాదులో అందడంతో పాటు ఫైబర్‌ శరీరానికి అందుతుంది.

డ్రై ఫ్రూట్స్

 

(Image Source: Pinterest/veganatlas)

ఎండుద్రాక్ష, క్రాన్ బెర్రీస్, ఆప్రికాట్లు వంటి డ్రైఫ్రూట్స్​ను పోషకాలతో నిండిన స్నాక్​గా మార్కెట్ చేస్తారు. అయితే షాకింగ్ విషయం ఏమిటంటే.. ఈ డ్రై ఫ్రూట్స్​ను చాలా వరకు ప్రాసెసింగ్ చేస్తారు. ఆ సమయంలో షుగర్ కోటింగ్ చేస్తారు. ఒక కప్పు స్వీట్ చేసిన డ్రై క్రాన్ బెర్రీస్‌లో 70 గ్రాముల కంటే ఎక్కువ షుగర్ ఉంటుంది. అంటే మీరు తాజా పండ్ల కంటే చాలా ఎక్కువ షుగర్స్ తీసుకుంటున్నారని అర్థం. 

సాస్‌లు

(Image Source: Pinterest/tonetiki)

సలాడ్లు ఆరోగ్యానికి మంచివే కానీ.. దానిలో రుచికోసం ఉపయోగించే రెడీమేడ్ డ్రెస్సింగ్ అంత మంచిది కాదు. బాటిల్డ్ డ్రెస్సింగ్‌లు, లో ఫ్యాట్ వెర్షన్లలో దొరికే సాస్​లు ఆరోగ్యానికి మంచివి కాదు. మీ సలాడ్స్​లో వీటిని వేసుకోవడం వల్ల ఇబ్బందులు పెరుగుతాయి. అలాగే కెచప్, స్వీట్ చిల్లీ సాస్​లలో ఎక్కువ మోతాదులో షుగర్స్ ఉంటాయి. రెండు టేబుల్ స్పూన్ల కెచప్​లో రెండు టీస్పూన్ల చక్కెర వరకు ఉంటుంది. వీటికి బదులు ఆలివ్ నూనె, నిమ్మ, మూలికలతో ఇంట్లో తయారుచేసుకునే డ్రెస్సింగ్‌లు ఆరోగ్యకరమైనవిగా చెప్తారు. 

షుగర్​ని కంట్రోల్ చేయడానికి ఈ ఫుడ్స్​కి దూరంగా ఉంటూ.. ప్రత్యామ్నాయంగా ఏవి తీసుకుంటే మంచిదో వాటిని ఎంచుకోవాలి. అలాగే హెల్తీ ఫుడ్స్​ని డైట్​లో చేర్చుకునేముందు వైద్యులు లేదా నిపుణుల సలహా తీసుకుంటే మంచిది. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.