DIY Weight Loss Tea at Home : టీ తాగే అలవాటు ఉన్నవారు మిల్క్​ టీకి బదులు హెర్బల్ టీలను తీసుకోవచ్చు. ఇవి ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఇవ్వడంతో పాటు.. మీకు టీ తాగిన ఫీల్ ఇస్తాయి. ముఖ్యంగా బరువు తగ్గాలనుకుంటున్నావారు, జీర్ణ సమస్యలకు దూరంగా ఉండాలనుకుంటున్నవారు టీకి బదులుగా.. హెర్బల్ డ్రింక్స్​ని తీసుకుంటే మంచిదని చెప్తున్నారు నిపుణులు. ఎలాంటి హెర్బల్ టీలు తాగితే ఎలాంటి లాభాలు కలుగుతాయి. అవి ఏ విధంగా బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తాయో ఇప్పుడు చూసేద్దాం. 

పుదీనా టీ

పుదీనా టీ మెరుగైన జీర్ణ వ్యవస్థను అందిస్తుంది. ఆకలిని తగ్గించి.. కేలరీలను తీసుకోవడాన్ని నిరోధిస్తుంది. దీనివల్ల బరువు తగ్గడం కాస్త సులభమవుతుంది. పుదీనాను టీను తయారు చేసుకోవడం చాలా సింపుల్. మరుగుతున్న నీటిలో పుదీనా, అల్లం వేయాలి. అవి మరిగిన తర్వాత టీ పొడి వేసి కాసేపు మరగనివ్వాలి. స్టౌవ్ ఆపేసి వడకట్టుకుని తాగాలి. దీనిలో నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. 

మందార టీ

మందార టీ కార్బోహైడ్రేట్ శోషణ, శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించి.. శరీరానికి శక్తిని అందిస్తుంది. దీనివల్ల బరువు కంట్రోల్ అవుతుంది. మందార ఆకులను నీటిలో మరిగించి.. నేరుగా తాగవచ్చు. లేదా టీపొడి వేసుకుని దానితో కలిపి మరిగించి వడకట్టుకుని తాగవచ్చు. 

బ్లాక్ టీ

బ్లాక్​ టీలో థియాఫ్లేవిన్స్ వంటి ఫ్లేవనాయిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీవక్రియను మెరుగుపరుస్తాయి. శరీరంలోని అవయవాల చుట్టూ పేరుకుపోయిన కొవ్వును ఇవి తగ్గించి.. బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తాయి. టీ పౌడర్​ను నీటిలో వేసి మరిగించి.. ఆ నీటిలో పాలు, పంచదార వంటివి ఏమి వేయకుండా తాగేయాలి. 

గ్రీన్ టీ 

ఎన్నో ఏళ్లుగా బరువు తగ్గడానికి గ్రీన్ టీని చాలామంది తమ రొటీన్​లో చేర్చుకుంటున్నారు. వీటిలో కొవ్వును కరిగించే కాటెచిన్​లు ఉంటాయి. యాంటీఆక్సిడెంట్లతో నిండిన ఈ డ్రింక్ పొట్ట దగ్గర పేరుకున్న కొవ్వును కంట్రోల్ చేస్తుంది. గ్రీన్ టీ ఆకులను మరిగించి లేదా గ్రీన్ టీ బ్యాగ్​లను గోరువెచ్చని నీటిలో వేసి వీటిని తయారు చేసుకోవచ్చు. 

ఊలాంగ్ టీ 

కొవ్వును కరిగించడంలో ఊలాంగ్ టీ కూడా మంచి ప్రయోజనాలు ఇస్తుంది. దీనిలో కొవ్వును కరిగించే పాలీఫెనాల్స్ ఉంటాయి. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. మెటబాలీజంను పెంచి కేలరీలు బర్న్ అవ్వడంలో హెల్ప్ చేస్తుంది. దీనివల్ల బరువు తగ్గుతారు. ఊలాంగ్ ఆకులను నీటిలో వేసి మరిగించాలి. దీనిని వడకట్టి ఆ నీటిని తాగాలి. 

ఇవే కాకుండా అల్లం టీ, దాల్చిన చెక్క టీ కూడా మంచి ఫలితాలు ఇస్తాయి. కాబట్టి మీకు టీ తాగే అలవాటు ఉంటే.. ఆ అలవాటును వీటితో రిప్లేస్ చేయండి. ఇవి మీ ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు బరువును కంట్రోల్ చేస్తాయి. అయితే గుర్తించుకోవాల్సిన విషయం ఏంటి అంటే.. ఇవి బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తాయి. కేవలం వీటిని తాగితే బరువు తగ్గరు కాబట్టి.. లైఫ్ స్టైల్​లో మార్పులు చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.