బిడ్డ పుట్టిన దగ్గర నుంచి మొదటి ఆరు నెలలు వరకు తల్లి పాలే బలం. అవి పోషకాహారంతో నిండి ఉంటాయి. అందుకే తల్లి పాలు మాత్రమే ఇవ్వాలని వైద్యులు సూచిస్తారు. ఆరో నెల వచ్చిన తర్వాత మెల్లగా ఘన పదార్థాలు అలవాటు చేయాలని సలహా ఇస్తారు. అందుకే అన్నప్రాసన ఏర్పాటు చేస్తారు. ఇక అప్పటి నుంచి బిడ్డకు పప్పు, అన్నం కొద్దిగా పెట్టవచ్చు. సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్ని పెట్టాలి. ఆరో నెల తర్వాత పిల్లలకు పెట్టేందుకు ఇక్కడ అత్యంత పోషకమైన రుచికరమైన కొన్ని ఆహారాలు ఉన్నాయి.


మూంగ్ దాల్ కిచిడీ


ఈ కిచిడీ చేయడానికి మూంగ్ దాల్(పెసరపప్పు) అన్నం కలిపి బాగా మెత్తగా ఉడికించి అందులో చిటికెడు ఉప్పు, పసుపు వేసుకోవాలి. కుక్కర్ లో ఒక విజిల్ వచ్చే వరకు ఉంచుకుంటే సరిపోతుంది. దాన్ని బయటకి తీసి మెత్తగా మెదుపుకోవాలి. అందులో కాస్తే దేశీ నెయ్యి జోడించి పిల్లలకు తినిపిస్తే చాలా రుచిగా ఉంటుంది. మూంగ్ దాల్ కిచిడీ తినడం వల్ల పిల్లలకు కావాల్సిన పోషకాలు అందుతాయి. ఎదుగుదల కూడా వేగంగా ఉంటుంది.


యాపిల్ ప్యూరీ


యాపిల్ లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పిల్లలకు సులభంగా జీర్ణమయ్యే ఆహారం. యాపిల్ తొక్క, గింజలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కుక్కర్ లో పెట్టి ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఆవిరి పోయిన తర్వాత దాన్ని మెత్తగా మెదుపుకుంటే సరిపోతుంది. పిల్లలు చాలా ఇష్టంగా దీన్ని తింటారు.


ఓట్మీల్ ప్యూరీ


రుచికరమైన, ఆరోగ్యకరమైన వంటకం ఇది. మీరు చేయాల్సిందల్లా ఓట్మీల్ ని మెత్తగా చేసి దాన్ని పాలతో ఉడికించుకోవాలి. అందులో కావాలంటే అరటి పండ్లు లేదా ఇతర పండ్లు ఏవైనా జోడించుకోవచ్చు. పిల్లలకు రోజూ ఓట్ మీల్ ప్యూరీని తినిపించడం వల్ల శారీరక అభివృద్ధి వేగంగా జరుగుతుంది. జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.


బ్రకోలీ ప్యూరీ


పోషకాలు అధికంగా ఉండే కూరగాయ బ్రకోలి. ఇది పెట్టడం వల్ల పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. ఈ ప్యూరీ చేయడానికి బ్రకోలిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అందులో చిటికెడు ఉప్పు వేసి కుక్కర్ లో ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. తర్వాత వాటిని బ్లెండ్ చేసుకోవాలి. దీన్ని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవచ్చు.


దాల్ వాటర్


కాయధాన్యాల్లో శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి. అందుకే పిల్లల ఎదుగుదల కోసం వీటిని తప్పకుండా పిల్లలు తాగిస్తారు. దాల్ వాటర్ తయారీకి చేయాల్సిందల్లా మూంగ్ లేదా మరేదైనా పోషకాలు అధికంగా ఉండే పప్పు తీసుకోవాలి. దాన్ని బాగా ఉదకబెట్టుకోవాలి. పప్పు నీటిలో పూర్తిగా కరిగిన తర్వాత మెత్తగా మెదిపి స్పూన్ తో ఆ నీటిని శిశువుకి తాగించివచ్చు. అందులోని పప్పు మెత్తగా ఉడికిపోతుంది కాబట్టి దాన్ని తినిపించవచ్చు.  


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also Read: పై పెదవుల మీద వెంట్రుకలు తొలగించుకోండిలా!