కొంతమంది అంతగా పట్టించుకోరు కానీ ప్రతి ఒక్కరికీ మొహం మీద సన్నని వెంట్రుకలు ఉంటాయి. తెల్లగా ఉండే వారిలో అవి స్పష్టంగా కనిపిస్తాయి. వాటిని పోగొట్టుకునేందుకు పార్లర్ చుట్టూ తిరిగేస్తారు. ఐబ్రోస్ చేయించుకున్నట్టే వాటిని కూడా తొలగించుకునేందుకు ట్రై చేస్తారు. కానీ కొన్ని రోజులకి అవి మళ్ళీ పెరగడం మొదలవుతుంది. డబ్బులు పోసి బ్యూటీ పార్లర్ కి వెళ్ళే బదులు ఇంట్లో దొరికే వాటితోనే పై పెదవుల మీద ఉండే వెంట్రుకల పెరుగుదల తగ్గించుకోవచ్చు. అయితే ఈ రెమిడీలు శాశ్వత ఫలితాలు అందించకపోవచ్చు కానీ జుట్టును పల్చన చేయగలవు. పెరుగుదలను తగ్గించడంలో ప్రభావవంతంగా పని చేస్తుంది.


పసుపు, మిల్క్: ఒక టేబుల్ స్పూన్ పసుపు పొడిని తీసుకుని అందులో తగినంత పాలు కలుపుకోవాలి. ఆ మందపాటి పేస్ట్ ని వెంట్రుకలు ఉన్న పై పెదవుల మీద అప్లై చేసుకోవాలి. 15-20 నిమిషాల పాటు ఉంచుకున్న తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. జుట్టు పెరుగుదలను నియంత్రించడంలో పసుపు బాగా పని చేస్తుంది.


పంచదార, నిమ్మరసం: ఇంట్లోనే వాక్స్ తయారు చేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్ల పంచదార, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, ఒక టేబుల్ స్పూన్ నీళ్ళు తీసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. సన్నని మంట మీద అది జిగటగా వచ్చే వరకు వేడి చేసుకోవాలి. తర్వాత వేళ్ళతో ఆ జిగట పదార్థాన్ని పెదాల మీద అప్లై చేసుకోవాలి. ఆ వాక్స్ మీద చిన్న క్లాత్ ఒకటి పెట్టుకుని ప్రెస్ చేసి వెంట్రుకలు ఉన్న వ్యతిరేక దిశలో క్లాత్ లాగేయాలి. ఈ ప్రక్రియ అవాంఛిత రోమాల ఫోలికల్స్ ని బలహీన పరుస్తుంది.


బొప్పాయి, పసుపు: పచ్చి బొప్పాయి తీసుకుని దాన్ని మిక్సీ చేసుకోవాలి. అందులో ఒక చిటికెడు పసుపు కలుపుకుని పేస్ట్ మాదిరిగా కలుపుకోవాలి. ఈ పేస్ట్ ని అప్పర్ లిప్ మీద రాసుకుని 15-20 నిమిషాల పాటు అలాగే ఉంచుకోవాలి. ఆది ఆరిన తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. బొప్పాయిలో పపైన్ అనే ఎంజైమ్ ఉంది. ఇది అవసరం లేని వెంట్రుకల పెరుగుదలని నిరోధించడంలో సహాయపడుతుంది.


స్పియర్ మింట్ టీ: ఇది చూసేందుకు కాస్త పుదీనా మాదిరిగానే ఉంటుంది. పుదీనా జాతికి చెందిన ఆకులు ఇవి. వీటితో చేసిన టీ క్రమం తప్పకుండా తాగినా కూడా అవాంఛిత రోమాల పెరుగుదలని అడ్డుకుంటుంది. ఇందులోని యాంటీ యాండ్రోజెనిక్ లక్షణాలు వెంట్రుకల పెరుగుదలకి తోడ్పడే హార్మోన్ల స్థాయిలను రెగ్యులేట్ చేస్తుంది.


శనగపిండి మాస్క్: రెండు టెబుల్స్ స్పూన్స్ శనగపిండి, ఒక టెబుల్స్ స్పూన్ పాలు, చిటికెడు పసుపు కలుపుకుని పేస్ట్ మాదిరిగా చేసుకోవాలి. దీన్ని పెదవుల మీద రాసుకుని ఆరిపోయే దాకా ఉంచుకోవాలి. వ్యతిరేక దిశలో చేతి వేళ్ళతో మెల్లగా స్క్రబ్ చేసుకోవాలి. ఈ ప్రక్రియ చర్మాన్ని ఎక్స్ ఫోలియేట్ చేస్తుంది. వెంట్రుకల పెరుగుదలని అడ్డుకుంటుంది.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 


Also Read: ఈ చెత్త అలవాట్లు మీ అందాన్ని చెడగొట్టేస్తాయ్