Breakfast Choices for BP Patients : బ్యాలెన్స్ డైట్ అనేది పూర్తి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. సమతుల్యమైన అల్పాహారం తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర కంట్రోల్ అవుతుంది. అలాగే గుండెపై ఒత్తిడిని తగ్గిస్తుంది. పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్ వంటి ముఖ్యమైన పోషకాలతో కూడిన బ్రేక్​ఫాస్ట్ తీసుకుంటే బీపీ కూడా అదుపులో ఉంటుందని చెప్తున్నారు. మరి అధిక రక్తపోటును కంట్రోల్ చేసే టిఫిన్స్ ఏంటో చూసేద్దాం. 

పోహా..

కూరగాయలు అధికంగా ఉండే పోహాలో సోడియం తక్కువగా, ఫైబర్ అధికంగా ఉంటుంది. క్యారెట్లు, బఠానీలు, ఉల్లిపాయలు వేసుకోవడం వల్ల రుచితో పాటు ఆరోగ్యానికి మంచి జరుగుతుంది. చివర్లో కాస్త నిమ్మకాయ, కొత్తిమీర వేసుకుంటే.. ఉప్పు తక్కువగా ఉన్న తినేందుకు అద్భుతంగా ఉంటుంది. 

ఉప్మా

బీన్స్, టమోటాలు, బెల్ పెప్పర్స్ వంటి కూరగాయలతో తక్కువ మొత్తంలో నూనెతో రవ్వ ఉప్మా చేసుకోవచ్చు. ఇది గుండెకు ఆరోగ్యానికి మంచి ఎంపిక. ఉప్పు తక్కువగా వేస్తాము కాబట్టి.. రక్తపోటు అదుపులో ఉంటుంది.

దోశ..

దోశ అంటే రెగ్యులర్​గా తినేది కాదు. ఓట్స్​తో చేసిన దోశలో కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి, రక్తపోటును కంట్రోల్ చేయడానికి సహాయపడుతుంది. కూరగాయలు, తేలికపాటి మసాలా దినుసులతో కలిపి.. తేలికైన, పోషకమైన బ్రేక్​ఫాస్ట్ చేసుకోవచ్చు. 

పెసరట్టు..

పెసరట్టులో ప్రోటీన్, పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో సోడియంను తగ్గించడంలో సహాయపడుతుంది. దీనిని ఉప్పు లేని పుదీనా చట్నీతో లేదా సాదా పెరుగుతో ఆస్వాదించవచ్చు.

శనగపిండి దోశ

శనగపిండిలో ఉండే మెగ్నీషియం, పొటాషియం గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి. తోటకూర లేదా పాలకూరను కలిపి తక్కువ నూనె ఉపయోగించి దోశలుగా వేసుకోవచ్చు. అధిక రక్తపోటు ఉన్నవారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.

స్ప్రౌట్స్

స్ప్రౌట్స్​లో ప్రోటీన్, ఫైబర్, అవసరమైన ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఉప్పు లేకుండా కీరదోసకాయ, టమోటా, నిమ్మకాయ, బ్లాక్​పెప్పర్​తో కలిపి తీసుకోవచ్చు. ఇది బీపీని తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. 

ఓట్ మీల్ 

ఓట్ మీల్ కూడా సంక్లిష్టమైన కార్బోహైడ్రేట్లు, ఫైబర్‌ను అందిస్తుంది. ఇవి రక్తపోటును నియంత్రించడంలో, ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని కలిగి ఉండటానికి సహాయపడతాయి. దీనిని ఫ్రూట్స్​తో లేదా పాలతో తీసుకోవచ్చు.

రాగులు

రాగులు సహజంగా కాల్షియం, పొటాషియం, మెగ్నీషియంతో సమృద్ధిగా ఉంటాయి. మజ్జిగతో తయారుచేసిన రాగి గంజి లేదా తక్కువ ఉప్పు చట్నీతో రాగి ఇడ్లీ రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.

పెరుగు

లో ఫ్యాట్ పెరుగులో ప్రోబయోటిక్స్, కాల్షియం ఉంటాయి. ఇవి గుండెకు మంచివిగా భావిస్తారు. దీనిని అరటిపండు లేదా బొప్పాయి, అవిసె గింజలు లేదా చియా సీడ్స్తో కలిపి తీసుకోవచ్చు. హెల్తీ బ్రేక్​ఫాస్ట్ అవుతుంది. 

ఇడ్లీ

పులియబెట్టిన బియ్యం, మినపప్పుతో తయారు చేసిన ఇడ్లీ తీసుకోవచ్చు. ఇది సులభంగా జీర్ణమవుతుంది. కూరగాయలు అధికంగా ఉండే, తక్కువ ఉప్పు, తక్కువ నూనె కలిగిన సాంబార్‌తో కలిపి తీసుకోవచ్చు. అధిక రక్తపోటు ఉన్నవారికి ఇది బెస్ట్ ఫుడ్ అవుతుంది. 

గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.