Moringa Nutrition Facts: మునగ చెట్టులోని ప్రతి భాగంగా మనిషి ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది. వేళ్ల నుంచి మొదలుకొని ఆకుల వరకు అన్నింటిలోనూ పోషక విలువలు, ఔషధ గుణాలు ఉంటాయి. అందుకే మునగ చెట్టును ‘మిరాకిల్ ట్రీ‘గా అభివర్ణిస్తారు. మునగలో ఎలాంటి పోషకాలున్నాయి? వాటి ద్వారా ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో చూద్దాం.
కండ్లకలకలు, రక్తహీనత, జీర్ణ సమస్యలతో పాటు పలు వ్యాధులకు సాంప్రదాయ చికిత్సలలో మునగ ఆకులను ఉపయోగిస్తారు. మునగాకులతో బాలింతల్లో పాలు పెరగడంతో పాటు డయాబెటిస్, బీపీని అద్భుతంగా అదుపు చేస్తాయి. మునగ ఆకుల రసం తాగినా, మునగ ఆకులను వేయించి కారం పొడిగా తీసుకున్న ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. తాజాగా శాంట్ లాంగోవాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ ఇంజినీరింగ్ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. మునగతో శరీరానికి అవసరమైన పోషకాహారం లభించడంతో పాటు చక్కటి ఆరోగ్యాన్ని అందిస్తుందని తేలింది.
పోషకాల నిధి మునగ
మునగలో బోలెడు పోషకాలు ఉన్నాయి. ఇంతకీ ఆ పోషకాలు ఏవి? వాటితో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటే..
ప్రోటీన్: ఎంజైమ్‌లు, హార్మోన్ల ఉత్పత్తికి ప్రోటీన్ చాలా అవసరం. ఆరోగ్యకరమైన చర్మం, రక్తం ప్రసరణ, రోగనిరోధక వ్యవస్థలను సమర్థవంతంగా నిర్వహించడానికి ప్రోటీన్ సహాయపడుతుంది. మునగ ఆకులలో 10.74 శాతం నుంచి 30.29 శాతం ప్రోటీన్ ఉంటుంది. కండరాల పెరుగుదల, కణజాల మరమ్మతులు, ఇతర శారీరక విధులను పకడ్బందీగా నిర్వహించేందుకు మునగ ఆకులు సాయపడుతాయి.
అమైనో ఆమ్లాలు: మునగ ఆకులలో శరీరానికి అవసరమైన అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని శరీరం స్వయంగా ఉత్పత్తి చేసుకోదు. ఈ అమైనో ఆమ్లాలు ప్రోటీన్ సంశ్లేషణ, కండరాల అభివృద్ధి, న్యూరో ట్రాన్స్ మీటర్ పనితీరుకు సాయపడుతాయి. శరీరం ఆరోగ్యంగా ఉండేందుకు అమైనో ఆమ్లాలు కీలపాత్ర పోషిస్తాయి.
ప్రో విటమిన్ A: మునగ ఆకులలో ప్రొవిటమిన్ A లేదంటే బీటా-కెరోటిన్ అధికంగా ఉంటుంది. దీనిని శరీరం విటమిన్ A గా మారుస్తుంది. ఈ విటమిన్ చర్మాన్ని మరింత ఆరోగ్యంగా మార్చడంలో, చక్కటి నిగారింపు కలగడంలో ఉపయోగపడుతుంది. అటు రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలోనూ ముగన ఆకులలోని బీటా కెరోటిన్ ఎంతగానో సాయపడుతాయి.
ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు: మునగ ఆకులలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతగానో ఉపయోగపడుతాయి. ఒమేగా -3 ఫ్యాటీ ఆమ్లాలు వాపులను తగ్గించడంలో సహాయపడతాయి. రక్తపోటును అదుపు చేయడంతో పాటు గుండె పనితీరును మెరుగు పరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
ఒమేగా-6 కొవ్వు ఆమ్లాలు: మునగ ఆకులలో ఒమేగా-6 కొవ్వు ఆమ్లాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సాయపడుతాయి. మెదడు పనితీరును మెరుగు పరచడంతో పాటు గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి. హార్మోన్ల ఉత్పత్తిని క్రమబద్దీకరించడంలో ఒమేగా -6 ఆమ్లాలు ఉపయోగపడుతాయి.
Read Also: మునగాకు మధుమేహాన్ని అదుపులో ఉంచుతుందా? ఎంత మోతాదులో తీసుకుంటే మేలు?
Read Also: ఉదయమే మునగాకు నీళ్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా? అస్సలు నమ్మలేరు