Health Tips: ఉదయం లేవగానే కొందరికి కాఫీ కావాలి, కొందరికి టీ. కొందరు ఆరోగ్య ప్రియులు గ్రీన్ టీ తాగుతారేమో. కానీ వీటన్నింటిలోనూ కెఫిన్ ఉంటుంది. ఇది ఉదయాన్ని ఉత్సాహంగా మొదలు పెట్టేలా చేస్తుంది కానీ దుష్ప్రభావాలను కూడా కలిగిస్తుంది. మరి అలాంటి దుష్ప్రభావాలేవీ లేని ఒక హెర్బల్ టీ గురించి తెలసుకుందాం.
మునగాకులో ఎన్నో పోషకాలు ఉన్నాయి. ముఖ్యంగా మునగాకు ఐరన్ పుష్కలంగా కలిగి ఉంటుంది. మునగాకులను తప్పకుండా ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే మునగాకుతో చేసిన టీ తో ప్రయోజనాలున్నాయని ఆయుర్వేదం కూడా చెబుతోంది. మునగాకు రకరకాల పద్ధతులలో వినియోగిస్తారు. అయితే ఈ తాజా ఆకులతో కాచిన టీతో ప్రత్యేక లాభాలున్నాయట. ప్రతిరోజు ఉదయాన్నే తీసుకునే డ్రింక్ గా దీన్ని తీసుకుంటే మరింత మేలు చేస్తుందట.
మునగాకు టీ గ్రీన్ డిటాక్స్ డ్రింక్ అని చెప్పవచ్చు. అంతేకాదు మిరాకిల్ టీగానూ భావించవచ్చు. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు, ఔషధగుణాలు కలిగిన ఈ ఆకులకు ఆయుర్వేదంలో ప్రత్యేక స్థానం ఉంది. దీన్ని రోజూ ఉదయం పరగడుపున తీసుకోవడం మంచిదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి
ఒకగ్లాసు మునగాకు రసంతో రోజును ప్రారంభిస్తే ఇది జీర్ణవ్యవస్థకు సహజమైన క్లెన్సర్ గా పనిచేస్తుంది. పేగుల్లో కదలికలు క్రమబద్దీకరించబడుతాయి. ఫలితంగా కడుపు ఉబ్బరంగా ఉండడం, మలబద్దకం వంటి సాధారణ జీర్ణసంబంధ సమస్యలు తగ్గిపోతాయి. జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. అందువల్ల పోషకాల శోషణ జరిగే విధానం కూడా మెరుగవుతుంది.
బరువు తగ్గిస్తుంది
బరువు తగ్గాలనుకునే వారు డైట్ లో ఈ మునగాకు రసాన్ని చేర్చుకుంటే మంచి ఫలితాలుంటాయి. పరగడుపున ఈ గ్రీన్ డిటాక్స్ డ్రింక్ తీసుకుంటే క్రేవింగ్స్ తగుతాయి. అందువల్ల ఎక్కువ కలిగిన ఆహారం తీసుకోకుండా ఉండవచ్చు. జీవక్రియల వేగం పెరుగుతుంది. ఫలితంగా బరువు వేగంగా తగ్గేందుకు అవకాశాలు ఏర్పడుతాయి.
చర్మ ఆరోగ్యానికి
చర్మ సమస్యల పరిష్కారించుకోవడంలో ప్రతిసారీ విఫలమవుతున్నారా? చింతించే పనిలేదట. రోజూ ఖాళీ కడుపుతో మునగాకు టీ ఒక కప్పు తీసుకుంటే చాలు చర్మంలో కొల్లాజెన్ పెరగిపోయి సాగే గుణం మెరుగుపడుతుంది. ఈ మునగాకు రసంలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఫలితంగా చర్మం సహజంగా ఆరోగ్యకరమైన మెరుపు సంతరించుకుంటుంది.
మార్నింగ్ బూస్టర్
ఉదయం లేవగానే అలసటగా అనిపిస్తోందా? మునగాకు టీ ఉదయాన్నే తీసుకుంటే ఇక ఆ బాధ ఉండదు. మునగాకులో ఉండే అమైనో ఆమ్లాలు, ఇతర పోషకాల వల్ల సహజంగా శరీరం శక్తి సంతరించుకునేందుకు దోహదం చేస్తుంది. కెఫిన్ ప్రసక్తి లేని ఈ ఉదయపు డ్రింక్ తో ఉదయం ఉత్సాహంగా మొదలవుతుందని నిపుణులు చెబుతున్నారు.
మధుమేహం అదుపు చేస్తుంది
మునగాకుల టీ కాచుకుని ఉదయాన్నే తీసుకుంటే మధుమేహం కూడా అదుపులో ఉంటుంది. మదుమేహం వల్ల కలిగే ఇతర దుష్ప్రభావాలను కూడా నివారిస్తుంది. ఇన్సులిన్ సెన్సిటివిటిని కూడా పెంచుతుంది. ఫలితంగా ఇన్సులిన్ క్రీయాశీలత మెరుగ్గా ఉంటుంది. మధుమేహులు మునగాకులను తప్పకుండా ఆహారంలో భాగం చేసుకోవాలి.
ఐరన్ లోపానికి
మునగాకుల్లో ఉండే ఐరన్ వల్ల రక్తహీనత ఏర్పడకుండా నివారిస్తుంది. అంతేకాదు రక్తహీనతతో బాధపడే వారికి మునగాకు టీ చాలా ఉపయోగకరం. దీనితో త్వరగా లోపం తగ్గి తిరిగి ఆరోగ్యంగా, చురుకుగా తయారవుతారు.