Heal Your Heels : చలికాలంలో మనల్ని బాధించే సమస్యల్లో కాళ్లు పగుళ్లు (Cracked Heals) ఒకటి. ఇది ఓ సాధారణ సమస్యే అయినా.. శీతాకాలంలో దీని ప్రభావం కాస్త ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే చలికాలంలో చర్మం పొడిబారుతూ ఉంటుంది. చేతులు, పెదాలు కూడా పొడిబారిపోతాయి. ముఖ్యంగా పాదాల వద్ద చర్మం మందంగా ఉండి.. మొద్దుబారిపోయి.. పగిలిపోతూ ఉంటుంది. దీనికి ప్రధానమైన కారణం చలి అయితే.. నీరు తక్కువగా తీసుకోవడం మరో కారణం. చలిగా ఉంది కదా అని.. ఊరికే వాష్​రూమ్​కి వెళ్లాల్సి వస్తుంది కదా అని చాలామంది నీటిని తక్కువగా తీసుకుంటారు. ఇది మీ చర్మాన్ని పొడిబారేలా చేస్తుంది.  


కాళ్లు పగలడానికి అవి కూడా కారణమే..


కేవలం చలి వల్లనే కాదు. ఎక్కువసేపు నిలబడి ఉండడం వల్ల, మీ పాదలపై ఒత్తిడి పెరగడం వల్ల, హైహీల్స్ ఉపయోగించడం వల్ల కూడా పాదాలు పగులుతాయి. మధుమేహం, ఊబకాయం, విటమిన్స్ లోపం, పాదాల్లో నరాలు దెబ్బతినడం వంటి ఆరోగ్య సమస్యలు వల్ల కూడా పాదాల్లో పగుళ్లు ఏర్పడతాయి. అయితే ఇదేదో అంటు వ్యాధో లేక మీకు మాత్రమే ఉంది అనుకోకండి. దాదాపు చాలామంది ఈ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. కాళ్లు పగిలేందుకు చాలా కారణాలే ఉండొచ్చు. కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే.. కచ్చితంగా ఈ సమస్యకు మీరు చెక్​ పెట్టవచ్చు. అయితే అసలు మీకు దేనివల్ల కాళ్లు పగులుతున్నాయో తెలుసుకోవడం ముఖ్యం. అప్పుడే మీకు ఏ చికిత్స్ సెట్​ అవుతుందో తెలుస్తుంది.


పరిస్థితి తీవ్రంగా ఉంటే..


కాళ్లు పగలడం అనేది ప్రమాదకరమైన సమస్య కాదు. కానీ పగుళ్లు మరీ లోతుగా ఉంటే మాత్రం వైద్యుని సంప్రదించండి. ఎందుకంటే పగుళ్లు డీప్​గా ఉంటే.. నడుస్తున్నప్పుడు రక్తస్రావమైన నొప్పి కలుగుతుంది. పరిస్థితి తీవ్రం కాకముందే మీరు డెర్మాటాలజిస్ట్​ని కలిస్తే వారు మీకు సరైన చికిత్స చేస్తారు. ఇది త్వరగా మీ పాదాలను హీల్​ చేయడంలో సహాయం చేస్తుంది. పగుళ్లు తక్కువగా ఉంటే.. మీరు డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే కొన్ని చిట్కాలు పాటించి వాటిని దూరం చేసుకోవచ్చు. 


తక్కువగా ఉంటే..


హీల్స్ వల్ల లేదా బూట్లు వల్ల మీకు ఈ సమస్య వస్తే కొన్నిరోజులు వాటికి దూరంగా ఉండండి. లేదంటే పాదలు మరింత దెబ్బతినే అవకాశముంది. మెత్తగా, స్మూత్​గా ఉండే చెప్పులను ఉపయోగించండి. ఇవి మీ మడమలపై ఒత్తిడి పడకుండా చేసి.. సమస్యను దూరం చేసుకోవడంలో హెల్ప్ చేస్తాయి. చర్మం పొడిబారడం వల్ల పగుళ్లు ఏర్పడితే.. మీరు శరీరానికి నీటిని ఎక్కువగా అందించండి. మీరు హైడ్రేటెడ్​గా ఉంటే ఈ సమస్య తగ్గుతుంది. 


ఆ క్రీమ్స్ ఉపయోగించవచ్చు..


పొడిబారిన చర్మానికి మంచి మాయిశ్చరైజర్​ లేదా లోషన్స్ ఉపయోగించండి. ఇవి సమస్య రాకముందు నుంచి ఉపయోగిస్తే చాలా మంచిది. ఒకవేళ కాళ్లు పగిలిన తర్వాత అయినా.. పగుళ్లను నయం చేసే క్రీమ్​లు మార్కెట్లలో దొరుకుతాయి. ప్రతి రోజు పడుకునే సమయంలో దానిని మీ పాదాలకు అప్లై చేయండి. ఇవి కూడా మీకు మంచి ఫలితాలు ఇస్తాయి. 


Also Read : తలస్నానం చేసేప్పుడు ఆ తప్పులు చేస్తే మీ జుట్టు హాంఫట్!