స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత, ల్యాప్‌టాప్‌ల వినియోగం పెరిగిన తర్వాత ప్రజలకు దాదాపు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఇంటర్నెట్ ప్రపంచంలో విహరిస్తూ.. అదే తమ లోకమని భావిస్తున్నారు. ఇక సినిమా, వెబ్ సీరిస్, సంగీత ప్రియులైతే రోజంతా హెడ్‌ఫోన్స్ లేదా ఇయర్ ఫోన్స్ పెట్టుకునే ఉంటారు. ఆఫీస్, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారు కూడా హెడ్‌ఫోన్స్ పెట్టుకుని ప్రశాంతంగా పాటలు వింటూ ప్రశాంతంగా టార్గెట్లు పూర్తి చేసే ప్రయత్నం చేస్తుంటారు. అయితే, హెడ్‌ఫోన్స్ అతిగా వాడటం ఏ మాత్రం మంచిది కాదని స్టడీస్ చెబుతున్నాయి. 


హెడ్‌ఫోన్స్ లేదా ఇయర్ ఫోన్స్ వినియోగం పెరిగిన తర్వాత చెవులకు విశ్రాంతి లేకుండా పోతోంది. ఓ డేటా ప్రకారం.. ప్రజలు రోజూ సగటున మూడున్నర గంటలు హెడ్‌ఫోన్స్ ఉపయోగిస్తున్నారు. 2 వేల మంది హెడ్‌ఫోన్స్ వినియోగదారులపై నిర్వహించిన స్టడీలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. వారిలో 43 శాతం మంది చెవుల నొప్పితో బాధపడుతున్నట్లు చెప్పారు. 23 శాతం మంది వారానికి ఒకసారి చెవి సమస్యలు వస్తున్నట్లు చెప్పారు. 36 శాతం మంది గత రెండేళ్లలో హెడ్‌ఫోన్స్ వాడకం వల్ల చెవిలో గులిమి ఏర్పడటాన్ని గమనించామని తెలిపారు. వీరంతా చెవిలో ఏర్పడిన గులిమిని తొలగించేందుకు ఇయర్‌బడ్స్‌ను అతిగా ఉపయోగించినట్లు స్టడీలో తెలిసింది.  


హెడ్‌ఫోన్స్ వల్ల చెవులకు కలిగే నష్టం ఏమిటీ?:


☀ ఇయర్‌ఫోన్‌లు లేదా హెడ్‌ఫోన్‌లు నేరుగా చెవి రంధ్రాన్ని మూసివేస్తాయి. ఫలితంగా చెవులకు గాలి తగలదు.
☀ చెవులకు గాలి తగలనట్లయితే వివిధ రకాల చెవి ఇన్ఫెక్షన్లు ఏర్పడే ప్రమాదం ఉంది. 
☀ ఇయర్‌ఫోన్‌లు ఉపయోగించడం వల్ల చెవిలో బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. 
☀ ఒకరు వాడిన హెడ్‌ఫోన్ లేదా ఇయర్‌ఫోన్ మరొకరు వాడకూడదు. అలా చేస్తే ఇన్ఫెక్షన్‌కు గురవ్వుతారు. 
☀ ఇయర్‌ఫోన్‌లను ఎక్కువసేపు వాడటం వల్ల ‘వెర్టిగో’ అనే అనారోగ్య సమస్య ఏర్పడుతుంది. 
☀ వెర్టిగో(Vertigo) అంటే మైకం లేదా తలతిరగడం. పెద్ద శబ్దాల కారణంగా చెవి రంధ్రాల్లో ఒత్తిడి పెరిగి మైకం ఏర్పడుతుంది.
☀ టిన్నిటస్‌తో బాధపడేవారు సాధారణ ధ్వనులకు కూడా అతిగా భావిస్తారు. ఈ పరిస్థితిని ‘హైపర్‌కసిస్’ అంటారు.
☀ భవిష్యత్తులో వినికిడి సమస్యలను నివారించడానికి హెడ్‌ఫోన్‌లను మితంగా ఉపయోగించడం మంచిది. 
☀ చెవిలో గులిమి పేరుకుపోవడం వల్ల వినికిడి లోపం, ఇన్‌ఫెక్షన్లు లేదా అసౌకర్యం ఏర్పడవచ్చు.
☀ ఎక్కువ సౌండ్ పెట్టుకుని వినడం వల్ల చెవుల్లోని సున్నిత పొర చిట్లే ప్రమాదం ఉంది.
☀ ఏ వస్తువు పడితే అది చెవిలో దూర్చి గులిమిని తీసే ప్రయత్నం చేయకూడదు. 
☀ హెడ్‌ఫోన్స్ వాడేవారిలో ఏకాగ్రత చాలా తక్కువగా ఉంటుందని, వారు సూచనలు స్వీకరించలేరని నిపుణులు తెలిపారు. 
☀ మొదటిసారి చెవి నొప్పి కలిగినప్పుడే హెడ్‌ఫోన్స్‌ వాడకాన్ని తగ్గించడం ద్వారా వినికిడి సమస్య నుంచి బయటపడవచ్చు. 
☀ ఇయర్‌ఫోన్ వాడకం రోజుకు గంటకు మించకూడదు.


Also Read: ప్రాణం పోసిన ప్రేమ, ప్రమాదంలో శరీరం సగానికి ముక్కలైనా జీవిస్తున్న యువకుడు


గమనిక: ఈ కథనాన్ని మీ అవగాహన కోసం అందించాం. ఇది వైద్య సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించిన ఏ విషయమైనా సరే డాక్టర్‌ను సంప్రదించడమే ఉత్తమ మార్గం. ఈ కథనంలో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదు. 


Also Read: గుడ్ న్యూస్, బట్టతలకు ఇక బై బై, ఈ మందుతో జుట్టు తిరిగి వచ్చేస్తుంది!