జుట్టు రాలడాన్ని తగ్గించుకోవడానికి ఏవేవ్ ప్రయత్నాలు చేసి విసిగిపోయారా? సింపుల్ గా ఎక్కువ ఖర్చుతో కాకుండా ఉండే ఈ హెయిర్ మాస్క్ ట్రై చేసి చూడండి. మంచి రిజల్ట్ పొందుతారని నిపుణులు సూచిస్తున్నారు. ఇవి జుట్టుని బలోపేతం చేసి వెంట్రుకలు రాలడాన్ని నివారిస్తాయి. ఎవరి సహాయం లేకుండానే మీరే సొంతంగా వీటిని తయారు చేసుకుని మాస్క్ వేసుకోవచ్చు. కానీ అలర్జీలు ఏవైనా ఉన్నాయా లేదా అనేది మాత్రం తప్పని సరిగా టెస్ట్ చేసుకోవాలి. కొత్త పదార్థాలు ఉపయోగించే ముందు చర్మం మీద చిన్న ప్రాంతంలో ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మరచిపోవద్దు.


హెయిర్ మాస్క్ కి కావాల్సిన పదార్థాలు


అరటి పండు


తేనె


ఆలివ్ ఆయిల్


గుడ్లు


తయారీ విధానం


పండిన అరటి పండు తీసుకుని దాన్ని మెత్తగా పేస్ట్ మాదిరిగా చేసుకోవాలి. అందులో 1-2 టేబుల్ స్పూన్ల తేనె వేసి బాగా కలపాలి. తేనె జుట్టుకి తేమని, మెరుపుని అందిస్తుంది. అందులో ఒకటి లేదా రెండు స్పూన్ల ఆలివ్ ఆయిల్ జోడించుకోవాలి. ఈ ఆయిల్ జుట్టుకి కండిషన్ ఇస్తుంది. ఈ మిశ్రమంలో గుడ్లు వేసి బాగా కలుపుకోవాలి. గుడ్డు జుట్టుకి కావాల్సిన ప్రోటీన్, పోషకాలని అందిస్తుంది.


మాస్క్ వేసుకునే విధానం


ఈ హెయిర్ మాస్క్ వేసుకునే ముందు జుట్టు పొడిగా ఉంచుకోవాలి. జుట్టు చిక్కు లేకుండా బాగా తీసుకోవాలి. మాస్క్ ని రూట్ నుంచి చివర వరకు చక్కగా అప్లై చేసుకోవాలి. జుట్టుకి బాగా పట్టేందుకు పెద్దగా ఉన్న దువ్వెన తీసుకుని దువ్వుకుంటూ మాస్క్ అప్లై చేసుకోవాలి. అప్పుడే వెంట్రుకలు మొత్తానికి మిశ్రమం పడుతుంది. మాస్క్ అప్లై చేసిన తర్వాత జుట్టుకి క్యాప్ వేసి కవర్ చేసుకోవాలి. 30 నిమిషాల నుంచి గంట పాటు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత జుట్టుని గోరువెచ్చని నీటితో బాగా కడగాలి. జుట్టుకి షాంపూ చేసి ఎప్పటిలాగా కండిషనర్ పెట్టుకోవచ్చు. జుట్టుకి మరింత మెరుపు అందించాలని అనుకుంటే చివరిగా చల్లని నీటితో మరొకసారి శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ఈ మాస్క్ ద్వారా ఉత్తమ ఫలితాలు పొందాలని అనుకుంటే వారానికి ఒకసారి అయినా ట్రై చేసి చూడండి.


ప్రయోజనాలు


అరటిపండు: ఇందులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టుని ధృడంగా ఉంచేందుకు సహాయపడుతుంది. జుట్టు చిట్లడాన్ని తగ్గిస్తుంది.


తేనె: తేనె సహజమైన హ్యూమేక్టెంట్. ఇది జుట్టులో తేమని నిలపడంలో మెరుగ్గా పని చేస్తుంది. జుట్టు పొడిబారిపోకుండా పెళుసుగా మారకుండా చూస్తుంది.


ఆలివ్ ఆయిల్: ఇందులో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి జుట్టు, తలకి సరైన పోషణ అందిస్తాయి. ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలని ప్రోత్సహిస్తాయి.


గుడ్లు: గుడ్డు ప్రోటీన్, బయోటిన్ మూల జుట్టుకి బలం ఇస్తాయి. వెంట్రుకల కుదుళ్ళని బలోపేతం చేస్తాయి.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 


Also Read: నోరు శుభ్రంగా ఉంచుకోవడం లేదా? జాగ్రత్త మతిమరుపు రావడం ఖాయం