Hair Care Tips by Experts : మగవారికైనా, ఆడవారికైనా జుట్టు అందమైన ఆభరణంగా చెప్పవచ్చు. అందుకే హెల్తీ స్కిన్​తో పాటు జుట్టు హెల్తీగా ఉండాలని చూస్తూ ఉంటారు. అయితే వివిధ కారణాలతో జుట్టు రాలిపోతూ ఉంటుంది. జుట్టు ఎక్కువగా రాలే కొద్ది.. ఆత్మవిశ్వాసం కూడా దెబ్బతింటుంది. తెలియకుండానే స్ట్రెస్ పెరిగిపోతుంది. దానిని ఎలా కాపాడుకోవాలా అన్ని ఇంటి చిట్కాల నుంచి ట్రీట్​మెంట్స్ వరకు అన్ని ఆలోచిస్తూ ఉంటారు. అయితే ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. అలాగే జుట్టు రాలడం తగ్గడానికి కూడా పరిహారం ఉంటుందని చెప్తున్నారు కాస్మోటిక్ సర్జన్ డాక్టర్ వైరల్ దేశాయ్. జుట్టును రక్షించడానికి, ఆరోగ్యకరమైన పెరుగుదలను ప్రోత్సహించడానికి సహాయపడే ప్రభావవంతమైన టిప్స్ ఇస్తున్నారు.

జుట్టు సడెన్​గా రాలడానికి కారణాలివే

జుట్టు రాలడానికి పరిష్కారాలు తెలుసుకునే ముందు అసలు అది ఎందుకు రాలుతుందో గుర్తించాలని చెప్తున్నారు. సమస్య ఎందుకు వచ్చిందో తెలిస్తే త్వరగా పరిష్కరించుకోవచ్చని చెప్తున్నారు. శరీరంలోపలి నుంచి జుట్టును నెగిటివ్​గా ఎఫెక్ట్ చేసే కారణాలు ఏంటో చూసేద్దాం. 

  • ఒత్తిడి : శారీరక, మానసిక లేదా ఏదైనా దీర్ఘకాలిక ఒత్తిడి జుట్టు రాలడానికి ప్రధాన కారణం అవుతుంది. 
  • హార్మోన్ల అసమతుల్యత : హార్మోన్ల స్థాయిలలో మార్పులు జుట్టు రాలడానికి దారితీస్తుంది.
  • ఆహారం: ముఖ్యమైన పోషకాలు శరీరానికి అందించకపోవడం వల్ల జుట్టు ఆరోగ్యానికి హాని కలుగుతుంది. 

హెయిర్​ఫాల్ తగ్గించుకునేందుకు డాక్టర్ ఇస్తోన్న సూచనలు

మీకు జుట్టు ఎందుకు రాలుతుందో తెలిస్తే.. దానిని కంట్రోల్ చేయడం చాలా సులభం అవుతుందని చెప్తున్నారు డాక్టర్ వైరల్ దేశాయ్. పైన పేర్కొన్న కారణాల వల్ల జుట్టు రాలుతుంటే.. మీరు కచ్చితంగా ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది.

  • ఒత్తిడి : మీకు ఒత్తిడి ఎక్కువగా ఉంటే.. వ్యాయామం, ధ్యానం, యోగా వంటివాటిని ట్రై చేయాలి. ఒత్తిడిని తగ్గించే ఈవెంట్స్​లో పాల్గొనాలి.
  • సమతుల్య ఆహారం : మొత్తం ఆరోగ్యానికే కాదు.. జుట్టు ఆరోగ్యానికి కూడా ఫుడ్ చాలా ముఖ్యం. కాబట్టి పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవాలి. ఐరన్, జింక్, బయోటిన్ వంటి విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.
  • జుట్టు సంరక్షణకై : కఠినమైన కెమికల్స్​తో కూడిన ట్రీట్​మెంట్స్ తీసుకోకూడదు. అధిక వేడితో స్టైలింగ్ చేయకూడదు.
  • నిద్ర : హార్మోన్లను నియంత్రించడానికి, హెల్తీ ఫుడ్ తీసుకోవడంతో పాటు 7-8 గంటలు నిద్రపోవడానికి ప్రయత్నించండి. దీనివల్ల జుట్టు రాలడం తగ్గడమే కాకుండా పెరుగుదల బాగుంటుంది.

అదనపు చిట్కాలు

  • వైద్య సహాయం : అకస్మాత్తుగా లేదా విపరీతంగా జుట్టు రాలడంతో ఇబ్బంది పడుతుంటే.. ఏ టిప్స్ ఫాలో అయినా హెయిర్ ఫాలో కంట్రోల్ అవ్వకపోతే.. కచ్చితంగా వైద్య సహాయం తీసుకోవాలి. 
  • హెయిర్ గ్రోత్ ప్రొడెక్ట్స్ : వైద్యుడిని సంప్రదించిన తర్వాత వారి సూచనలతో మినోక్సిడిల్, రెడెన్సిల్ లేదా బయోటిన్ వంటి వాటిని హెయిర్​కి ఉపయోగించాలి. 

అయితే ఏ చిట్కాలు అయినా వెంటనే రిజల్ట్స్ ఇవ్వవు కాబట్టి.. ఓపికగా ఎదురు చూడాలి. అలాగే మధ్యలో ఆపేయడం కాకుండా కంటిన్యూగా ఫాలో అవుతూ ఉంటే మంచి ఫలితాలు చూడవచ్చు. కాబట్టి మీ జుట్టు సంరక్షణ కోసం కాస్త ఓపికగా ఉంటే మంచిదని సూచిస్తున్నారు వైద్యులు. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.