వారం అంతా కష్టపడి పని చేసే వారికి ఆదివారం ఎంతో ప్రశాంతతను ఇస్తుంది. వారం రోజులు పడిన కష్టాన్ని సండే రోజు ఉల్లాసంగా గడపడంతో మర్చిపోతాం. మరుసటి రోజు సోమవారం. అబ్బా, మళ్లీ ఆఫీసుకు వెళ్లాలా? అని ఒకింత అసహనానికి గురవుతాం. ఉద్యోగస్తులే కాదు, విద్యార్థులు కూడా మండే స్కూలుకు వెళ్లాలంటే చాలా ఇబ్బందిగా ఫీలవుతారు. శనివారం నాడు ఆదివారం వస్తుందని ఎంత సంతోష పడతారో, ఆదివారం నాడు మళ్లీ సోమవారం వస్తుందని అంతకంటే ఎక్కువ బాధపడతారు. ఇదే అంశానికి సంబంధించి గడిచిన కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది.  ‘Worst Day of The Week’ అంటూ సోమవారం మీద  సోషల్‌ మీడియాలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. 


అత్యంత చెత్త రోజుగా ‘సోమవారం’ గిన్నిస్ రికార్డు


తాజాగా ఇదే అంశంపై  గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్ ప్రతినిధులు ఓ సర్వే నిర్వహించారు. ఇందులో ఆయా వారాల్లో జనాలు ఎలా ఫీలవుతున్నారనే విషయాన్ని తెలుసుకున్నారు. ఒక్కో రోజు ఒకలా ఫీలవుతున్నట్లు గుర్తించారు. చాలా మంది నుంచి వచ్చిన సమాధానం ఒక్కటే. వారంలో అత్యంత చెత్త రోజు సోమవారం. మెజారిటీ జనాల నుంచి ఇదే అభిప్రాయం వచ్చింది. ఈ నేపథ్యంలో సోమవారాన్ని వారంలో అత్యంత చెత్త రోజుగా గుర్తించారు. ఈ మేరకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్ట్స్ అత్యంత చెత్తవారంగా సోమవారానికి చోటు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. “వారంలో అత్యంత చెత్త రోజు రికార్డును సోమవారానికి అధికారికంగా అందిస్తున్నాము” అని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ తన ట్విట్టర్ అకౌంట్ లో వెల్లడించింది.






నెటిజన్ల నుంచి భిన్న స్పందనలు


గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సోమవారాన్ని చెత్త రోజుగా ప్రకటించడం పట్ల నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.  ఈ ట్వీట్‌కి ఇప్పటి వరకు 4.28 లక్షలకు పైగా లైక్‌లు, 79,000 రీ ట్వీట్లు వచ్చాయి. “అందుకే నేను సోమవారం ఆఫ్ తీసుకుంటున్నాను” అని ఓ నెటిజన్ వెల్లడించాడు. “ఈ విషయాన్ని తెలుసుకోవడానికి మీకు ఇంత సమయం పట్టిందా?” అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.  "మీ సోమవారాలు సరిగ్గా ఉంటే, మిగిలిన వారంలో మీరు సరిగ్గా ఉంటారు" అని మరొక నెటిజన్ పోస్ట్ చేశాడు. "ఆదివారం సాయంత్రం అనుభూతి.. సోమవారం ఉదయం కంటే చాలా చెత్తగా ఉంటుంది" అని మరొక నెటిజన్ కామెంట్ చేశాడు. మొత్తంగా ఈ రికార్డు పట్ల నెటిజన్లలో మెజార్టీ పాజిటివ్ గానే ఉన్నారు.


Read Also: అబ్బా, ఎంత మంచి ఓనరో! దీపావళి వేళ ఉద్యోగులకు బహుమతిగా కార్లు, బైకులు!