నెలల మూడు రోజుల పాటూ మహిళలు తీవ్రంగా ఇబ్బంది పడే సమస్య రుతుక్రమం. కొందరికి ఆ సమయంలో తక్కువ ఇబ్బందే అనిపించినప్పటికీ కొందరిలో మాత్రం తీవ్రమైన పొట్టనొప్పి, తలనొప్పి, మూడ్ స్వింగ్స్, కోపం, అలసట ఇలా మానసిక, శారీరక సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఉద్యోగినులు అవన్నీ తట్టుకునే విధులకు హాజరవుతున్నారు. అయితే కొన్నేళ్ల నుంచి పీరియడ్స్ లీవ్ విషయంలో పలు దేశాల్లో చర్చలు జరుగుతున్నాయి. కొన్ని సంస్థలు ఇప్పటికే ఒకరోజు సెలవును కేటాయించాయి. అయితే  ఓ దేశం అధికారికంగా మహిళల కోసం ఆ మూడు రోజులు సెలవులు కేటాయించాని నిర్ణయించింది. అదే స్పెయిన్. యూరోప్ లో మూడు రోజుల పాటూ పీరియడ్స్ లీవ్ ప్రకటించిన దేశంగా స్పెయిన్ అవతరించింది. 


గొప్పే కదా...
తమ బాధలను అర్థం చేసుకుని మూడు రోజుల పాటూ పీరియడ్స్ లీవ్ కేటాయించడంపై స్పెయిన్ మహిళలు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఆ సెలువుల తీసుకున్నా కూడా వారి ఆదాయం ఏమాత్రం తగ్గదు. అంటే ఆ మూడు రోజులు ఆదాయంతో కూడిన సెలవులను ఇవ్వబోతోంది స్పెయిన్ ప్రభుత్వం. కేవలం స్పెయిన్లోని ప్రభుత్వ అధికారులకే కాదు, ఆ దేశంలో ఉన్న ప్రతి సంస్థ దీన్ని పాటించాల్సిందే. 


స్పెయిన్ మంత్రి ఐరీన్ ఈ మేరకు ట్విట్టర్లో ‘బాధాకరమైన పీరియడ్స్ ప్రతి నెలా అనుభవించే మహిళలకు ఉన్న హక్కును మేము గుర్తిస్తున్నాం. నొప్పితో ఉద్యోగానికి వెళ్లడం, పీరియడ్స్ చుట్టూ అలుముకున్న అవమానాలు, నిశ్శబ్ధం వంటివి అంతం చేయడమే మా లక్ష్యం. మహిళల హక్కులపై పురోగతి సాధిస్తున్నాం. 


వాదనలు ఇలా...
స్పెయిన్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంలో కొంతమంది మండి పడుతున్నారు. ముఖ్యంగా పురుష ఉద్యోగులు అలాంటి విభజనను ఒప్పుకోవడం లేదు. కొంతమంది మహిళలు కూడా ఆ మూడు రోజులు తాము అసమర్ధులమా? అసౌకర్యంగా ఉన్నప్పటికీ జీవించడం నేర్చుకోవాలి కదా అని వాదిస్తున్నారు. అయితే రుతుక్రమ సమయంలో తీవ్రమైన నొప్పిని అనుభవించేవారికి మాత్రం ఈ సెలవులు చాలా అవసరం అని వివరిస్తోంది ప్రభుత్వం. కొందరిలో కేవలం అసౌకర్యమే కాదు విరేచనాలు, జ్వరం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. అలాంటి వారందరి గురించే ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పెయిన్ ప్రభుత్వం వివరిస్తోంది. స్పెయిన్ ప్రభుత్వాన్ని చూసి మిగతా ఐరోపా, ఆసియా దేశాలు కూడా ఇలంటి నిర్ణయాన్ని తీసుకుంటాయేమో చూడాలి.


Also read: ఫోన్‌తో అధిక సమయం గడుపుతున్నారా? ఈ వయసు వారిలో ఆత్మహత్యా ఆలోచనలు కలిగే అవకాశం


Also read: టమాటోలను పొడి చేసుకుని దాచుకోవచ్చు, ఎన్నాళ్లయినా చెక్కుచెదరదు