పట్టుదలే విజయానికి మొదటి మెట్టు. అలాంటి పట్టుదల మెండుగా ఉన్న వ్యక్తి కృష్ణా రెడ్డి. రెండు సార్లు స్టార్టప్ లు పెట్టి ఆర్ధికంగా దెబ్బతిన్నప్పటికీ, ఆంత్రప్రెన్యూర్ గా విజయం సాధించాలన్న పట్టుదల వదల్లేదు. ముచ్చటగా మూడోసారి స్టార్టప్ తో ముందుకొచ్చి విజయబాటలో ప్రయాణిస్తున్నారు. తన స్టార్టప్ ఆలోచనకు కారణం కరోనానే అంటున్నారు కృష్ణా రెడ్డి. కరోనా వల్ల అతడు తన తండ్రిని కోల్పోయారు. ఆ విషాదం నుంచి పుట్టిన అంకుర సంస్థే ‘క్యారీ నౌ’.
కృష్ణా రెడ్డిది అనంతపురం జిల్లా యల్లనూరు మండలం. అతని తండ్రి వెంకట మహేశ్వర రెడ్డి. గతేడాది మందుల కోసం తన గ్రామం నుంచి టౌన్ కి వెళ్లారు. అక్కడ మెడికల్ షాపు దగ్గర కరోనా సోకింది. ఆ సమయంలో కృష్ణా రెడ్డి బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నారు. మందుల కోసం టౌన్ కి వెళ్లకుండా ఉండుంటే తన తండ్రి జీవించి ఉండేవారన్న ఆలోచన కృష్ణా రెడ్డిని తొలిచేసింది. తన తండ్రిలాంటి వారెందరో ఇంటికి సరుకులు తెచ్చి పెట్టేవారు లేక కరోనా వేళ కూడా గ్రామాల నుంచి ప్రయాణాలు చేస్తున్నారు, వారందరి కోసం తానే ఓ డెలివరీ స్టార్టప్ మొదలు పెడితే బావుంటుందని భావించారు. ఉద్యోగానికి రాజీనామా చేసి తన గ్రామానికి వచ్చేసి గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టారు. తన స్టార్టప్ కు ‘క్యారీ నౌ’ అనే పేరు పెట్టారు.
ఈ ఏడాది జూన్ నుంచి తన కార్యకలాపాలు మొదలుపెట్టింది క్యారీ నౌ. గ్రామాల్లో ఇలాంటి స్టార్టప్ లు మొదలుపెట్టడం అంత సులువు కాదంటారు కృష్ణా రెడ్డి. గ్రామీణ ప్రజలకు నమ్మకం కుదిరితేనే ఆర్డర్లు ఇస్తారు. కనుక ముందు కొంతమంది యువతని, స్నేహితులను సాయంగా తీసుకుని ప్రతి ఇంటికి పాంప్లెట్ల ద్వారా తమ స్టార్టప్ గురించి ప్రచారం చేశారు. మెల్లగా రోజుకి రెండు మూడు ఆర్డర్లు రావడం మొదలుపెట్టాయి. వారి నుంచి కేవలం రూపాయి నుంచి రూ.15 వరకే డెలివరీ ఛార్జీలు వసూలు చేసేవారు. డెలివరీ బాయ్ లుగా గ్రామంలోని యువతనే రిక్రూట్ చేసుకోవడంతో ఆర్డర్లు కూడా పెరిగాయి.
ప్రస్తుతం అనంతపురంలోని 50 గ్రామాల్లో క్యారీ నౌ సేవలు అందుతున్నాయి. వంటింటి సరుకులు, మందులు, ఆహారం, పుస్తకాలు, పువ్వులు, పంట విత్తనాలు, ఎరువులు ... ఇలా ఏవైనా చెప్పిన షాపు నుంచి తెచ్చి ఇంటికే చేరుస్తారు. ఆల్కహాల్, కూరగాయలు తప్ప మిగతావన్నీ తెచ్చిస్తారు. కూరగాయలు గ్రామాల్లో అందుబాటులో ఉంటాయి.
వచ్చే అయిదేళ్లలో తమ సేవలను మరిన్ని గ్రామాలకు విస్తరించాలన్న ఆలోచనలో ఉన్నామని, దీని ద్వారా 50,000 మంది గ్రామీణ యువతకు తమ గ్రామంలోనే ఉపాధి కల్పిస్తామని చెబుతున్నారు. డెలివరీ కోసం వీరు బైక్ లు వాడరు, కేవలం ఎలక్ట్రిక్ సైకిళ్లనే వాడతారు. పెట్రోల్ ఖర్చు కూడా ఉండదు కాబట్టి అతి తక్కువ ఛార్జ్ కే డెలివరీ చేయగలుగుతున్నారు. కృష్ణా రెడ్డి విజయవాడలో బీటెక్ పూర్తి చేశారు. ఆరేళ్లు వివిధ కంపెనీలలో పనిచేశారు.
Read Also: గాల్లో జీవితాలు.. ఎయిర్ పోల్యూషన్‌తో ఆ సమస్యలు తప్పవంటున్న తాజా అధ్యయనం