Difference Between Gond and Gond Katira : వేసవి వేడిని తగ్గించుకుకోవడానికి వివిధ రకాల ఫుడ్స్‌ని సమ్మర్ డైట్లో చేర్చుకుంటారు. వాటిలో గోంద్ కటిరా కూడా ఒకటి. అయితే గోంద్ కటిరా అని కొనేప్పుడు చాలామంది గోంద్‌ని కొనేస్తారు. చూడడానికి కూడా ఇవి కాస్త దగ్గరపోలికతో ఉంటాయి. కానీ రెండూ ఒకటి కాదట. ఇవి రెండూ కూడా సహజమైన గమ్ములు. వీటి వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నా.. గోంద్‌ని మాత్రం సమ్మర్లో తీసుకోకూడదట. మరి ఈ గోంద్, గోంద్ కటిరా మధ్య తేడాలు ఏంటి? వాటిని ఎలా గుర్తించాలి? వాటి వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటో చూసేద్దాం.
గోంద్ అంటే ఏమిటి?
గోంద్ చూడడానికి షైనీగా, చూసేందుకు గాజు మాదిరిగా.. ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది. దీనిని నల్ల తుమ్మ చెట్టునుంచి తీస్తారు. తుమ్మ జిగురునే గోంద్ అంటారు. ఇది కాస్త బ్రౌన్ కలర్లో ఉంటుంది. దీనిని ఎడిబుల్ గమ్ అని కూడా అంటారు. దీనికి రుచి, వాసన ఉండదు. నీటిలో కరిగిపోయే లక్షణాన్ని కలిగి ఉంటుంది. అయితే దీనిని శీతాకాలంలో ఎక్కువగా తీసుకుంటారు. ఎందుకంటే ఇది శరీరంలో వేడిని పెంచుతుంది. అలాగే శక్తిని కూడా పెంచి.. ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. వేడిని పెంచుతుంది కాబట్టి దీనిని సమ్మర్లో తీసుకోకూడదు.
గోంద్ ప్రయోజనాలు..
ఈ గోంద్‌ను లడ్డూల్లో కలిపి తీసుకోవచ్చు. అలాగే ప్రసవం తర్వాత బాలింతలకు త్వరగా కోలుకునేందుకు ఇస్తారు. గోంద్లో కాల్షియం, ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలు, కండర బలానికి మంచిది. ఔషదాల తయారీలో కూడా ఉపయోగిస్తారు. శరీరానికి బలం అందించి మెటబాలీజం పెంచుతుంది. దీనివల్ల యాక్టివ్‌గా ఉంటారు. బరువు తగ్గుతారు. మోకాళ్లలో జిగురు తగ్గినవారు కూడా దీనిని తీసుకోవచ్చు.
గోంద్ కతిరా
గోంద్ కతిరాను ఆల్మండ్ గమ్ అంటారు. ఇది చూడడానికి గోంద్ కంటే డల్‌గా ఉంటుంది. ట్రాన్స్పరెంట్గా ఉండదు. దీనికి శరీరంలోని వేడిని తగ్గించే లక్షణం ఉంటుంది. అందుకే దీనిని సమ్మర్లో తీసుకుంటారు. దీనిని నీటిలో నానబెడితే జెల్లీలా మారుతుంది. మృదువుగా, చప్పగా ఉంటుంది.
గోంద్ కతిరా ప్రయోజనాలు..
గోంద్ కతిరాను సమ్మర్లో శరబత్ చేసుకుని లేదా ఫలూదా లేదా ఇతర డ్రింక్స్‌లలో కలిపి తీసుకోవచ్చు. శరీరంలోని వేడిని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. చర్మ సంరక్షణ అందిస్తుంది. మాయిశ్చరైజ్ చేస్తుంది. మూత్ర సంబంధిత సమస్యలు దూరమవుతాయి. బరువు పెరగడానికి హెల్ప్ చేస్తుంది. ఫైబర్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి మలబద్ధకం సమస్య దూరమవుతుంది.
గోంద్, గోంద్ కతిరా రెండూ ఆరోగ్యానికి మంచివే. గోంద్‌ను సమ్మర్లో వాడకూడదు. గోంద్ కతిరాను నానబెట్టకుండా వాడకూడదు. అవసరాన్ని బట్టి వీటిని మీ డైట్లో చేర్చుకోవచ్చు. గుర్తించుకోవాల్సిన విషయం ఏంటి అంటే.. ఎంత మంచిదైనా దానిని లిమిటెడ్‌గా తీసుకుంటే మంచి ప్రయోజనాలు అందుతాయి.