Microplastics in Glass Bottle : ప్లాస్టిక్ వాడద్దంటూ ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు చాలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాయి. ప్లాస్టిక్ వాడితే వాటిలోని మైక్రోప్లాస్టిక్​లు శరీరంలోనికి వెళ్లి ఆరోగ్యానికి ఇబ్బంది కలిగిస్తాయని.. పర్యావరణానికి కూడా అంత మంచిది కాదని చెప్తారు. ఈ నేపథ్యంలోనే చాలామంది ప్లాస్టిక్ బాటిల్స్​కు బదులుగా గాజు సీసాలు వినియోగిస్తుంటారు. మీరు కూడా అలాంటివారిలో ఒకరా? అయితే ఇది మీరు కచ్చితంగా చదవాల్సిందే. 

న్యూ స్టడీ

గాజు సీసాల వినియోగం సురక్షితమని చాలామంది భావిస్తారు. కానీ సురక్షితం కాదని.. ప్లాస్టిక్, మెటల్ బాటిళ్ల కంటే 50 రెట్ల ఎక్కువ మైక్రోప్లాస్టిక్​లు గాజు సీసాల్లో ఉంటాయని రీసెంట్​గా జరిపిన అధ్యయనంలో తేలింది. ఫ్రాన్స్ ఆహార భద్రతా సంస్థ ANSES గాజు సీసాల వినియోగంపై అధ్యయనం జరిపింది. ఆ రిజల్ట్స్ షాకింగ్ ఫలితాలు ఇవ్వడంతో జర్నల్ ఆఫ్ ఫుడ్ కంపోజిషన్ అండ్ అనాలిసిస్‌లో దీనిగురించి ప్రచురించింది. ఆ విషయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

ఈ అధ్యయనంలో భాగంగా ANSES పరిశోధకులు ప్లాస్టిక్, గాజు, మెటల్ బాటిల్స్​పై స్టడీ చేశారు. నీరు, కూల్ డ్రింక్స్, ఐస్డ్ టీ, నిమ్మరసం, బీరు, వైన్ వంటి 56 పానీయాల నమూనాలు సేకరించి విశ్లేషించారు. దీనిలో భాగంగా తేలింది ఏంటంటే గాజు సీసాల్లోనే అత్యధిక మైక్రోప్లాస్టిక్​లు ఉన్నాయట.  

అధ్యయన ఫలితాలు.. 

లీటర్ బీర్ బాటిల్​లో లీటర్​కు 82.9 మైక్రోప్లాస్టిక్ కణాలు ఉన్నట్లు గుర్తించారు. ఇవే అన్నింటికంటే ఎక్కువ. నిమ్మసరంలో లీటర్​కు 45.2 మైక్రోప్లాస్టిక్ కణాలు ఉన్నాయట. లీటర్ ఐస్డ్ టీలో 28.5, లీటర్ నీటిలో 2.9 శాతం మైక్రోప్లాస్టిక్ కణాలు ఉన్నట్లు గుర్తించారు. నీరు అత్యల్ప స్థాయిలో ఉన్నా.. ప్లాస్టిక్ బాటిల్​లో నీరు కంటే ఎక్కువ మైక్రోప్లాస్టిక్ కణాలు కలిగి ఉన్నాయనే తేలింది. 

కారణాలు ఇవే.. 

గాజు సీసాల్లో నీరు ఉంచితే ఎందుకు మైక్రోప్లాస్టిక్ కణాలు ఎక్కువగా ఉంటున్నాయనే దానిపై మరింత పరిశోధన చేశారు. ఎక్కువ గాజు సీసాలకు ప్లాస్టిక్​ మూతలు కలిగి ఉంటున్నాయి. వీటిద్వారా మైక్రోప్లాస్టిక్ కణాలు పానీయాల్లోకి చేరుతున్నట్లు గుర్తించారు. అంతేకాకుండా గాజు సీసాలపై ఉపయోగించే పెయింట్, రంగు వంటివి కలుస్తున్నట్లు అధ్యయనంలో తేలింది. ఆ రకంగా బీర్​లో ఎక్కువ మైక్రోప్లాస్టిక్ కణాలు కలుస్తున్నాయి.

వైన్​కి కార్క్ మూతను ఉపయోగించడం చాలా తక్కువ ఇంపాక్ట్ ఉందని తెలిపారు. బీర్​ కంటే వైన్​లో తక్కువ మైక్రోప్లాస్టిక్ పార్టికల్స్ ఉంటాయి. కాబట్టి బీర్​ని ఎక్కువగా తాగేవారు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే బీర్​తో వచ్చే ఆరోగ్య సమస్యలతో పాటు మైక్రోప్లాస్టిక్​ల వల్ల వచ్చే ఇబ్బందులు కూడా పెరుగుతాయి.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

మీరు ఉపయోగించే గాజు సీసాలకు ప్లాస్టిక్ మూతలు ఉంటే.. వాటిని వినియోగించే ముందు శుభ్రంగా కడిగి ఆరబెట్టడం వల్ల మైక్రోప్లాస్టిక్​ కాలుష్యాన్ని మూడు రెట్టు తగ్గించవచ్చట. పెయింటింగ్​లు, రంగులు లేని వాటిని ఎంచుకుంటే మంచిది. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.