Adilabad Tiger News: ఆదిలాబాద్ జిల్లా బోథ్ అడవుల్లో పెద్దపులి మరోసారి ప్రవేశించింది. తాజాగా బోథ్ మండలంలోని నారాయణ్ పూర్, రఘునాథ్ పూర్ అటవీ ప్రాంతంలో అటవి ప్రాంతంలో అమర్చిన కెమెరాలలో పెద్దపులి కదలికలు కనిపించాయి. రుతుపవనాల రాకతో తోడు వెతుక్కుంటూ మహరాష్ట్రలోని తిప్పేశ్వర్ అభయారణ్యం నుంచి కవ్వాల్ అభయారణ్యానికి పులులు వస్తున్నాయి. భీంపూర్, డెడ్రా, తలమడుగు, ఘన్‌పూర్, నిగిని, మర్లపెల్లి అడవుల మీదుగా బోథ్, సారంగపూర్ సరిహద్దు అటవీ ప్రాంతంలో పెద్దపులి ప్రవేశించినట్లు అధికారులు భావిస్తున్నారు.
తాజాగా బోథ్, సారంగాపూర్ మండలాల సరిహద్దు అటవీ ప్రాంతంలో అమర్చిన కెమెరాలలో పులి కదలికలు గుర్తించినట్లు బోథ్ అటవీ రేంజ్ అధికారి ప్రణయ్ తెలిపారు. ఈ విషయమై బోథ్ అటవీ రేంజ్ అధికారి ప్రణయ్ ను abp దేశం ఫోన్ ద్వారా వివరణ కోరగా.. ఆయన పలు విషయాలు వెల్లడించారు. పులి సంచారం వస్తవేమేనన్నారు. అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాలో పులి సంచరిస్తున్నట్లు కనిపించిందన్నారు. అటవీ ప్రాంతంలో మూడు రోజులుగా పులి సంచరిస్తున్నట్లు గుర్తించారు. ప్రస్తుతం పులి అడవిలోనే సంచరిస్తుందని,జనసంచారం ఉండే ప్రాంతాలకు రావడం లేదని కాబట్టి అటవీ సమీప గ్రామాలలో ఉండే జనాలు భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. కానీ అప్రమత్తంగా ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లో అడవిలోకి వెళ్ళకూడదని హెచ్చరిస్తున్నారు అటవీ అధికారులు.
బోథ్ మండలానికి దక్షిణాన ఉన్న అటవి ప్రాంతం 1,600 హెక్టార్లలో దట్టంగా విస్తరించి ఉంది. పులి ఆహారానికి సరిపడా సాధు జంతువులు అడవిలో సమృద్ధిగా ఉండడంతో ప్రస్తుతం బోథ్ అటవీ ప్రాంతం పులి నివాసానికి ఆమోదయోగ్యంగా ఉంది. దీంతో ఎలాంటి ఆటంకాలు కలగకపోతే మరి కొన్ని రోజుల పాటు పులి బోథ్ అడవుల్లోనే సంచరించే అవకాశం ఉంది.
గడిచిన సంవత్సర కాలంలో బోథ్ అడవుల్లో పులి సంచారం ఇది రెండోసారి. గత సంవత్సరం అక్టోబర్, నవంబర్ మాసాలాలో బోథ్ అటవీ ప్రాంతంలో కొన్ని రోజుల పాటు తిరిగిన జానీ పెద్దపులి తర్వాత సారంగాపూర్, భైంసా అటవీ ప్రాంతంలో సంచరించి చివరికి కవ్వాల్ అటవీ ప్రాంతంలో ప్రవేశంచింది. అక్కడ నుంచి ఉట్నూర్, నార్నూర్, గాదిగూడ మీదుగా మహారాష్ట్రలో ప్రవేశించి మళ్ళీ కాగజ్ నగర్ కారిడార్‌లో ప్రవేశించింది.
సాధారణంగా కేవలం తోడు కోసం మాత్రమే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి పులులు వలస వెళ్తాయి. తిప్పేశ్వర్ అభయారణ్యంలో ఉండే పులులు తోడు కోసం కవ్వాల్ అభయారణ్యనికి వలస వెళ్లడం సాధారణమే. తిప్పేశ్వర్ నుంచి కవ్వాల్‌కు వెళ్లడానికి పులులు పెన్ గంగా నదిని దాటి జిల్లాలోని భీంపూర్, తాంసీ, తలమడుగు మీదుగా బజార్ హత్నూర్ మండలంలోని డెడ్రా అడవులలో ప్రవేశిస్తాయి. అక్కడి నుంంచి బోథ్, మహారాష్ట్ర సరిహద్దు అటవీ ప్రాంతం గుండా నిగిని, మర్లపెల్లి అడవుల్లో వస్తాయి. ఆపై బోథ్, సారంగాపూర్ సరిహద్దు అటవీ ప్రాంతంలో ప్రవేశించి అక్కడి నుంచి సారంగపూర్, మామడ అడవిగుండా ప్రయాణిస్తాయి. అలా కవ్వాల్ అభయారణ్యానికి చేరుకోవడం సహజంగా జరుగుతోంది. ప్రతి ఏడాది ఈ మార్గంగుండానే పులులు కవ్వాల్ అటవీ ప్రాంతంలో ప్రవేశించడానికి ప్రయత్నిస్తు ఉంటాయి.పులులు వస్తున్నా పట్టింపు ఏది?
ప్రతి ఏడాది తిప్పేశ్వర్ అభయారణ్యం నుంచి కవ్వాల్ అటవీ ప్రాంతంలో పులులు ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నా అటవీ శాఖ నుంచి కనీస స్పందన ఎందుకు ఉండడం లేదనే ప్రశ్న ఉత్పన్నమవుతున్నాయి. గత దశబ్ధ కాలంలో ప్రతి ఏడాది పులులు వస్తున్నప్పటికి జాతీయ రహదారి దాటి మామడ అటవీ ప్రాంతంలో పులులు ప్రవేశించిన దాఖలాలు లేవు. గత ఏడాది ఎట్టకేలకు పులులు కవ్వాల్ అటవీ ప్రాంతంలో ప్రవేశించిన అక్కడ పులి ఎక్కువ రోజులు ఉండలేకపోయింది. తోడే లక్ష్యంగా వలస వస్తున్న పులుల కోసం ఆడ పులులను కవ్వాల్ టైగర్ రిజర్వ్ అటవీ ప్రాంతంలో తీసుకుని వస్తే వలస వస్తున్న పులులు ఆగుతాయి. దీంతో కవ్వాల్ అటవీ ప్రాంతంలో పులుల ఆవాసం మొదలై పులుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అయినా అటవీశాఖ ఆవైపు ఎందుకు ఆలోచించడం లేదనేది చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ప్రస్తుతం బోథ్ అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న పెద్దపులి కవ్వాల్ అటవీ ప్రాంతంలోకి చేరి అక్కడే ఉండిపోయేలా చేయాలని ప్రకృతి ప్రేమికులు కోరుతున్నారు.