Raw Food Side Effects: ఆకు కూరలు, కాయగూరలు, పండ్లు ఆరోగ్యానికి మంచివే. కానీ, చాలామంది డైటింగ్‌లో భాగంగా పచ్చి కూడరగాయాలను తినేస్తుంటారు. అయితే, వాటిలో కొన్ని శరీరానికి మేలు చేస్తే.. మరికొన్ని కీడు చేస్తాయి. వాటిలో పోషకాల మాట దేవుడెరుగు.. మన శరీరానికి పడని విష పదార్థాలు అస్వస్థతకు గురిచేస్తాయి. అందుకే, కూరగాయలను ఉడికించి తినడమే ఉత్తమ మార్గం. ఉడికించిన ఆహారం ఎంతో సురక్షితం, ఆరోగ్యకరం కూడా. 


మరి ఏయే ఆహారాలను ఉడికించకుండా పచ్చిగా తినకూడదు తెలుసుకుందామా!
అనపకాయల గింజలు(లిమా బీన్స్): చిక్కుడు కాయల తరహాలో ఉండే అనపకాయల నుంచి వచ్చే గింజలు చాలా టేస్ట్‌గా ఉంటాయి. అయితే, వాటిని ఎట్టి పరిస్థితిలో పచ్చిగా తినకూడదు. అది సైనెడ్ తరహాలో విషపూరితమయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి, వాటిని పూర్తిగా ఉడికించిన తర్వాతే ఆహారంగా తీసుకోవాలి. 


అడవి పుట్టగొడుగులు: మన ఇంటి ఆవరణలో కూడా కొన్ని పుట్టగొడుగులు పెరుగుతాయి. ఇక అడవుల్లో ఎక్కడ చూసినా అవే కనిపిస్తాయి. అయితే, వాటిలో కొన్ని మాత్రమే మనకు తినేందుకు పనికివస్తాయి. వాటిలో చాలావరకు పుట్టగొడుగులు విషపూరితమైనవి. పొరపాటున కూడా వాటిని చిదిమి అక్కడికక్కడే పచ్చిగా తినేయాలని మాత్రం ప్రయత్నించకండి. దానివల్ల వెన్ఫెక్షన్లు, ఫుడ్ పాయిజనింగ్ జరగవచ్చు. పుట్టగొడుగులను ఎప్పుడు ఉడికించే తినేలి. 


రెడ్ కిడ్నీ బీన్స్: ఎర్ర రంగులో ఉండే ఈ బీన్స్‌ను రాజ్మా అని కూడా పిలుస్తారు. కిడ్నీ బీన్స్‌లో లెక్టిన్ ఉంటుంది. పచ్చిగా తింటే, కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు మొదలైన సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి, ఎర్రగా బాగున్నాయి కదా అని వాటిని పచ్చిగా తినొద్దు. 


వంకాయ: వంకాయను కూడా పచ్చిగా తినేస్తారా? అనే సందేహం మీలో ఉండవచ్చు. అలా తినేవాళ్లు ఉంటారు. నేరుగా పోషకాలు అందాలనే ఉద్దేశంతో కొందరు వంకాయను పచ్చిగా తినేస్తుంటారు. కొందరు లైట్‌గా పొయ్యి మీద వేడి చేసి తింటారు. అయితే, వంకాయలో సోలనిన్ అనే విషపూరిత సమ్మేళనం ఉంటుంది. పచ్చి వంకాయలను తినడం వల్ల సోలనిన్ విడుదలై జీర్ణశయాంతర సమస్యలను తెస్తుంది. 


బంగాళాదుంపలు: కొందరికి బంగాళా దుంపలను పచ్చిగా తినడమంటే ఇష్టం. కానీ, అలా ఎప్పుడూ చేయొద్దు. మీకు వాటిని అంతగా తినాలనే కోరిక పుడితే ఉడికించి మాత్రమే తీసుకోండి. ‘గ్లైకోఅల్కలాయిడ్ టాక్సికేషన్’ కారణంగా పచ్చి బంగాళాదుంపలు మీ జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. పిల్లలకు పచ్చి బంగాళ దుంప తినిపించడం మరింత డేంజర్. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. 


Also Read: ప్రియుడి కండోమ్‌కు సీక్రెట్‌గా రంథ్రాలు చేసిన మహిళ, ఊహించని శిక్ష విధించిన కోర్టు!


పచ్చి కూరగాయలు అన్ని వేళలా మంచివి కావు: కూరగాయలు ఎక్కడ పెరుగుతాయో మీకు తెలిసిందే. వాటి మీద అనేక రసాయనాలు, బ్యాక్టీరియాలు ఉంటాయి. అందుకే, వాటిని బాగా శుభ్రం చేసిన తర్వాతే తినాలి. కానీ, నీటితో శుభ్రం చేయడం వల్ల కొంతవరకు మాత్రమే క్లీన్‌గా ఉంటాయి. కానీ, బ్యాక్టీరియా పూర్తిగా చనిపోదు. పాలకూర, బ్రకోలి, కాలిఫ్లవర్‌లను ఉప్పు నీటిలో నానబెడితే కొంతవరకు బ్యాక్టీరియా నాశనమవుతుంది. 


Also read: షిగెల్లా బ్యాక్టిరియా వల్ల మనదేశంలో తొలి మరణం? జాగ్రత్త ఈ బ్యాక్టిరియా అంటువ్యాధి


గమనిక: ఈ కథనాన్ని కేవలం మీ అవగాహన కోసమే అందించాం. ఇది వైద్యానికి లేదా ఆహార నిపుణుల సూచనలను ప్రత్యామ్నాయం కాదు. మీరు ఏదైన ఆహారాన్ని తీసుకొనే ముందు లేదా డైట్ పాటించాలంటే తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించి సలహా తీసుకోవాలి. ఈ కథనంలో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదు.