Weather Updates: దక్షిణ అండమాన్ సముద్రంలో నిన్న అల్పపీడనం ఏర్పడింది. ఇది క్రమంగా వాయువ్య బంగాళాఖాతం దిశగా కదులుతూ నేటి సాయంత్రానికి బెంగాల్ తీరాన్ని చేరే అవకాశం ఉందని, మే 8న వాయుగుండంగా మారుతుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మరో రెండు రోజులుల తేలికపాటి జల్లులు కురవనున్నాయి. ప్రస్తుతం వాయువ్య మధ్యప్రదేశ్ నుంచి విదర్భ, తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు మీదుగా కొమోరిన్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తు వరకు అల్పపీడన ద్రోణి విస్తరించి ఉంది. దక్షిణ అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాలలో ఉపరిత ఆవర్తనం మద్య ట్రోపో ఆవరణం వరకు విస్తరించి ఉంది. అల్పపీడనం వాయువ్య దిశగా కదులుతూ తదుపరి 24 గంటల్లో క్రమంగా బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఏపీ, తెలంగాణలో రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని, ఎండల నేపథ్యంలోనూ పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది.
ఉత్తర కోస్తాంధ్ర, యానాం..
ఉత్తర కోస్తాంధ్ర ప్రాంతాలైన ఉమ్మడి విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో, యానాం ప్రాంతాల్లో మరో రెండు రోజులపాటు తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. దక్షిణ అండమాన్‌లో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురవనున్నాయి. పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. తీరం వెంట గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఒకట్రెండు చోట్ల గాలులు వీచే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తాంధ్రలో ఇలా..
అల్పపీడనం ప్రభావం ఈ ప్రాంతంలో కొంతమేర ఉంటుంది. మరో రెండు రోజులపాటు తేలికపాటి జల్లుల నుంచి ఒకట్రెండు చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని సూచించారు. మరోవైపు పలు జిల్లాల్లో 40 డిగ్రీల మేర పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రైతులు ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈదురుగాలులు గంటలకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచనున్నాయి.
రాయలసీమలో తేలికపాటి జల్లులు..
రాయలసీమ జిల్లాలైన ఉమ్మడి కర్నూలు, అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాల్లో మరో రెండు రోజులపాటు తేలికపాటి జల్లులు కురవనున్నాయి. కొన్నిచోట్ల వాతావరణం పొడిగా మారనుంది. ఒకట్రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలుంటాయి. గడిచిన 24 గంటల్లో రాయలసీమలోని కర్నూలు, తిరుపతి, నంద్యాల, అనంతపురంలో 40 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని అమరావతి వాతావరణ కేంద్ర సంచాలకులు తెలిపారు.
తెలంగాణలో తేలికపాటి జల్లులు..
దక్షిణ అండమాన్‌లో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో మే 8 వరకు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు రాష్ట్రంలో చాలా చోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. నగరంలో గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీలు నమోదైంది. రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలలో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నందున ఎల్లో అలర్ట్ సైతం జారీ చేసింది వాతావరణ కేంద్రం. ఒకట్రెండు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం పేర్కొంది.
Also Read: Horoscope Today 7th May 2022: ఈ రాశివారు తొందరగా మోసపోతారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి